Wednesday, January 22, 2025

రైతు భరోసాకు షరతులు పెడతామని ఎన్నికల ముందుకు ఎందుకు చెప్పలేదు

- Advertisement -
- Advertisement -

రైతు భరోసాకు షరతులు పెడతామని ఎన్నికల ముందుకు ఎందుకు చెప్పలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు అనుకోకుండా హామీలు ఇచ్చామని చెప్తున్నారని అన్నారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారికి పరిపాలన నడపడం రావట్లేదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి బండారం బయటపడటంతో అసెంబ్లీలో ఆగమాగం అయిండని విమర్శించారు. ముఖ్యమంత్రి అడ్డగోలుగా అన్ని అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేయడం తనకు చేతకాదని సిఎం చెప్పారని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా సిఎం ఒక కన్ఫ్యూషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారని అన్నారు. రూ.49,500 కోట్ల రుణమాఫీ రూ.26 వేల కోట్లు ఎలా అయిందో రేవంత్ రెడ్డి చెప్పలేకపోయారని, సిగ్గు లేకుండా 100 శాతం రుణమాఫీ అయిందని చెప్తున్నారని మండిపడ్డారు.

రుణమాఫీపై తాము అసెంబ్లీలో ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పే శిక్షణ ఎంఎల్‌ఎలకు సరిగా ఇచ్చినట్టు లేరని ఎద్దేవా చేశారు. అందుకే ఒక ఆయన 70 శాతం అయిందని చెబుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం 100 శాతం రుణమాఫీ చేశామని చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా సంపూర్ణంగా రుణమాఫీ జరగలేదని చెప్పారు. ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లెకి పోయినా ఈ విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రైతుబంధు, రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీ చేశామని డాంభికాలు చెప్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారని, మళ్లీ బ్యాంకులకు వెళ్లి రెండు లక్షల రుణాలు తెచ్చుకొమ్మని అన్నారని గుర్తు చేశారు. తాను రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మాటిచ్చారని, మాయమాటలతో రైతులను మోసం చేశారని విమర్శించారు. కేవలం 25 శాతం రుణమాఫీ చేసి.. 100 శాతం రుణమాఫీ అయినట్టు అసెంబ్లీలో ప్రకటన చేశారని, దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడారని ఆరోపించారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు పక్కకు పోయాయని అబద్ధాలు చెబుతున్నారన్నారు. రూ.22 వేల కోట్లు ఎవరికి ఇచ్చామో వివరాలు ఇవ్వాలని అడిగితే.. ప్రభుత్వం సమాధానం చెప్పలేదని చెప్పారు.

సిఎం చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు
ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు అని కెటిఆర్ అన్నారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి చెప్పే ప్రతీ మాట నమ్మాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. వర్షాభావ పంటలైన కంది, పత్తి, మొక్కజొన్నల రెండో పంటకు రైతుబంధు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 45 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్న రైతులకు రెండో పంటకు రైతుబంధు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. తెలంగాణ రైతు ఆత్మహత్యలపై కూడా అబద్ధాలు చెప్పే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 2014లో 1,348 రైతు ఆత్మహత్యలు ఉంటే… రైతుబంధు పథకం ప్రారంభమైన తర్వాత 2022 నాటికి కేవలం 178 రైతు ఆత్మహత్యలు మాత్రమే జరిగాయని తెలిపారు. కేవలం బిఆర్‌ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు 11 శాతం ఆత్మహత్యలతో తెలంగాణ దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో ఉండేదని, తెలంగాణ వచ్చాక 2023 నాటికి రైతు ఆత్మహత్యలను 1.57 శాతానికి తగ్గించామని అన్నారు.

రేవంత్ రెడ్డికి చరిత్ర, వర్తమానం తెలియదని, లెక్కలు అసలే తెలియవు అని ఎద్దేవా చేశారు. కొత్తగా కాంగ్రెస్ ఉద్ధరించింది ఏమీ లేదని, రుణమాఫీకి ఇచ్చింది కేవలం రూ.12 వేలు కోట్లే అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, రైతుబంధు ద్వారా రూ.73 వేల కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లో పదేళ్లలో రూ.లక్ష కోట్లు జమ చేశామని వివరించారు. రైతుబంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఒడిశా, బెంగాల్ లాంటి రాష్ట్రాలు రైతుబంధు తరహా పథకాలు తెచ్చాయని వ్యాఖ్యానించారు. రైతుబంధుకు పాన్‌కార్డు ఆప్షన్ పెడితే కోటీ 30 లక్షల మంది నష్టపోతారని, ఐటీ కట్టే వాళ్లందరికీ రైతుబంధు కట్ చేస్తే ఇక మిగిలేదెవరని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అందరికీ అన్ని.. ఇప్పుడు కొందరికి కొన్ని అని విమర్శించారు. సంక్రాంతి తర్వాత రైతుభరోసా అంటున్నారని, ఏ సంక్రాంతికో చెప్పడం లేదని అన్నారు. పేర్లు మార్చడం కాదు.. ప్రజలు కోరుకున్నది గుణాత్మకమైన మార్పు అని పేర్కొన్నారు. పెంచిన రైతుభరోసా రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చూపించాలని అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని, రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నీడలాగా వెంటాడుతూనే ఉంటామని కెటిఆర్ తేల్చిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News