Sunday, January 5, 2025

బిఆర్‌ఎస్ ధాటికి రేవంత్ తట్టుకోలేకపోతున్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

అదానీకి మేము రెడ్ సిగ్నల్ వేస్తే కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ వేస్తున్నారు
మేము అదానీని ప్రోత్సహించలేదు
అదానీ కొన్ని ప్రతిపాదనలు ఇస్తే కెసిఆర్ తిరస్కరించారు
నేను అదానీని కలిశానని సిఎం ఫోటో రిలీజ్ చేశారు
ఆ ఫొటోను నేనే ట్విట్టర్లో పెట్టాను
సిఎం రేవంత్ లాగా ఇంటికి పిలిపించుకుని
నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు..
కోహినూర్ హోటల్‌లో కాళ్లు పట్టుకోలేదు
అదానీ తప్పిదాల గురించి రాహుల్‌గాంధీ మొట్టికాయలు వేస్తే రేవంత్ రెడ్డి మాపై మండిపడుతున్నారు
రాహుల్ తిట్టేసరికి రేవంత్ తప్పు ఒప్పుకున్నారు
బిఆర్‌ఎస్ ధాటికి తట్టుకోలేక రేవంత్ వెనక్కి తగ్గారు
అదానీ చెక్ ఇచ్చి 30 రోజులు గడచిపోయినా ఎందుకు క్యాష్ చేయలేదు..?
అదానీతో రూ.12,400 కోట్ల ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవాలి
ఒకవేళ తాము అదానీతో ఒప్పందాలు చేసుకొని ఉంటే వాటిని కూడా రద్దు చేయాలి
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో నిస్పృహ, అసహనం కనిపిస్తున్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన పనులు అంటూ పిచ్చి నివేదిక విడుదల చేశారని పేర్కొన్నారు. అవగాహనా రాహిత్యంతో సిఎం మాట్లాడితే ఎలా..? అని ప్రశ్నించారు. అదానీ కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే కెసిఆర్ తిరస్కరించారని గుర్తు చేశారు. అదానీకి తాము రెడ్ సిగ్నల్ వేస్తే మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అదానీతో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొని ఉంటే వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాము అదానీని ప్రోత్సహించలేదని, అదానీ కొన్ని ప్రతిపాదనలు ఇస్తే కెసిఆర్ తిరస్కరించారని తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి లెక్క ఆయన కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు తనది కాదని మండిపడ్డారు.

తెలంగాణ భవన్‌లో మంగళవారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్‌లతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, రాహుల్ తిట్టినందుకు రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్‌లో మాట్లాడారని విమర్శించారు. చిట్టినాయుడికి చిప్ దొబ్బినట్లు అనిపిస్తున్నదని రేవంత్‌రెడ్డిపై కెటిఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదానీతో బిఆర్‌ఎస్ అనుబంధం ఉందని రేవంత్ ఆరోపించారని, జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా..?.. రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయా..? ఎంపీగా పనిచేసిన ఆయనకు ఈ మాత్రం తెలియదా..? అని ప్రశ్నించారు. 700 కెవి ట్రాన్స్‌మిషన్ లైన్ల ప్రాజెక్టు కూడా కేంద్రానిదే అని, డ్రైపోర్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారని, కేంద్రం అనుమతి ఇస్తే డ్రైపోర్టు నిర్మాణం జరుగుతుందని చెప్పారు.

మైక్రోసాప్ట్ నుంచి రెండు దశల్లో ఒకసారి రూ. 15 వేల కోట్లు, రెండోసారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అది అదానీ డేటా సెంటర్ అని రిలీజ్ చేశారని మండిపడ్డారు. మైక్రోసాప్ట్ డాటా సెంటర్ పెట్టుబడిని అదానీ డాటా సెంటర్ అని తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. సిఎంకు సబ్జెక్ట్ తెలియక ఏదీ పడితే అది మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటకలుస్తుందని అన్నారు. గతంలో కూడా విప్రో ఛైర్మన్ సత్య నాదెళ్ల అంటూ నవ్వుల పాలు అయ్యారని చెప్పారు. మైక్రోసాప్ట్ వచ్చాక ఆమెజాన్ వచ్చిందని, ఆమెజాన్ రూ. 36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. మొత్తం రూ. 67 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను తాము తీసుకొచ్చామని వెల్లడించారు. తాను అదానీని కలిశాను అని ఫోటో రిలీజ్ చేశారని, ఆ ఫొటోను తానే ట్విట్టర్లో పెట్టానని, సిఎం రేవంత్ లాగా ఇంటికి పిలిపించుకుని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు.. కోహినూర్ హోటల్‌లో కాళ్లు పట్టుకోలేదని విమర్శించారు.
ప్రశ్నిస్తే నేను సైకోనా..?
ప్రశ్నిస్తే నేను సైకోనా..? అని కెటిఆర్ సిఎం రేవంత్‌రెడ్డిని అడిగారు. కొండారెడ్డి పల్లిలో రేవంత్‌రెడ్డి కోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమయ్యావు… మరి ఆయన శాడిస్తా..? అని నిలదీశారు. కొడంగల్‌లో వృద్ధుడైన సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్‌ను వేధించారని, సాయిరెడ్డి ఇంటిముందు గోడ కడితే బాధతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శైలజ కుటుంబానికి పరామర్శకు వెళ్తామంటే తమ పార్టీ ఎంఎల్‌ఎ కోవ లక్ష్మిని అడ్డుకున్నారని మండిపడ్డారు. కొడంగల్‌లో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారట అని, రామన్నపేటలో ప్రజలు తిరగబడితే కొడంగల్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నారని ఆరోపించారు.
అదానీ, అల్లుడు, అన్నలు, బావమరిది కోసం రేవంత్ పనిచేస్తున్నారు
అదానీ, అల్లుడు, అన్నలు, బావమరిది కోసం రేవంత్ పనిచేస్తున్నారని కెటిఆర్ విమర్శించారు. అదానీ గత నెల 14న రేవంత్‌కు చెక్ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఆ చెక్ ఎందుకు క్యాష్ చేయలేదని అంటున్నారని పేర్కొన్నారు. అదానీ చెక్ ఇచ్చి 30 రోజులు గడచిపోయినా ఎందుకు క్యాష్ చేయలేదని సిఎంను కెటిఆర్ ప్రశ్నించారు. అదానీ గజదొంగ అని మొన్న ముంబైలో రేవంత్ మాట్లాడారని, అదానీ గురించి ఆయనకు ఇప్పుడే తెలిసిందని రేవంత్ సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అదానీతో రూ.12,400 కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. ఆ ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తాము అదానీతో ఒప్పందాలు చేసుకొని ఉంటే వాటిని కూడా రద్దు చేయాలని తెలిపారు. వంద కోట్లు వెనక్కి ఇచ్చి వేల కోట్లు నొక్కేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అదానీ తప్పిదాల గురించి రాహుల్ మొట్టికాయలు వేస్తే రేవంత్ రెడ్డి తనపైన మండిపడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ తిట్టేసరికి రేవంత్ తప్పు ఒప్పుకున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ ధాటికి తట్టుకోలేక రేవంత్ వెనక్కి తగ్గారని పేర్కొన్నారు. మూసీని మురికి కూపంగా మార్చే అంబుజా సిమెంట్‌కు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. రాహుల్, రేవంత్ రెడ్డి మధ్య సయోధ్య లేదని, ఇద్దరిలో పిచ్చోడు ఎవరో.. వాళ్లే తేల్చుకోవాలని అన్నారు.
సిఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కుర్చీ కాపాడుకునేందుకే
రాష్ట్ర అభివృద్ది కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే ఇబ్బంది లేదు కానీ, సిఎం 28 సార్లు ఢిల్లీ వెళ్లి ఒక్క రూపాయి కూడా తేలేదని కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిధులతో ఢిల్లీ పర్యటనలు చేస్తూ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయడం లేదని ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కుర్చీ కాపాడుకునేందుకు, రాహుల్ గాంధీకి మూటల ఇచ్చేందుకే కానీ, ప్రజల కోసం కాదని విమర్శించారు. ఎనిమిది మంది బిజెపి ఎంపీలు రాష్ట్రానికి రూ.8 కూడా తీసుకురాలేదని పేర్కొన్నారు. 20 రోజులు పోరాటం చేసి మృత్యువుతో పోరాడి చనిపోయిన శైలజతో పాటు.. గురుకుల పాఠశాలల్లో మరణించిన 48 మంది విద్యార్ధుల తల్లిదండ్రులకు కెటిఆర్ బిఆర్‌ఎస్ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిర్లక్ష్యంతో ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామని ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
సిఎం పదవి వచ్చిన తర్వాత కూడా మాపై కోపం ఎందుకు..?
సిఎం రేవంత్‌రెడ్డి తప్పు చేసి తమ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి తాము భయపడేవాళ్లం కాదని స్పష్టం చేశారు. మృత్యువుతో పోరాడి చనిపోయిన శైలజకు, గురుకులాల్లో చనిపోయిన 48 మంది విద్యార్థుల మృతికి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కెటిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే అని పేర్కొన్నారు. గురుకులాల్లో పరిస్థితులపై రేవంత్ ఇప్పటివరకు సమీక్ష చేయలేదని, ఆందోళనలో ఉన్న లక్షలాది మంది గురుకుల విద్యార్థుల కుటుంబాల తరపున రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం.. చీల్చి చెండాడుతామని అన్నారు. విద్యార్థులు నిబ్బరంగా ఉండాలి. ఎవరికి అవసరమైనా బిఆర్‌ఎస్‌ను సంప్రదించాలని, విద్యార్థులను బిఆర్‌ఎస్ కాపాడుతుందని చెప్పారు. రేవంత్‌రెడ్డి తాను సిఎం అవుతానని గతంలో చెప్పేవారని, ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా తమపై కోపం ఎందుకని కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News