కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ
ఎంఎల్‌సి రామచంద్రరావు ట్వీట్లకు
కెటిఆర్ ఘాటు సమాధానం
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై కెటిఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యపై స్పందించకుండా అనవసర విషయాలను మధ్యలోకి తెచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌సి రామచంద్రరావు చేసిన ట్వీట్లకు కెటిఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. కేంద్రంలోని బిజె పి అధ్వర్యంలోని ఎన్డీయే సర్కారు ఉదాసీనతపై తాము ప్రశ్నించామ ని, బిజెపి సర్కార్ రాష్ట్రాలపై ఎలా పక్షపా తం చూపి దెబ్బతీస్తుందో తాను అంటే.. కిషన్‌రెడ్డి మాత్రం అసందర్భ సమస్యలను తెరపైకి తెచ్చి అదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా కెటిఆర్ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రం స్పందించనందుకే ‘ఈక్వాలిటీఫర్ తెలంగాణ’ ఉద్యమం మొదలైందని కెటిఆర్ స్పష్టం చేశారు. దమ్ముంటే ఆయా అంశాలపై కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని సవాల్ విసిరారు. గత ఎనిమిదేండ్లు దేశాన్ని పాలిస్తున్న గాడ్సే ఆరాధకులకు మత సామరస్యం వంటి పదాలను అర్ధం చేసుకోవడం కష్టమేనని కెటిఆర్ సెటైర్ వేశారు. ‘మొన్న ఐటిఐఆర్ ఇవ్వకున్నా దిగ్గజ ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం. నిన్న జాతీయ హోదా ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. నేడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రానికి అండగా మేము.. దేశానికే దండగ మీరు’ అంటూ ట్వీట్ చేశారు.