Monday, December 23, 2024

నిగ్గదీసి అడగండి..

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనతో దేశం తిరోగమన దిశగా పయనిస్తోందని మండిపడ్డారు. ఆయన పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా అమ్ముతూ కార్పొరేట్ సంస్థలకు ఉన్నదంతా దోచిపెడుతున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కును అమ్మినట్లే సింగరేణిని కూడా అమ్మాలని మోడీ చూస్తున్నారని ధ్వజమెత్తారు. అలా కేంద్రం యత్నిస్తే మాత్రం…మరోసారి సకల జనుల సమ్మె తప్పదని ఈ సందర్భంగా కెటిఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నది కెసిఆర్ అన్న విషయాన్ని మోడీ మరిచిపోవదన్నారు.

కెసిఆర్ ఉన్నంత వరకు మోడీ సింగరేణిని ఏం చేయలేరన్నారు. గురువారం భూపాలపల్లిలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడుతూ, నరేంద్రమోడీపై మరోసారి నిప్పులు చెరిగారు. మోడీ పాలనలో దేశంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగిందని విమర్శించారు. ఇది ముమ్మాటికి నరేంద్ర మోడీ అసమర్థపాలనే కారణమని ధ్వజమెత్తారు. 40 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం కూడా పెరిగిపోయిందన్నారు. కేంద్రం కొత్త ఉద్యోగాలను ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్న గొప్ప ప్రభుత్వ మన మోడీదేనని కెటిఆర్ ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం అన్ని గొప్పలు చెప్పుకోవడమే తప్ప….బిజెపి పాలనలో దేశానికి జరిగిన ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటి లేదన్నారు.

మేకిన్ ఇండియా నినాదం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని కెటిఆర్ మండిపడ్డారు. చివరకు పతంగుల మాంజా కూడూ చైనా నుంచే దిగుమతి చేసుకునే దౌర్భాగ్యపు పరిస్థితులను తీసుకొచ్చాడని ఆయన విరుచుకుపడ్డారు. 2014కు ముందు మోడీ చెప్పిన మాటలను దేశ ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. పేదలకు జన్ ధన్ ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున వేస్తానని మోడీ గొప్ప గొప్ప మాటలు చెప్పారని….మరి ఎంతమందికి వేశారో ఆయనకే తెలియాలని సెటైర్లు వేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల్లో మోడీ ప్రభుత్వం ఏ ఒక్కదానిని కూడా నెరవేర్చలేదని కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు తెలంగాణ అంటే నిలువెల్లా వివక్షేనని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఒక భాగం కాదా? అని ఈ సందర్భంగా కెటిఆర్ ప్రశ్నించారు.

అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతేనే కేంద్రం కూడా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మోడీ పూర్తిగా మరిచిపోయారన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలకే మోడీ పెద్దపీట వేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఆయన ఒక్క కేంద్ర సంస్థను కూడా మంజూరు చేయలేదని కెటిఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రానికి వైద్య కళాశాలలు కావాలని కోరితే….. అవి కూడా మంజూరు చేయలేదన్నారు. మోడీ కేవలం అదాని వంటి కార్పొరేట్ శక్తులకు, బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మాత్రమే దేవుడని వ్యంగ్యస్త్రాలను సంధించారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన మోడీ దేవుడా? ఎలా అవుతాడో బండి చెప్పాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు.

కిషన్‌రెడ్డిపై మరోసారి పంచ్‌లు
కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిపై కెటిఆర్ మరోసారి పంచ్‌లు విసిరారు. ఆయన తెలిసి మాట్లాడుతారో.. తెలియక అంటారో గానీ… మోడీనే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టారని అంటుండం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా మోడీ కనిపెట్టినట్లు అయితే…. ఆయనకు తప్పకుండా నోబుల్ బహుమతి ఇవ్వాలన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తాము కూడా అసెంబ్లీ నుంచి ప్రతిపాదిస్తామని కెటిఆర్ సెటైర్లు విసిరారు. మోడీ భజన తప్ప కిషన్‌రెడ్డికి మరోటి తెలియదన్నారు.

కాంగ్రెస్‌కు అవకాశమిస్తే….ఏం ఉద్దరించారు?
రాష్ట్రంలో మళ్లీ ఒక్కసారి అధికారం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారని కెటిఆర్ ప్రశ్నించారు. ఆపార్టీకి ఒక్కసారి కాదు….10సార్లకు పైగా ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారన్నారు. ఇన్ని సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ నేతలు ఏం ఉద్ధరించారని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు, సాగునీటికి ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు మళ్లీ ఆ దిక్కు మాలిన పాలన రాష్ట్రం కావాలా?అని ప్రశ్నించారు. 50 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్సేనని అన్నారు. వారి పాలనలో పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్‌లు, కాలిపోయే మీటర్లు, అర్ధరాత్రి దొంగోలే వచ్చే కరెంటు.. దానికి కాపాలా కాసేందుకు వెళ్లి ఎవరు పాముకుట్టి చనిపోతారో తెలియదన్నారు. తేలుకట్టి, కరెంటు షాక్ తగిలి చనిపోతారో తెలియని పరిస్థితులుండేవన్నారు.

భూపాల్లిలో ఉన్న యువత ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉందని గూగుల్‌లో కొడితే ఎక్కడ ఉంది? భూపాలపల్లి జిల్లాలో ఉందని అని గల్లా ఎగరేసి ఈ ప్రాంత బిడ్డలు ఎంత గర్వంగా చెప్పుకోవచ్చునని అన్నారు. 75 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి, ఏప్రధానమంత్రి చేయని పని కెసిఆర్ ఒక్కరే చేసిండని భూపాలపల్లి బిడ్డలు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందన్నారు. అలాగే బిఆర్‌ఎస్ హయంలో 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లికి ఆర్థికసాయం చేశామని తెలిపారు. తెలంగాణలోని సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలోనూ లేవని పేర్కొన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే బిఆర్‌ఎస్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై రెండు గంటలు చెప్పినా సరిపోదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందన్నారు. అసలు బిఆర్‌ఎస్ (గతంలోటిఆర్‌ఎస్ ) లేకుంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదన్నారు. కెసిఆర్ పోరాటం వల్లే రేవంత్‌కు పిసిసి అధ్యక్ష పదవి, బండి సంజయ్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవులు వచ్చాయన్నారు. అలాంటి వారు ప్రగతిభవన్, సెక్రటేరియట్ పేల్చేస్తాం, కూల్చేస్తాం అని అంటున్నారన్నారు. పచ్చటి తెలంగాణను పేల్చేస్తామనే పిచ్చోళ్ల పాలు చేయొద్దన్నారు. ఎంఎల్‌ఎలు పార్టీ మారటం గురించి రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ బిఎస్‌పి ఎంఎల్‌ఎలను చేర్చుకోలేదా? ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News