ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నారాయణపేట -కొడంగల్ లిఫ్ట్ పనులను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్ సంస్థలకు కట్టబెట్టటంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి, మేఘా సంస్థకు ఈ టెండర్లు దక్కేలా చేయటమంటేనే నీకిది -నాకది అని క్రోని క్యాపిటలిజానికి పాల్పడుతూ అధికారాన్ని దుర్వినియోగం చేయటమేనని విమర్శించారు. ఎల్ అండ్ టి, ఎన్‌సిసి లాంటి పెద్ద కంపెనీలకు టెండర్లు దక్కకుండా కావాలనే కుట్ర చేశారని ఆరోపించారు.
ఎల్ అండ్ టి, ఎన్‌సిసి లాంటి సంస్థలను టెక్నికల్ రీజన్స్ పేరు చెప్పి డిస్ క్వాలిఫై చేస్తున్నప్పుడు దీనిపై ప్రజలు ఏమనుకుంటారోనన్న సోయి తప్పి సిగ్గులేకుండా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలాగైన మేఘా, రాఘవ సంస్థలకు ఈ ప్రాజెక్ట్ కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ రెండు సంస్థలు చెరి సమానం కేక్‌ను పెంచుకున్నట్లు 3.9 శాతం, 3.95 శాతం పంచుకునే విధంగా బిడ్‌లు వేయటమంటే ఇందులో మతలబు ఏంటనీ ప్రశ్నించారు. ఇంత బరితెగించి అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కచ్చితంగా ప్రజలు బుద్ది చెబుతారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అవినీతి పాలనపై పోరాటం చేస్తూనే ఉంటాం
సుంకిశాలలో ప్రమాదం కారణంగా ప్రభుత్వానికి రూ. 80 కోట్లు నష్టం చేసిన మేఘా కంపెనీకి పనులను ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ మేఘా మీద రేవంత్ రెడ్డికి ఎందుకు అంత ప్రేమ..? అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా, ఆంధ్రా కంపెనీ అంటూ ఏ మేఘా కంపెనీపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశాడో ఇప్పుడు అదే కంపెనీకి సిగ్గులేకుండా ఎందుకు ప్రాజెక్ట్ పనులను అప్పగించారో చెప్పాలన్నారు. బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సిన కంపెనీకి రేవంత్ రెడ్డి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను బహుమానంగా ఇవ్వటం వెనుక భారీ అవినీతి కుంభకోణం ఉందని ఆరోపించారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు, రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు పైసలు లేవన్న రేవంత్ రెడ్డి…ఇంత ఖర్చుతో ఎవరి జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఓ వైపు తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డి చేతగాని పాలనలో బాధపడుతుంటే…మరో వైపు ఆయన మాత్రం ప్రజాధనాన్ని లూటీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని విమర్శించారు. మొత్తం రూ. 4,350 కోట్ల ఈ ప్రాజెక్ట్‌ను మేఘా, రాఘవ సంస్థలకు అప్పగించి వారి ద్వారా వేల కోట్ల రూాపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొట్టనుందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే వాళ్లు మాత్రం దేశవ్యాప్తంగా తమ పార్టీ ఖజానా నింపుకునేందుకు రాష్ట్రాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేఘా, రాఘవ కన్‌స్ట్రక్షన్ అవినీతి బాగోతాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని…కాంగ్రెస్ అవినీతి పాలనపై పోరాటం చేస్తూనే ఉంటామని కెటిఆర్ స్పష్టం చేశారు.