Monday, January 20, 2025

కాంగ్రెస్‌ది ఓట్ల నాడు ఒక మాట.. నాట్ల నాడు మరో మాట: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇది ప్రజా పాలన కాదు అని, రైతు వ్యతిరేక పాలన అని, నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారని, ఇప్పుడు కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరిపంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారని, ఇప్పుడు సన్నవడ్లకే అన్నడంతో కపట కాంగ్రెస్ మార్కు మోసం, దగా, నయవంచన బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యారెంటీ కార్డులో అప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని ఎందుకు చెప్పలేదని అడిగారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ? అని చురకలంటించారు.

కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారన్నారు.” ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా ఇస్తాం, వ్యవసాయ కూలీలకు రూ.12000 వేలు ఇస్తాం, ప్రతి రైతుకు డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎందుకు చేయలేదు” అని కెటిఆర్ చురకలంటించారు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారని దుయ్యబట్టారు. ఓట్ల నాడు ఒకమాట, నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజమని, అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసిందదని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే.. నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని, ఎద్దేడ్సిన యవుసం, రైతేడ్చిన రాజ్యం నిలబడదని, నమ్మి ఓటేసినందుకు రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టకుండా పల్లె పల్లెనా ప్రశ్నిస్తారని, తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారని, కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తామని, నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ అయిందని కెటిఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News