Monday, December 23, 2024

గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై కెటిఆర్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

గ్యాస్ సిలిండర్ ధర అడ్డగోలుగా పెంచిన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ కెటిఆర్
గడియకోసారి పెరుగుతున్న గ్యాస్ ధరతో దేశ ప్రజలకు గుండె దడ
మోడీ పాలనలో వంట గదుల్లో మంట
మోనార్క్ మోడీ రాజ్యంలో కుటుంబ బడ్జెట్‌లు తలకిందులు
ధరలను పెంచి దేశ ప్రజలపై దొంగ దాడి చేస్తున్న బిజెపి ప్రభుత్వం
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలనలో దేశం
గ్యాస్ బండ ధర పెంపుపై నిరసన చేపట్టిన టిఆర్‌ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు
కేంద్ర ప్రభుత్వ అసరమర్థ పాలన విధానాలపై కొనసాగుతుందన్న నిరంతర పోరు

మన తెలంగాణ/హైదరాబాద్: గడియకోసారి పెరుగుతన్న గ్యాస్ ధరతో దేశ ప్రజలకు గుండె దడ వస్తోందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో వంట గదుల్లో మంట పుడుతోందని విమర్శించారు. కేంద్రం అడ్డగోలుగా ధరలను పెంచుతూ పేద ప్రజల నడ్డి విరిస్తున్నారని మండిపడ్డారు.
ఎనిమిది సంవత్సరాల అసమర్థ మోడీ పరిపాలనలో సుమారు 170 శాతం పెంపుతో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక రేటుకు వంట గ్యాస్ అమ్ముతున్న ప్రభుత్వంగా ప్రపంచ రికార్డ్ సృష్టించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పెంచిన 50 రూపాయలతో ఈ ఏడాది కాలంలోనే రూ. 244 మేర గ్యాస్ బండ రేటును పెంచిన మోడీ పాలనను చూసి…. అరాచకత్వం కూడా సిగ్గుతో తలదించుకుంటుందన్నారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 410 రూపాయలుగా ఉన్న సిలిండర్ ధర ఈ రోజు సుమారు మూడు రెట్లు పెరిగి 1100 రూపాయలకు దాటడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్యాస్‌పై ఒకటి, రెండు రూపాయలు పెరిగితేనే మోడీ నుంచి మొదలుకుని పలువురు బిజెపి అగ్రనేతలంతా అప్పట్లో పెద్దఎత్తున గగ్గొలు పెట్టేవారన్నారు. మరి వారి పాలనలోనే అడ్డు…అదుపు లేకుండా ధరలు పెరుగుతుంటే పోతుంటే….కొంచమైనా సిగ్గుండాలన్నారు. అవమానంతో వారు తలదించుకోవాలన్నారు. మాకు పాలన చేతకావడం లేదంటూ దేశ ప్రజలకు వారు బహిరంగ క్షమాపణ కోరాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధ్యతలను నుంచి గౌరవంగా తప్పుకోవాలన్నారు. అప్పుడున్న ప్రజల్లో కొంత గౌరవం పెరుగుతుందన్నారు

బాదుడే….బాదుడు
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ప్రజలపై బాదుడే…బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కెటిఆర్ ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని రకాల వస్తువుల ధరలు పైపైకిపోతున్నాయన్నారు. అసలు ధరలను నియంత్రించే శక్తి కేంద్రం వద్ద ఉందా? అనుమానాలు తలెత్తుతున్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అంటేనే……బాదుడు ప్రభుత్వంగా మారిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ హయంలో కనీసం ఏ ఒక్క వస్తువు రేటు కూడా తగ్గలేదన్నారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1100పైగా రూపాయలకు గ్యాస్ రేటు చేరడం బిజెపి అసమర్థ పరిపాలనకు నిదర్శనమని మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధరేంద్ర మోడీ హయాంలో సిలిండర్ బండ ధరలతో పేదలను బాదే కార్యక్రమం అడ్డూ అదుపు లేకుండా సాగుతోందని విమర్శించారు. రాయితీకి రాం రాం చెప్పి..సబ్సిడీని పూర్తిగా ఎత్తివేశారన్నారు. దేశ ప్రజలపై దొంగ దాడిని మోడీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.
నానాటికి రూపాయి విలువ తగ్గిపోతుంటే… మరోవైపు అడ్డూ అదుపు లేకుండా పెట్రో రేట్లు పెరుగుతున్నాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు.. చుక్కలనంటుతున్న నిత్యావసరాల రేట్లతో ప్రతీ భారతీయ కుటుంబ బడ్జెట్ భారంగా మారిందన్నారు. బిజెపి అసమర్థ విధానాలతోనే ప్రజలకు అవసరమైన ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతుందన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజల బాధల్ని పట్టించుకునే సోయి లేదని ఆయన మండిపడ్డారు. దేశ ప్రజలతో కష్టాలతో సంబంధం లేకుండా పాలిస్తున్న మోడీ రాజ్యంలో భరించలేని విధంగా ధరలు పెరిగాయన్నారు. కొత్త ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలు ఊడి ప్రజల ఆదాయాలు పడిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పేదలను పీల్చి పిప్పి చేస్తున్న మోడీ ప్రభుత్వం
మోడీ ప్రభుత్వం కనికరం లేకుండా ప్రజల రక్తాన్ని పెరుగుతున్న ధరల పేరుతో పీల్చి పిప్పి చేస్తుందని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర పెంపు పై గొంతు చించుకున్న నరేంద్ర మోడీతో పాటు బిజెపి నాయకులంతా ఇప్పుడు తేలు కుట్టిన దొంగల లెక్క గప్ చుప్ అయ్యారని విమర్శించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భగ్య పాలనకు నాయకత్వం వహిస్తున్న మోడీ, ధరలతో దేశ ప్రజలపై దండయాత్ర చేయడం, పన్నులు పెంచి ప్రజల నడ్డి విరచడాన్నే సుపరిపాలనగా భావిస్తున్నారని కెటిఆర్ విమర్శించారు.
గ్యాస్ ధరల పెంపుకి అంతర్జాతీయ కారణాలను చూపించి తమ చేతకానితనాన్ని దాచాలనుకుంటున్న మోడీ ప్రభుత్వ కుటిలనీతిని దేశ ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. ఉజ్వల పథకం పేరుతో తమకు అంటగట్టిన సిలిండర్‌లను పెరుగుతున్న గ్యాస్ ధరలతో మహిళలు ఉపయోగించడం లేదన్నారు.

కట్టెల పొయ్యి వైపు చూస్తున్న ప్రజలు
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు గ్యాస్‌పోయ్యిలను రోడ్డమీద పడేసి.. తిరిగి కట్టెల పొయ్యి వైపు చూస్తున్నారని కెటిఆర్ అన్నారు. ఇంతకంటే సిగ్గు మరోటి ఉండదన్నారు. ఈ పరిస్థితిని చూసి అయినా బిజెపి నేతలు కళ్లుతెరవాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పొట్ వేస్తూ…పేదలను నడిరోడ్డుపైకి తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి సంది బిజెపి బెబుతున్న జుమ్లాలా మాదిరగానే ఉజ్వల పథకం తయారైందన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే ధరలను నియంత్రించి దొంగ నాటకాలు ఆడే బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజల పట్ల సానుభూతితో వ్యవహరించి గ్యాస్ సిలిండర్ ధరని తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సిలిండర్ ధర పెంపుకి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాలు ధరల పెంపుపైన టిఆర్‌ఎస్ పార్టీ నిరంతరం వివిధ రూపాల్లో ఒత్తిడి కొనసాగిస్తుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కెటిఆర్ పేర్కొన్నారు.

KTR Fires on Center over LPG Cylinder Price hike

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News