బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటైనందునే ఎంఎల్‌సి కవితకు బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పనికిమాలిన స్టేట్‌మెంట్లు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎంఎల్‌సి కవితకు బెయిల్ రావటానికి బిజెపితో కుమ్మక్కు అయితే మరి నేషనల్ హెరాల్ కేసులో 2015 డిసెంబర్‌లో ఇడి కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ బెయిల్ వచ్చిందని, కాంగ్రెస్ కూడా ఎన్‌డిఎతో కుమ్మక్కు అయితేనే బెయిల్ వచ్చిందా..? అని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో భాగమైన ఎఎపి నేత మనీష్ సిసోడియాకు కూడా వారం రోజుల క్రితమే బెయిల్ వచ్చిన విషయాన్ని కెటిఆర్ ప్రస్తావించారు. ఓటుకు నోటు కుంభకోణంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారన్న సంగతి కాంగ్రెస్ నేతలు గుర్తు పెట్టాలకోవాలని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయని, కనుక వీరంతా ఎన్‌డిఎ భాగస్వాములేనని అనుకోవాలా అని కాంగ్రెస్ నేతలకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం
సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. దొడ్డి దారిన పిసిసి ప్రసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద రేవంత్‌రెడ్డి ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఆలోచనల్లో కుసంస్కారం …ఆయన మాటలు అష్ట వికారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణతల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అని, గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటదని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో..తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం….తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం…జై తెలంగాణ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.