Sunday, December 22, 2024

హామీల అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

అవి ఆరు గ్యారెంటీలు కాదు.. 420 హామీలు

50 రోజుల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలు

ఢిల్లీలో తెలంగాణ వాదం
గులాబీ కండువాతోనే సాధ్యం
కేంద్రంలో బిజెపిని అడ్డుకునే దమ్మున్న పార్టీ బిఆర్‌ఎస్
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

ఘట్‌కేసర్ : కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పడం చూస్తుంటే హామీల అమలు చేతకాక చేతులు ఎత్తినట్లే కనిపిస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కేంద్రంలో బిజెపిని అడ్డుకోవాలంటే దమ్మున్న ప్రాంతీయ పార్టీ బిఆర్‌ఎస్‌తోనే సాధ్యమని అన్నారు. రంగారెడ్డి జిల్లా, ఘట్‌కేసర్ మండలం, కొర్రెముల పరిధిలోని చెరుకు బాలయ్య గార్డెన్‌లో మేడ్చల్ ఎంఎల్‌ఎ చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఉమ్మడి ఘట్‌కేసర్ మండల విజయోత్సవ సభ శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కెటిఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు కాదు.. 420 హామీలు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. రైతులకు గత డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పి నేడు రైతులను మోసం చేస్తున్నారని, వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారని, అప్పటి వరకు వేచి చూద్దామని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేదిలేదని, ఇండియా కూటమిలో నుండి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని, ఇప్పుడు కూటమిలో రాహుల్ గాంధీ ఒక్కరే ఉన్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలు గెలిపిస్తేనే హామీలు అమలు చేస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. అత్తలకు నాలుగు వేలు, కోడళ్ళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారని, దీనితో రాష్ట్రంలో కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలతో పాటు టికెట్ కొంటున్న పురుషులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నామని అన్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు కాలి ఉప ముఖ్యమంత్రి ఇంటి ముందు ఆటో తగులబెట్టిన సంఘటన చూస్తుంటే 50 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుస్తోందని అన్నారు. ఎంతోమంది తీస్మార్ ఖాన్‌లను ఎదిరించి తెలంగాణ తెచ్చిన కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్ పార్టీని వంద మీటర్ల దూరంలో పాతి పెడతామని బుడ్డర్ మాట్లాడుతున్నాడని, బుడ్డర్‌ఖాన్ కెసిఆర్‌కు పెద్ద లెక్కకాదని హెచ్చరించారు. బిఆర్‌ఎస్‌కు చెందిన ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బంది జరగదని, 38 మంది ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో బస్సు వేసుకొని వచ్చి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలంటే ఢిల్లీలో తెలంగాణవాదం వినిపించడం కేవలం గులాబీ కండువాతోనే సాధ్యమని అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, బిజెపికి చెందిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్రానికి తీసుకువచ్చింది ఏమీలేదని విమర్శించారు.

ఈ మల్లన్న లాంటి నాయకుడు మీకు దొరకడు ః ఎంఎల్‌ఎ చామకూర మల్లారెడ్డి
నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో సిసి రోడ్లు, మౌలిక సదుపాయాలు వందకు పైగా గుడుల నిర్మాణం చేపట్టామని మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ చామకూర మల్లారెడ్డి అన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ… నియోజకవర్గం ప్రజలకు అన్నివిధాల అండగా ఉంటున్నామని, తమ ఆస్పత్రిలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్ తీసుకువచ్చిన పథకాలు రద్దు చేస్తోందని మండిపడ్డారు.
వినికిడి లోపంతో బాధపడుతున్న బాలుడి శస్త్ర చికిత్సకు లక్ష ఆర్థిక సహాయం
ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధి మైసమ్మ గుట్టలోని బిఆర్‌ఎస్ కార్యకర్త కొమిరి శేషు కుమారుడు కె. ప్రదీప్ చిన్న వయస్సు నుండే రెండు చెవుల వినికిడి లోపంతో బాధపడుతుండగా శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎంఎల్‌ఎ చామకూర మల్లారెడ్డి శేషు నివాసానికి వెళ్లి శస్త్ర చికిత్స చేయించడానికి లక్ష రూపాయల చెక్కును అందించారు.
ఈ కార్యక్రమాలలో మల్కాజిగిరి ఎంఎల్‌ఎ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంఎల్‌సి, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి, ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, ఘట్‌కేసర్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్లు పలుగుల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News