రాష్ట్రంలో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు
హామీలను ఎగవేసేందుకే శ్వేతపత్రాలు
ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌పై
పోరాటం తెలంగాణ గళం, బలం,దళం బిఆర్‌ఎస్
బిఆర్‌ఎస్ ఎంపిలు గెలవకపోతే పార్లమెంట్‌లో
తెలంగాణ అనామకమవుతుంది తెలంగాణ
హక్కుల గురించి మాట్లాడడం బిజెపి, కాంగ్రెస్
వల్ల కాదు కాంగ్రెస్ ఆగడాలను క్షేత్రస్థాయిలో
ఎండగడతాం చిన్న చిన్న లోపాలతోనే
ఓడిపోయాం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కెటిఆర్ పార్టీ లోక్‌సభ సన్నాహక సమావేశాలు
ప్రారంభం తొలిరోజు జరిగిన ఆదిలాబాద్
సభకు భారీగా తరలివచ్చిన జిల్లా నేతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ గళం, బలం,దళం పార్లమెంట్‌లో చూడాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కేవలం బిఆర్‌ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ అనే పేరు అనామకం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో బిఆర్‌ఎస్ ఎంపిలు లేకపోతే తెలంగాణ అనే పదమే మాయం అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పారు. తెలంగాణ డిమాండ్లను కాంగ్రెస్, బిజెపి ఎంపీలు ఎప్పుడూ ప్రస్తావించలేదని గుర్తు చేశారు. తెలంగాణ డిమాండ్లను కాంగ్రెస్,బిజెపి ఎంపీలు ఎప్పుడూ ప్రస్తావించలేదని కెటిఆర్ గు ర్తు చేశారు. తెలంగాణ గురించి పార్లమెంటులో రాహుల్‌గాంధీ, నరేంద్ర మోడీ ఎప్పుడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు.
ప్రధాని మోడీ తెలంగాణ పుట్టుకనే అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నేతలతో కెటిఆర్ సుదీర్ఘంగా చ ర్చించారు. అనంతరం మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులతో కలిసి కెటిఆర్ విలేకరులతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిని బిజెపి ఎంపి బండి సంజయ్ పొగడటం చూస్తుం టే వారిద్దరి మధ్య మంచి అవగాహన ఏర్పడినట్లుందని అర్థమవుతుందని పేర్కొన్నారు. కాం గ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచిందని కెటిఆ ర్ విమర్శించారు. కేవలం ఆరు గ్యారంటీలే కా దు..420 హామీలు అమలును ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్ర కటించిన 420 హామీలను ఒక పుస్తకం రూపొందించి తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు అందజేశామని, రాష్ట్రంలోకి ప్రతి ఇంటికీ ఈ పుస్తకం వె ళ్లేలా చూస్తామని చెప్పారు. శ్వేతపత్రాలు,ల్యాండ్‌క్రూజర్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హా మీలు దాటవేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఎన్నికల హామీలను ఎత్తగొట్టేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు అంటూ ప్రజల దృ ష్టి మళ్లించే దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అబద్దాలు, దుష్ప్రచారంతో కృత్రిమ అనుకూలతను సృష్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అలాగే పాలన చేయాలని భావిస్తున్నట్లు అనిపిస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోరని, ఆ హామీలు అమలు చేసేలా తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. దేశం లో విఫలమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని విఫలరాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తమ హయాంలో ప్రతి రోజు రైతుబంధు డబ్బులు ఎంతపడ్డాయో ప్రకటించేవాళ్లమని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ బిఆర్‌ఎస్ నేతలపై దాడులకు దిగుతోందని మండిపడ్డారు. తమ పార్టీ నేతలపై దాడులు జరిగితే పార్టీ అధిష్టానం అక్కడికి వెళ్లి తమ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలబడుతుందని తెలిపారు. కాంగ్రెస్ ఆగడాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతామని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఎందుకు వేయాలంటే…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్కు ఎందుకు ఓటు వేయాలో కెటిఆర్ వివరించారు. “తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే..తెలంగాణ అన్న మాట ధైర్యంగా ఉచ్చరించబడాలంటే.. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేకుండా కొట్లాడాలంటే.. తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాక కలబడాలి…నిలబడాలంటే అది సాధ్యమయ్యేది బిఆర్‌ఎస్‌కు మాత్రమే” అని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బిఆర్‌ఎస్ అని …ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. గత పదేళ్ల కార్యాచరణ చూస్తే పార్లమెంట్‌లో తెలంగాణ అనే మాట ప్రతి సమయంలో ప్రతిధ్వనించిందంటే..
దానికి బిఆర్‌ఎస్ ఎంపీలు కారణమనిపేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ వాయిస్ అంటే బిఆర్‌ఎస్ అనే మాట అందరికీ తెలుసు అని చెప్పారు. ప్రతి రాష్ట్రానికి భారతదేశంలో ఓ ప్రత్యేకమైన రాజకీయ అస్థిత్వం ఉంటుందని, అలాగే ప్రతి పార్టీకి ఓ ప్రత్యేకమైన అస్థిత్వం ఉంటుందని కెటిఆర్ చెప్పారు. బెంగాల్ అనగానే గుర్తించేది మమతా బెనర్జీ అని, తమిళనాడు అనగానే గుర్తుకు వచ్చేది డిఎంకె స్టాలిన్.. లేదంటే అన్నా డిఎంకె పార్టీ గుర్తుకు వస్తుందపి. అలాగే ఎపి అంటే గుర్తుకు వచ్చేది జగన్.. చంద్రబాబు నాయుడు అని, అక్కడ రెండు పార్టీలదే అక్కడ ప్రభావం ఉన్నదని పేర్కొన్నారు. అదేవిధంగా ఒడిశా అనగానే గుర్తుకు వచ్చేది నవీన్ పట్నాయక్, బీహార్ అంటే గుర్తుకు వచ్చేది నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్, మహారాష్ట్ర అనగానే గుర్తుకు వచ్చేది శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే అని, తెలంగాణ అంటే గుర్తుకు వచ్చేది భారతదేశమంతా వెంటనే స్ఫురించే పేరు, గుర్తుకు వచ్చే రూపం కెసిఆర్, బిఆర్‌ఎస్ అని తెలిపారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా లేరని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నరు…
కెసిఆర్ ముఖ్యమంత్రిగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని జిల్లాల నేతలు చెబుతున్నారని కెటిఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న చిన్న లోపాలతోనే ఓడామని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పారని కెటిఆర్ పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం లో ఉన్నప్పుడు తీసుకువచ్చిన కొన్ని కార్యక్రమాలు, పెట్టి న పథకాల్లో కొన్ని సవరణలు చేస్తే బాగుండేదని… కొన్ని లోటుపాట్లుండే.. వాటిని కూడా సవరిస్తే బాగుండేదని అభిప్రాయాన్ని చాలా నిక్కచ్చిగా చెప్పారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయింది కేవలం 1.85 శాతం… 5లక్షల ఓట్ల తేడాతోనే అని, చిన్నచిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది అనే మాట చెప్పారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్, బిజెపి పార్టీలు సహకరించుకున్నాయని కెటిఆర్ చెప్పారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ నేతలను ఓడించడానికి నిమాజాబాద్, కరీంనగర్‌లో కాంగ్రె స్, బిజెపి పార్టీలు కలిసి పనిచేశాయని గుర్తు చేశారు. పదేళ్లు బిఆర్‌ఎస్ పార్టీ నిర్మాణంపై ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని తమ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారని కెటిఆర్ అన్నారు. తొలిరోజు బిఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం 11.30 గంటలకు సమావేశం ప్రారంభిస్తే.. దాదాపు 5.30 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిందని అన్నారు. తమ పార్టీ నేతలు చెప్పిన ప్రతిమాట.. ప్రజల నుంచి వస్తున్న గొంతుగా, అభిప్రాయంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్యానించారు.
దుష్ప్రచారాన్ని సరైన సమయంలో ఖండించలేకపోయాం…
ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము అన్నట్లు.. అవతలివాళ్లు చెప్పిన అబద్ధాలను, దుష్ప్రచారాన్ని సరైన సమయంలో ఖండించలేదని కెటిఆర్ అన్నారు. భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ నియామకాలు చేసి కూడా సమర్థవంతంగా చెప్పుకోలేకపోయామని, సోషల్ మీడియాలో కూడా ఇంకా బాగా చెప్పాల్సిందని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి.. వారిలో రిజిస్టర్ చేయడంలో చిన్నచిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిగా అడ్రస్ చేయలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. కాళేశ్వరంపై ఏ విచారణకైనా తాము సిద్ధమే అని అసెంబ్లీలో తామే డిమాండ్ చేశామని కెటిఆర్ గుర్తు చేశారు. తాము బిజెపికి బీ టీం అని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజెందర్ వంటి బిజెపి అగ్రనేతలను ఓడించిందని బిఆర్‌ఎస్సే అని కెటిఆర్ తెలిపారు. బిజెపి మత విద్వేషం తప్ప ఏమీ చేయదని, బిజెపితో పోరాడాలంటే కెసిఆర్ లాంటి బలమైన నాయకుడు కావాలని కెటిఆర్ అన్నారు.