Tuesday, November 19, 2024

కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదిలాబాద్ అభ్యర్థిని నాలుగు నెలల ముందే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బూత్‌స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కెటిఆర్ ప్రసంగించారు. ఆత్రం సక్కు లాంటి సీనియర్ నాయకుడు పార్లమెంటులో ఉండాలని, అధికారంలో పోగానే కొందరు తమదారులు వెతుక్కుంటూ వెళ్లిపోయారని, ఆదివాసీ బిడ్డ ఆత్రం సక్కు కష్టాల్లోనూ పార్టీతోనే ఉన్నారని, మంత్రి పదవులు చేపట్టిన వాళ్లు కూడా పార్టీ నుంచి జారుకున్నారని, ఆత్రం సక్కు విలువలు ఉన్న నాయకుడు అని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 120 రోజులైందని, అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారని, కాంగ్రెస్ నాయకులు 420 హామీలు ఇచ్చారని, వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని డైలాగులు కొట్టారని, డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పటి వరకు చేయలేదని, పంద్రాగస్టు వరకు పూర్తి చేస్తామని రేవంత్ ఇప్పుడు మాట మారుస్తున్నారని కెటిఆర్ ధ్వజమెత్తారు.

జనం వీపుసాపు చేస్తారని మళ్లీ పంద్రాగస్టు అంటున్నాడని, రుణమాఫీ కావాలంటే గులాబీ జెండాకే ఓటేయాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాత పెట్టాలని, లంకెబిందెలు ఉన్నాయనుకొని వచ్చానని రేవంత్ అంటున్నాడని, అర్ధరాత్రి లంకె బిందెల కోసం తిరిగేదెవరు? అని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలేనా?, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని ఒక మంత్రి అంటున్నాడని, కెసిఆర్ పాలనలో రూ.70 వేల కోట్లు రైతు బంధు సాయం చేశామని, టింగు టింగుమంటూ రైతు బంధు డబ్బులు అకౌంట్లో పడేవని, మే 13న రైతులు చెప్పులు తీసి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. కెసిఆర్ పాలనలో టైమ్‌కి విత్తనాలు, ఎరువులు వచ్చేవని, బిఆర్‌ఎస్ హయాంలో కడుపునిండా నీళ్లు ఇచ్చామని, కాంగ్రెస్ వచ్చింది కరువును తెచ్చిందని మండిపడ్డారు. మళ్లీ కరెంటు కోతలు… మంచి నీళ్లకు గోస వచ్చిందని, ఆసిఫాబాద్ మన్యంలో కూడా ఇంటింటికి తాగు నీరు అందించామని, ఒకనాడు మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవని, గత పదేళ్లలో ఆ వార్తలు బంద్ అయ్యాయని, నీళ్ల కోసం మళ్లీ దేవులాడుకునే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారని రేవంత్ ముందే చెప్పారని, పదేళ్లలో మనం చేసిన పనులను ప్రజలకు చెప్పుకోలేకపోయామని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం 1,60,283 ఉద్యోగాలు ఇచ్చిందని, మొన్న రేవంత్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా బిఆర్‌ఎస్ భర్తీ చేసినవేనని కెటిఆర్ చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News