Friday, December 20, 2024

నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్ వద్ద నిరుద్యోగ యువకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటాన్ని కెటిఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. నిరుద్యోగ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను పరామర్శించేందుకు వెళితే నిరుద్యోగ యువకులపై లాఠీఛార్జ్ చేయటమేమిటంటూ మండిపడ్డారు. ప్రజాపాలనలో పరామర్శించటం, నిరసన తెలిపే హక్కు కూడా లేదా..? అని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే నిరుద్యోగులను తరుముతూ పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఒక ప్రకటనలో ఆరోపించారు. నిరుద్యోగ యువకుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ పరామర్శించేందుకు వెళ్లిన బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులకు కూడా పోలీసులు అడ్డుకుని మోతీలాల్ కలవకుండా అడ్డుకొని వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న పార్టీ నాయకులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువకుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా వారికి సంఘీభావం తెలుపుతున్న యువకులు, ప్రతిపక్షాల నాయకులను అడ్డుకోవడం ప్రభుత్వ దమన నీతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇలాంటి అప్రజాస్వామ్య చర్యలను మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగులు, యువకులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉద్యోగ నోటిఫికేషన్‌లను వెంటనే జారీ చేయాలని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సర్కార్‌ను కెటిఆర్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News