Monday, December 23, 2024

అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందంటారా?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంత అహంకారం, కండకావడంతో మాట్లాడిన సిఎం రేవంత్‌రెడ్డికి ఆడబిడ్డల ఉసురు తాకుతుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లకా్ష్మరెడ్డి ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు అని వ్యాఖ్యానించారు. ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవారని.. రేవంత్ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కారని పేర్కొన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని.. బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మహిళా ఎంఎల్‌ఎలను అవమానించిన సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలపై కెటిఆర్ నిప్పులు చెరిగారు.

తమ పార్టీ మహిళా శాసనసభ్యులపై అకారణంగా సిఎం నోరుపారేసుకున్నారని మండిపడ్డారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఈ అవమానం కేవలం సబితక్కకు, సునీతక్కకు జరిగింది కాదని.. తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానమని పేర్కొన్నారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమన్నారు. రేవంత్ సిఎం పదవికి అన్ ఫిట్ అని పేర్కొన్నారు. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉపముఖ్యమంత్రి అనడం అన్యాయని అన్నారు. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం ఆయన ఎవరు ఇచ్చారని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్న తాము ఏరోజైనా ఆడబిడ్డలను అవమానించామా..? అంటూ నిలదీశారు.

ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడానని అభ్యంతరం చెబితే తాను వెంటనే సరిచేసుకున్నానని.. అది తమకు కెసిఆర్ నేర్పించిన సంస్కారమని తెలిపారు. అసెంబ్లీలో తమ ఆడబిడ్డలకు జరిగిన అవమానం మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానమని.. ముఖ్యమంత్రి సిగ్గు, బుద్ధి, జ్ఞానం తెచ్చుకొని సంస్కరించుకో అంటూ హితవు పలికారు. ఆడబిడ్డలను అడ్డగోలుగా మాట్లాడి పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ అంటూ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News