పెట్టుబడుల ఉపసంహరణలో మోడీ
సర్కార్ తీరుపై నిప్పులు చెరిగిన కెటిఆర్
ఇక్కడి పిఎస్‌యులకు భూములిచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టీకరణ
పరిశ్రమలు నడపడం చేతకాకపోతే ఆ భూములు వెనక్కు ఇచ్చేయాలని డిమాండ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాji మరోసారి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం కహానీలు చెపుతోందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం బిజీగా ఉందని విమర్శించారు.
దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముతుందని కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలును పట్టించుకోని కేంద్ర సర్కార్… ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నాలపై తీ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక లేఖ రాశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దని విజ్ఞప్తి చేశారు.
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టిఆర్‌ఎస్ పార్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మరోసారి కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రానికి సోయి లేదు
వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్న సోయి ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన సంస్థలను అప్పనంగా అమ్మడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్‌ఎంటి, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సిసిఐ), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కెటిఆర్ విమర్శించారు. ం అమ్మకపు ప్రణాళికల్లో కేంద్రం పెట్టిన ఈ ఆరు సంస్థలకు గతంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 7200 ఎకరాల భూమిని కేటాయించాయన్న విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ భూముల విలువ ప్రభుత్వ లెక్క ధరల ప్రకారం కనీసం రూ. 5వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువ రూ. 40 వేల కోట్లు ఉంటుందన్నారు. స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామికాభివృధ్ది జరగాలన్న ఉదాత్తమైన లక్ష్యంతో గతంలో ఆయా కంపెనీలుకు అత్యంత తక్కువ ధరకు, అనేక సందర్భాల్లో ఉచితంగానే భూములు కేటాయించిన విషయాన్ని కేంద్రం విస్మరించవద్దని ఈ సందర్భంగా కెటిఆర్ సూచించారు.
ఆ భూముల రాష్ట్ర ప్రజల హక్కు
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే టిఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తిస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు. ఆయా సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో ప్రయివేట్ పరం చేయడమంటే రాష్ట్ర ఆస్తులను అమ్ముతున్నట్టుగానే ఇక్కడి ప్రజలు భావిస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే వంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తమిళనాడుతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను అమ్మే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పియుఎస్‌ల అమ్మకంపైన పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కెటిఆర్ సూచించారు.
అమ్మడానికి బదులు పునరుద్దరణ చేపట్టండి
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కొనసాగిన ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునరుద్దరణ చేపట్టి వాటిని బలోపేతం చేయాలని కెటిఆర్ సూచించారు. ఇలా చేయకుండా తెలంగాణలోని ఆయా కంపెనీల ఆస్థులను అమ్మి సొమ్ము చేసుకుని బయటపడతామంటే కచ్చితంగా వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేకుంటే ఆయా సంస్థలున్న ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆ లేఖలో మంత్రి కెటిఆర్ కోరారు.
KTR Fires on Centre Govt over PSU Lands sell