Monday, December 23, 2024

తెలంగాణ శత్రు దేశమా?

- Advertisement -
- Advertisement -

తెలంగాణపై మోడీ ప్రభుత్వం శతృదేశంపై పగపట్టినట్లుగా వ్యవహరిస్తున్నదని.. మెట్రో రైల్ కొత్త పనులకు మోకాలడ్డుతోందని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం శాసనసభ లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా వ్యూహాత్మక నాలాల అభివృద్ధి, ఎస్‌ఆర్డీపీ, మెట్రో రైలు పొడిగింపు, పాదచారుల బాట ప్రాజెక్టు వంటి అంశాలపై సభ్యులు దానం నాగేందర్, వివేకానంద, గాంధీ, ప్రకాశ్‌గౌడ్, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇ చ్చారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వడంలో వివక్షపై చూ పుతోందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా, దేశానికి ఆర్థిక ఇంజిన్‌లలో ఒకటిగా ఎదుగుతున్నప్పటికీ, మెట్రో ప్రాజెక్టును కేంద్రం విస్మరిస్తోందని అన్నారు.

మెట్రో ప్రాజెక్ట్ వివరాలను సమర్పించడానికి అపాయింట్‌మెంట్ కో సం కేంద్ర బడ్జెట్‌కు ముందు కేంద్ర పట్టణ వ్యవహారాల మం త్రి హెచ్‌ఎస్ పూరికి అనేక అభ్యర్థనలు చేశామని మంత్రి తెలిపారు. వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ప్రాజెక్టు నివేదికను కేంద్ర కార్యదర్శికి సమర్పించారని మంత్రి వెల్లడించారు. విమానాశ్రయ వరకు మెట్రో పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. బిహెచ్‌ఇఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 31 కి.మీ ఏర్పాటు, నాగోల్, ఎల్‌బినగర్ మధ్య గ్యాప్ పూర్తితో పాటు మెట్రో రెండవ దశ పనులకు 20 నుంచి 30 శాతం కేంద్ర సహకారాన్ని కోరామని తెలిపారు. రూ. 8,455 కోట్ల మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని,

 

కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదని మంత్రి తెలిపారు. బెంగళూరు మెట్రో రెండో దశకు రూ.59,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా కేంద్రం రూ.11,866 కోట్ల సహకారం ప్రకటించింది. దీనికి అదనంగా, రూ.29,664 కోట్ల సావరిన్ గ్యారెంటీ (ప్రాజెక్ట్ ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలోకి రాదు) కూడా ప్రకటించారు. చెన్నై మెట్రో రెండో దశకు రూ.83,993 కోట్లతో ప్రతిపాదించబడింది, కేంద్రం రూ.16,799 కోట్ల ఈక్విటీని మరియు రూ.41,994 కోట్ల సావరిన్ గ్యారెంటీని పొడిగించింది. ఉత్తరప్రదేశ్‌లో, లక్నో, ఆగ్రా, కాన్పూర్, గోరఖ్‌పూర్, వారణాసి, అలహాబాద్‌లోని ప్రాజెక్టులకు కేంద్రం 20 శాతం పెట్టుబడితో పాటు కేంద్రం హామీని ప్రకటించిందన్నారు. ఇవన్నీ హైదరాబాద్ కంటే చిన్నవిగా ఉన్నాయని, గుజరాత్‌లోని గాంధీనగర్ మెట్రో కోసం బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 20 శాతంతో పాటు హామీని ప్రకటించిందన్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. హైదరాబాద్ కోసం అడిగితే లాజికల్ ప్రశ్నలను లేవనెత్తి ప్రాజెక్ట్‌లను వెనక్కి పంపుతారని మంత్రి ఆరోపించారు. మెట్రో ప్రయాణికులు రద్దీగా ఉన్న అమీర్‌పేట మెట్రో స్టేషన్ చిత్రాలతో సోషల్ మీడియాలో పెడుతూ అదనపు కోచ్‌లు, రైళ్లను డిమాండ్ చేస్తున్నారని కెటిఆర్ ఎత్తి చూపారు. కేంద్ర ప్రభుత్వ తీరు విచిత్రంగా ఉందని.. హైదరాబాద్‌లో కాకుండా గోరఖ్‌పూర్, అలహాబాద్ వంటి చిన్న పట్టణాలలో మెట్రోలకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పట్ల ఈ ప్రతీకార వ్యూహాలు, వివక్ష ఎందుకు? మనల్ని శత్రు దేశంలా ఎందుకు చూస్తున్నారు? కెటిఆర్ వ్యక్తం చేశారు.
మెట్రో టికెట్ ధరలు పెంచితే ఊరుకోం..
హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోమని.. ఇప్పటికే వారిని హెచ్చరించినట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామన్నారు. మెట్రోలో 80 శాతానికిపైగా తెలంగాణ పిల్లలే పని చేస్తున్నారని వెల్లడించారు. రూ.6250 కోట్లతో ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను మూడేండ్లలో పూర్తిచేస్తామన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్ అని అందరికీ తెలుసు. పాతబస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.
ఎస్‌ఎన్‌డిపి ఏ నగరంలోనూ లేదు
హైదరాబాద్‌లో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి చేపట్టామని మంత్రి కెటిఆర్ అన్నారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం -ఎస్‌ఎన్‌డిపిలో భాగంగా నగరం నలుమూలల మురుగునీటి వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. తొలిదశలో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చాం. కొన్ని పనులు పూర్తి కావడంతో.. ఎల్బీనగర్‌లోని కొన్ని కాలనీల్లో గత వర్షకాలంలో ముంపు సమస్య కొంత మేర తగ్గిందని మంత్రి తెలిపారు. జిహెచ్‌ఎంసీ పరిధిలో 35 పనులకు 11 పూర్తిచేశామన్నారు. పరిసర మున్సిపాలిటీల్లో 21 పనులకుగాను 2 పూర్తిచేశామన్నారు. నగరంలో వందేండ్ల క్రితం నిర్మించిన నాలాలే ఉన్నాయని మంత్రి తెలిపారు. నాలాలపై 28 వేల మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారని చెప్పారు. స్ట్రటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఎన్‌డిపి) దేశంలో ఏ నగరంలోనూ లేదని వెల్లడించారు. ఎస్‌ఎన్‌డిపి ఫేజ్- 2 కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తొలిదశలో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. కొన్ని పూర్తికావడంతో.. ఎల్బీనగర్‌లోని కొన్ని కాలనీల్లో గత వర్షాకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గిందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు
హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఎన్ని అధునాతనభవనాలు కట్టినా హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదన్నారు. గుల్జార్‌హౌస్, మీర్-ఆలం-మండి, ఆషుర్ ఖానాకు పూర్వవైభవం తీసుకొస్తున్నామని చెప్పారు. మదీనా నుంచి పత్తర్‌గట్టి వరకు పనులు పూర్తికావొచ్చాయన్నారు. పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టామని తెలిపారు. చార్మినార్ నుంచి దార్-ఉల్-ఉలం స్కూల్ వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. హుస్సేనీ ఆలం నుంచి దూద్‌బౌలి వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. హెరిటేజ్ భవంతుల పూర్వవైభవం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
తొమ్మిది నెలల్లో పిల్లలు వస్తారు కానీ.. మీరు రారు..
తొమ్మిది నెలల్లో మేము వస్తాం అని భట్టి విక్రమార్క అన్నారు.. 9 నెలల్లో పిల్లలు వస్తారు కానీ… మీరు రారంటూ మంత్రి కెటిఆర్ సెటైర్ వేశారు. ఏది చెప్పినా.. పాత ముచ్చట చెప్తారని ఎద్దేవ చేశారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్‌గా చెప్పారన్నారు. సబ్జెక్టు తెలుసుకోకుండా మాట్లాడొద్దంటూ మండిపడ్డారు.తొమ్మిది నెలల్లో మీరు రారు.. ఇంత చేసినా కూడా.. వాళ్ళను ప్రతిపక్షంలో కూర్చోపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ కూడా వస్తారో కూడా తెలియదు.. బయటకి వెళ్ళేటట్టు ఉన్నారంటూ సెటైర్లు వేశారు మంత్రి కెటిఆర్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News