Tuesday, March 11, 2025

సిఎం ఆమరణ దీక్ష చేయాలి

- Advertisement -
- Advertisement -

బిసి రిజర్వేషన్ల చట్టం కోసం చిత్తశుద్ధి
ఉంటే జంతర్ మంతర్‌లో దీక్షకు
కూర్చోవాలి టిడిఆర్ బాండ్ల
వ్యవహారంలో భారీ కుంభకోణానికి
సిఎం రేవంత్ తెరలేపబోతున్నారు
ముఖ్యమంత్రి చుట్టూ నలుగురు
రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బిజెపి
సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో
తక్కువ ఫార్ములా కేసులో మళ్లీ
నన్ను విచారణకు పిలుస్తారు
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి
కెసిఆర్ హాజరవుతారు రేవంత్
స్థాయికి మేం చాలు మీడియాతో
కెటిఆర్ చిట్‌చాట్

మన తెలంగాణ/హైదరాబాద్: టిడిఆర్ బాండ్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ కుంభ కోణానికి తెరలేపబోతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ నలుగురు రియల్ ఎస్టే ట్ బ్రోకర్లు ఉన్నారని, వారి సహకారంతో డబ్బులు భారీగా సంపాదిస్తున్నారని అన్నారు. 1947 నుం చి దేశ చరిత్రలో అవినీతి మార్గంలో డబ్బులు సం పాదించడానికి అత్యధిక మార్గాలు తెలిసింది రేవం త్ రెడ్డి మాత్రమే అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రికి ఇంత స్థాయిలో డబ్బులు సం పాదించడం తెలియదేమో అని వ్యాఖ్యానించారు. టిడిఆర్ బాండ్ల విషయంలో రేవంత్ రెడ్డి కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ హయాంలో జిహెచ్‌ఎంసిలో 400 ఎకరాల భూమి టిడిఆర్ ద్వారా సేకరించామని, ఇప్పుడు సిఎంకు చెందిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్‌లో విచ్చలవిడిగా టిడిఆర్‌ను కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తుల దోపిడీ పె రిగి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని పే ర్కొన్నారు.

ఇండియా టుడే సదస్సులో రేవంత్ రెడ్డి దివాళాకోరుతనం బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎంఎల్‌సి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా సోమవారం బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అ భ్యర్థి దాసోజు శ్రవణ్, ఇతర పార్టీ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా  ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కెటిఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. దాసోజు శ్రవణ్‌ను 2023లోనే కెసిఆర్ ఎంఎల్‌సిగా నామినేట్ చేస్తే అప్పుడు గవర్నర్, బిజెపి నేతలు ఆపారని పేర్కొన్నారు. పట్టుబట్టి బిజెపి ఆపిందని అన్నారు. ఇప్పుడు తిరుగులేని సమాధానంతో కెసిఆర్ ఎంఎల్‌ఎ కోటాలో అవకాశం కల్పించారని తెలిపారు. ఆయన గతంలో టిఆర్‌ఎస్‌ను వీడకపోతే ఎప్పుడో ఎంఎల్‌సి అయ్యేవారని చెప్పారు. ఎంఎల్‌ఎల భేరసారాలకు అవకాశం ఇవ్వకూడదని ఉద్దేశంతోనే అదనపు అభ్యర్థిని ఈ ఎంఎల్‌సి ఎన్నికల్లో నిలపలేదని తెలిపారు.

గతంలో కాంగ్రెస్ చేసినట్లుగా ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసి పదవులు దక్కించుకోవాలని దుర్మార్గపు ప్రయత్నం తమ పార్టీ విధానం కాదని స్పష్టం చేశారు అందుకే ప్రస్తుత రాజకీయ పరిణామాలు సభలో ఉన్న బలాల మేరకు ఒక అభ్యర్థిని నిలిపామని తెఇలపారు.టిడిఆర్‌పై సిఎం శ్వేత పత్రం విడుదల చేయాలి : రాబోయే రోజుల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్‌ఎస్‌ఐ)ని నియంత్రిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఆ ప్రకటన తర్వాత ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడతారని కెటిఆర్ ఆరోపించారు. టిడిఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి త్వరలో హైదరాబాద్ నగరంలో ఎఫ్‌ఎస్‌ఐ పైన పరిమితులు విధించబోతున్నారని, ఆలోగా హైదరాబాదులో ఉన్న టిడిఆర్ హక్కులను రేవంత్ రెడ్డి ముఠా కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇప్పుడు అతి తక్కువ రేట్లకు కొని ఎఫ్‌ఎస్‌ఐ పరిమితి విధించగానే డిమాండ్ పెంచి అవే టిడిఆర్ లని అత్యధిక రేటుకి అమ్ముకోబోతున్నారని ఆరోపించారు. టిడిఆర్ ఇన్‌సైడర్ కుంభకోణం ఇడి విచారణకు అర్హమైనదని చెప్పారు. బిజెపి నేతలు రేవంత్‌ను కాపాడుతున్నారని ఆరోపించారు.

అరెస్ట్ చేయకూడదనే సిఎం ప్రధాని మోదీని రేవంత్ పొగుడుతున్నారని, కిషన్‌రెడ్డి అమాయకుడు కాబట్టే విమర్శిస్తున్నారని అన్నారు. 15 నెలలుగా బిజెపితో కలిసి పనిచేస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. 15 నెలలుగా బిజెపితో కలిసి పనిచేస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని నిలదీశారు. ప్రధానిని రేవంత్ రెడ్డి వేరే అంశాల్లో కలిశారని, శ్రీధర్ బాబును బయటకు పంపి మాట్లాడుకున్నారని ఆరోపించారు. బిజెపి సోషల్ మీడియాలో ఎక్కువ సొసైటీలో తక్కువ అని వ్యాఖ్యానించారు. బిజెపి ఒక్క రోజైనా ప్రజా సమస్యలపై పోరాటం చేసిందా..? అని ప్రశ్నించారు. తెలంగాణాలో ఆర్‌ఆర్‌టాక్స్ నడుస్తోందని అన్న ప్రధాని మోడీ ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీద మోడీకి ఎందుకు అంత ప్రేమ అని నిలదీశారు. కిషన్ రెడ్డి నిస్సహాయుడు అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఒకే తాను ముక్కలు అని, ఇద్దరూ కలిసి దొంగాట ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నారని, ఇదంతా అటెన్షన్ డైవర్షన్‌లో భాగమే అని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో బిజెపికి కోవర్టులు ఉన్నారని అన్నారని రాహుల్‌గాంధీ అన్నారు
సిఎం రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదనేందుకు ఎంఎల్‌సిల ఎంపికనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా మంత్రివర్గాన్ని విస్తరించుకోవడం లేదని విమర్శించారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లో బిజెపికి కోవర్టులు ఉన్నారని అన్నారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డిని ఉద్దేశించే రాహుల్‌గాంధీ అలా అని ఉండవచ్చని పేర్కొన్నారు. రేవంత్ జుట్టు ఢిల్లీలో ఉందని ఆరోపించారు. స్ట్రాంగ్ లీడర్లను బిజెపి, కాంగ్రెస్ ఎదగనివ్వదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి అంత ఉంటే ముందు కేబినెట్ విస్తరణ చేసేవారని, 39 సార్లు ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కడం దిగడం తప్ప చేసింది ఏం లేదని విమర్శలు గుప్పించారు.

నన్ను మళ్లీ విచారణకు పిలుస్తారు
అసెంబ్లీ సమాశాల సందర్భంగా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఫార్ములా- ఈ రేసు కేసు వ్యవహారంలో ఈ నెల 16 నుంచి 27 వరకు తనను మరోమారు విచారణకు పిలుస్తారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఫార్ములా -ఈ కోసం రూ.45 కోట్లు ఖర్చు చేస్తే తప్పంటున్న ముఖ్యమంత్రి, రూ.200 కోట్లతో మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి ఏం లాభం వస్తుందో చెప్పాలని అడిగారు. నిరుటితో పోలిస్తే రాష్ట్ర ఆదాయం రూ.26 వేల కోట్ల లోటుకు వెళ్లిందని, ఈసారి రూ.40వేల కోట్ల బడ్జెట్‌ను తగ్గించి రివైజ్డ్ ఎస్టిమేట్స్ పెడతారని కెటిఆర్ తెలిపారు.

కెసిఆర్ అసెంబ్లీకి వస్తారు
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షనేత కెసిఆర్ హాజరవుతారని కెటిఆర్ వెల్లడించారు. గవర్నర్ ప్రసంగం కార్యక్రమానకి హాజరవుతారని తెలిపారు. రేవంత్ స్థాయికి తాము చాలు అని పేర్కొన్నారు. కెసిఆర్ సభకు హాజరై కాంగ్రెస్ నేతల అబద్ధాలు, దూషణలు పడాలా..? అని ప్రశ్నించారు. ఇటువంటి నేతలు ఉన్న సభకు కెసిఆర్ రావాల్సిన అవసరం లేదని కొడుకుగా, ఆయన అభిమానిగా తన వ్యక్తిగత అభిప్రాయం అని పేర్కొన్నారు. కెసిఆర్ వస్తారా…లేదా అన్నది ఆయనే నిర్ణయించుకుంటారని చెప్పారు. ప్రభుత్వం ప్రభుత్వ పాత్ర పోషిస్తే ప్రతిపక్షనేత ఆయన పాత్ర పోషిస్తారని అన్నారు. హార్స్ ట్రేడింగ్‌కు పోకూడదనే ఎంఎల్‌సి ఎన్నికల్లో రెండో అభ్యర్థిని నిలపలేదని తెలిపారు. దేశంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉండాలని, ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలని తాను కోరుకుంటానని కెటిఆర్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తర్‌ప్రదేశ్‌లో 142 ఎంపీ సీట్లు అవుతాయని, దక్షిణాది మొత్తం 135 మాత్రమే ఉంటాయని అది ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. పునర్విభజనకు జనాభా మాత్రమే ఎందుకు గీటురాయి అని, జిడిపి ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు.

సిఎం రేవంత్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేయాలి
బిసిలను రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌లా తాము మోసం చేయబోమన్న కెటిఆర్ స్పష్టం చేశారు. బిసి రిజర్వేషన్లపై సిఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చిత్తశుద్ది ఉంటే బిసి రిజర్వేషన్ల విషయంలో పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద కెసిఆర్ ఆమరణ దీక్ష చేయాలని రేవంత్‌రెడ్డి పలు సందర్భాలలో అన్నారని, తెలంగాణ కోసం కెసిఆర్ ఆమరణ దీక్ష చేసినట్లుగా రేవంత్‌రెడ్డి బిసి రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేయాలని పేర్కొన్నారు.

త్వరలో ఉపఎన్నికలు..
రాష్ట్రంలో త్వరలో పది ఉప ఎన్నికలు రాబోతున్నాయని,తమకు ఈ మేరకు సమాచారం ఉందని కెటిఆర్ వెల్లడించారు. అందులో భాగంగానే గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికలకు దూరంగా ఉన్నామని చెప్పారు. బలమైన ప్రాంతీయ పార్టీల నేతలను తొక్కడమే జాతీయ పార్టీల ఎజెండాని అని తాము ముందు నుంచి చెప్తున్నామని కెటిఆర్ అన్నారు. అందుకే కెసిఆర్, మమతా బెనర్జీ స్టాలిన్ వంటి నాయకులను కేంద్రం ఇబ్బందులు పెడుతుందని తెలిపారు. ఇండియా టుడే సదస్సులో రేవంత్ రెడ్డి తన డ సిగ్గులేని తనని బయటపెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారం అప్పుడు అడ్డగోలుగా తమకు అన్నీ తెలుసు, తమకు అనుభవం ఉందని చెప్పి, ఇప్పుడు అప్పుల పేరు చెప్పి హామీల అమలు నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలకు అవసరమైన నిధులు ఎట్లా తేవాలో తెలుసు అని చెప్పిన వాళ్లే ఇప్పుడు తమ చేతకానితనాన్ని బయట పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వరంగల్ ఎయిర్‌పోర్టు క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నా వాస్తవాలు ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. దానికోసం కృషి చేసిన వాళ్లనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. తమ హయాంలో వరంగల్ ఎయిర్‌పోర్టుతో పాటు మరో ఆరు ఎయిర్‌పోర్టుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి చేతనైతే వేగంగా ఎయిర్‌పోర్టును పూర్తి చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.

రాష్ట్రంలో కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఏర్పడింది
ఎండలు కొట్టడం వల్ల పంటలు ఎండిపోతే నన్ను తిడుతున్నారంటూ రేవంత్ రెడ్డి మంత్రి లేకుండా మాట్లాడుతున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పుట్టక ముందు నుంచి కూడా ఎండలు ఉన్నాయని, కానీ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేకనే పంటలు ఎండుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం పైన పగ పట్టి ఎండబెట్టడం వల్లనే పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేసి ఉండి ఉంటే గోదావరి పరివాహక ప్రాంతం పచ్చగా ఉండేదని అన్నారు. స్వయంగా సాగునీటి శాఖ మంత్రి నియోజకవర్గంలోనే పంటలు ఎండిపోతున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కరువు వచ్చిన రోజే తెలుస్తుందని చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు చూసినప్పుడు ఆవేదన కలుగుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినా రేవంత్ రెడ్డికి మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు సైతం ఎండిపోయి తీవ్రమైన తాగునీటి సాగునీటి కొరత ఏర్పడిందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

అసమర్థుడి జీవయాత్ర మాదిరిగా రేవంత్‌రెడ్డి పాలన
రాష్ట్రంలో 15 నెలల రేవంత్ రెడ్డి పాలన అసమర్థుడు జీవయాత్ర మాదిరి నడుస్తున్నదని కెటిఆర్ విమర్శించారు. 15 నెలల్లో అన్ని రంగాల్లో విపులమైన రేవంత్ రెడ్డి పరిపాలన నడపలేక చతికిలపడ్డారని ఆరోపించారు. తెలంగాణకు వచ్చిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్‌కి పాల్పడుతున్నారని ఆరోపొంచారు. 30 శాతానికి పైగా కమిషన్‌లతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని, కాంట్రాక్టర్లు, బిల్డర్లు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని చెబుతున్నారని అన్నారు. సచివాలయం దాకా వచ్చి కాంట్రాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి గతంలో ఇప్పుడైనా ఉన్నదా..? అని కెటిఆర్ ప్రశ్నించారు.

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News