Tuesday, December 24, 2024

కిషన్ రెడ్డి నిస్సహాయ మంత్రి….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ నగరాభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికి లేదని బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు
అన్నారు. నగర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతుందన్నారు. నగరాభివృద్ధిపై కేంద్రమంత్రి కళ్లుండి కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారని కెటిఆర్ విమర్శించారు. సొంత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఆయన తత్తర…బిత్తర మాట్లాడి పరువు తీసుకోవడాన్ని కేంద్రమంత్రి అలవాటుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో కిషన్‌రెడ్డిపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అభివృద్ధి అంటే కురుకురే ప్యాకెట్లు, ప్యాసింజర్ లిఫ్టులు ప్రారంభించడం అంత సులవైనది కాదని సెటైర్లు చేశారు.
హైదరాబాద్ నగరానికి కేంద్రం ఇచ్చిన అదనపు నయాపైసా సహాయం ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వని కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. కేంద్ర మంత్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సైతం చూడలేని పరిస్థితిలో కిషన్‌రెడ్డి ఉండడం సిగ్గుచేటని కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర భవిష్యత్తు అవసరాలే ప్రాతిపదికగా నలుమూలల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్న కెటిఆర్…. హైదరాబాద్ నగర అభివృద్ధి కూడా కేంద్రమంత్రికి కనిపించడం లేదన్నారు.
నగరం నలుమూలలా అద్భుతంగా విస్తరిస్తూ అభివృద్ధి సాధిస్తుంటే చూసి ఓర్వలేక, అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నలువైపులా చరిత్రలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరుగుతుంటే కిషన్ రెడ్డి తట్టులేకపోతున్నారని విమర్శించారు. హైదరబాద్ నగరానికి ఒక్కపైసా అదనంగా తేలేని కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విస్తృతమై అభివృద్ధిలో కేంద్రం వాట ఎంతో ప్రజలకు వివరిస్తే మంచిదన్నారు. అభివృద్ధి అంటే రైల్వే స్టేషన్లో మూడు లిప్టులను ప్రారంభించడం కాదని కిషన్‌రెడ్డికి కెటిఆర్ చురకలంటించారు. వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాద్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు తీసుకురాలేని నిస్సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని విమర్శించారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు, సంస్థలను సొంత రాష్ట్రం గుజరాత్ కు తరలించుకుపోయిన ప్రధానమంత్రిని ఇదేందని అడగలేని దుస్థితిలో కిషన్ రెడ్డి ఉన్నారని మండిపడ్డారు.

తెలంగాణ సొమ్ము తింటూ…నరేంద్ర మోడీ పాట పడుతున్నాడు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ సొమ్ము తింటూ నరేంద్ర మోడీ పాట పాడుతున్నారని కెటిఆర్ మండిపడ్డారు. సొంత నియోజకవర్గం సికిందరాబాద్‌లో కేంద్రప్రభుత్వ నిధులతో ఏంఅభివృద్ధి చేసిండో కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. దాని ఫలాలను నగర ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారన్నారు. ఏ ఒక్క ప్రాంతానికో ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని ప్రాంతాలను సమానంగా డెవలప్ చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా తాము చేస్తున్న అభివృద్ధి పనులకు ఎస్‌ఆర్‌డిపి, ఎస్‌ఎన్‌డిపి, సిఆర్‌ఎంపి కార్యక్రమాలు, వైకుంఠ దామాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలే నిదర్శనం అన్నారు. అభివృద్ధిలో రోజురోజు కొత్త పుంతలు తొక్కుతున్న హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపరిచేందుకు ఎస్‌ఆర్‌డిపి ద్వారా రూ. 5660.57 కోట్ల వ్యయంతో 47 పనులు చేపట్టామన్నారు.

అందులో ఇప్పటి వరకు 32 పనులు పూర్తయ్యాయి పూర్తి అయ్యాయన్న కెటిఆర్ వివరించారు. ఈ సంవత్సరంలోనే 11 పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు లేకుండా ఉండడానికి రూ. 985.45 కోట్ల వ్యయంతో ఎస్‌ఎన్‌డిపి ద్వారా నగరం చుట్టు ఉన్న మున్సిపాలిటీల్లో 56 పనులు చేపట్టగా జిహెచ్‌ఎంసీ పరిధిలో 35 పనులను రూ.735 కోట్లతో చేపట్టడం జరిగిందన్నారు. పికెట్ నాలాపై నిర్మించిన బ్రిడ్జితో అనేక కాలనీలకు వరద ముప్పు తప్పిందన్నారు. ఇలా ఎల్‌బినగర్ జోన్‌లో 6628 పనులు, చార్మినార్ జోన్‌లో 12,426 , ఖైరతాబాద్‌లో 7829 , శేరిలింగంపల్లి జోన్‌లో 4556, కూకట్‌పల్లిలో జోన్‌లో 5,159, సికింద్రాబాద్ జోన్‌లో 6517 పనులు చేపట్టామన్నారు. ఇలా చెప్పుకుంటే పొతే తాము చేసిన అభివృద్ధి పనుల జాబితా అంతులేనిదన్నారు. తమ ప్రభుత్వం నగరంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు.

నాలుగు దిక్కులో అభివృద్ధి
భవిష్యత్తుకు అనుగుణంగా నగరాన్ని నాలుగు దిక్కుల్లో డెవలప్ చేస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. సిటీ విస్తరణంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నామన్నారు. ఐటి, పారిశ్రామిక, ఫార్మా, సర్వీసెస్ రంగాలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తు సమ్మిళిత అభివృద్ధిని కొనసాగిస్తున్నామని కెటిఆర్ వెల్లడించారు. ప్యాసింజర్ లిఫ్ట్‌లను ప్రారంభించడం, కుర్‌కురే ప్యాకెట్లను పంచడమే అభివృద్ధి అనుకుంటున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పనికిమాలిన మాటలు బంద్ చేసి హైదరాబాద్‌కు నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వనీ మోడీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డికి బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు.

కిషన్‌రెడ్డికి అవగాహన లేదు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తన సొంత పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కెటిఆర్ మండిపడ్డారు. ఇందిరాపార్కు నుండి విఎస్‌టి మెయిన్ రోడ్డు వరకు, అశోక్ నగర్ క్రాస్ రోడ్డు జంక్షన్ నుండి ఆర్ టిసి క్రాస్‌రోడ్డు, బాగ్‌లింగంపల్లి జంక్షన్‌ఫేస్…1, రెండు, మూడు లేన్ల బై డైరెక్షనల్ ఇండిపెండెంట్‌ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులను రాంనగర్ రోడ్డు నుండి విఎస్‌టి మెయిన్ రోడ్డు జంక్షన్ మీదుగా బాగ్‌లింగంపల్లి వరకు రూ. 423 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పనులు జూన్ 2023 వరకు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

అన్ని జోన్లతో ముఖ్యంగా పాత ఎంసిహెచ్ పరిధిలో సిఆర్‌ఎంపి కార్యక్రమం ద్వారా రోడ్ల నిర్వహణను నిరంతరం చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను అతి తక్కువ కాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. అయితే సొంత నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పనులు మూడేండ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నా అసలు పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఈ ఫ్లైఓవర్ పనులు స్లోగా సాగడంతో రోడ్ల మీద ఏర్పడ్డ గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నా…. ఏ మాత్రం చలించని కిషన్ రెడ్డి తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. ఇది కిషన్‌రెడ్డి అజ్ఞానం, అవగాహనా రాహిత్యం తప్ప మరొకటి కాదన్నారు.

సమ్మిళత అభివృద్ధిని కొనసాగిస్తున్నాం
ఐటి, పారిశ్రామిక, ఫార్మా, సర్వీసెస్ రంగాలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తు సమ్మిళిత అభివృద్ధిని కొనసాగిస్తున్నానమని కెటిఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి పనికిమాలిన మాటలు బంద్ చేసి హైదరాబాద్‌కు నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. చేతనైతే కిషన్‌రెడ్డి ఒక్కసారి నగరమంతా తిరిగి బిఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు ఉన్న పరిస్థితి….ప్రస్తుతం పరిస్థితి ఏమిటన్నది తెలుసుకోవాలని సూచించారు. అప్పుడు ఆయనకు అసలైన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. కేవలం మీడియా సమావేశాలకు పరిమితమయ్యే కిషన్‌రెడ్డికి…భాగ్యనగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎలా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సమ్మిళత అభివృద్ధే ధ్యేయంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News