Thursday, December 26, 2024

పార్టీ చిందరవందర.. పాదయాత్రకేల తొందర!

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 మాసాలు గడిచాయి. ఎన్నికలకు ఇంకొక నాలుగు సంవత్సరాల సమయం ఉండగా అప్పుడే ప్రధాన ప్రతిపక్షం పాదయాత్ర ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నది. ఇప్పటివరకు మనం తెలుగు రాష్ట్రాలలో చూసిన పాదయాత్రలన్నీ సార్వత్రిక ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు చేపట్టినవే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు పాదయాత్రలు బహుళ ప్రచారం పొందిన యాత్రలు. ఆ రెండు యాత్రలు ఇద్దరు తండ్రీ కొడుకులు చేపట్టినవి కావడం యాదృచ్ఛికం. 2003లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, 2017లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు విశేషంగా జనాకర్షణ పొందాయి.

అంతేకాదు, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కూడా మార్చేసి ఆ ఇద్దరినీ ముఖ్యమంత్రిలను కూడా చేశాయి. తెలంగాణలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్షంలో ఉండగా చేపట్టిన పాదయాత్ర కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దోహదం చేసింది. మరికొందరు రాజకీయ నాయకులు కూడా పాదయాత్రలు చేయడం చూశాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. వేరే రాష్ట్రాల్లో, ఉత్తరాదిలో కూడా కొందరు నాయకులు పాదయాత్రలు నిర్వహించారు. కానీ పైన చెప్పిన పాదయాత్రలకు వచ్చిన జనాదరణ మిగతావారికి అంతగా రాలేదన్న విషయం స్పష్టం. 2014 కంటే ముందు అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర నిర్వహించారు. ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు.

పాదయాత్రలు నిర్వహించి ముఖ్యమంత్రి కాలేకపోయిన వ్యక్తి ప్రస్తుత రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మాత్రమే. ఆమె ఒకసారి కాదు, రెండు సార్లు పాదయాత్ర చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిందితుడిగా జుడిషియల్ రిమాండ్‌లో ఉన్న కాలంలో ఆయనకు మద్దతుగా షర్మిల నిర్వహించిన పాదయాత్ర మొదటిది కాగా, తెలంగాణలో ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆమె నిర్వహించిన పాదయాత్ర రెండవది. ఈ రెండవ పాదయాత్ర పెద్ద సీరియస్‌గా సాగినట్టు జనానికి కనిపించలేదు. ఆ మాట అనడం కంటే జనం సీరియస్‌గా ఆమెను పట్టించుకున్నట్టు లేరని చెప్పాలి.

ఇలా పాదయాత్రలు చేస్తే అధికారంలోకి వస్తారు, ముఖ్యమంత్రి అవుతారు అనే ఒక అభిప్రాయం బలపడడానికి ప్రధాన కారణం పైన చెప్పిన నాయకులు. పాదయాత్ర నిర్వహించినంత మాత్రాన అధికారంలోకి వచ్చేస్తారు, ముఖ్యమంత్రి అయిపోతారని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని భావించి పార్టీ ఏర్పాటు చేసుకునే ముందు తన సొంత రాష్ట్రం బీహార్‌లో నిర్వహించిన పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన పెద్దగా ఫలితాలు ఏమీ సాధించలేదు. బహుశా పాదయాత్ర వల్ల ఆయనకు అక్కడి ప్రజల సమస్యలు బాగా తెలిసి ఉంటాయి. పాదయాత్రలు వ్యక్తులు, వారి రాజకీయ పక్షాల ప్రయోజనాలతోపాటుగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. నాయకుల ఆలోచనశక్తి కూడా విస్తృతం అవుతుంది. కాలినడక కారణంగా శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందనడంలో సందేహం లేదు.

అయితే పాదయాత్రల్ని తేలిగ్గా తీసి పారేయడానికి వీల్లేదు. ప్రతిపక్ష నాయకులు చేసిన పాదయాత్రలు అధికారంలో ఉన్న పార్టీలను మట్టి కరిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాదయాత్రల చర్చ ఎందుకు వచ్చింది అంటే భారత రాష్ట్ర సమితి కార్యాధ్యక్షుడు కేటి రామారావు దీపావళి పండుగ నాడు ‘కేటీఆర్ ను అడగండి’ అనే ఒక కార్యక్రమంలో పలు ప్రశ్నలకు జవాబులు ఇస్తూ త్వరలో పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పడంవల్ల. ఎక్స్ వేదికగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ త్వరలో పాదయాత్ర ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. మంచిదే, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల కోసం నాయకుడు ఎప్పుడైనా ప్రజల్లో తిరగాల్సిన అవసరం చాలా ఉంటుంది. అంటే నేను ప్రజల్లో లేనా అని చెప్పి కేటీఆర్ కోపగించవచ్చు.

అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ప్రజల దగ్గరికి ఎక్కువగా వెళ్లే అవకాశం నాయకులకు కలుగుతుంది అనడంలో సందేహం లేదు. నాయకులు ఆ అవకాశాన్ని అంది పుచ్చుకుని ప్రజలకు మరింత చేరువై, వారి మద్దతు పొందుతారా లేదా అన్నది వారి వారి స్వభావాలను బట్టి ఉంటుంది. ఆ ఉద్దేశంతో అన్నమాట ఇది. ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా పాదయాత్ర చేస్తానని చెప్పిన కేటీఆర్ ఈ మాటలు యథాలాపంగా అన్నారా లేక అది పార్టీ నిర్ణయమా అన్నది తెలియాల్సి ఉంది.

భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఇంకా పార్టీకి నాయకత్వం వహిస్తూనే ఉన్నారు. అధికారం కోల్పోయిన ఈ 11 మాసాల్లో ఒకటి రెండు సందర్భాల్లోనే ఆయన బయట కనిపించినా ఇంకా ఆయనే ఆ పార్టీకి అధినాయకుడు అన్న విషయంలో ఎటువంటి సందేహం ఉండనవసరం లేదు. పాదయాత్ర వంటి కార్యక్రమం ఆ పార్టీ అధినాయకుడు చేపట్టాలే తప్ప రెండవ శ్రేణి నాయకులు కాదు కదా. అయితే వయసు రీత్యా ఆయన పాదయాత్రకు సిద్ధం కాలేకపోతే పార్టీ తరఫున పాదయాత్ర వంటి ముఖ్య కార్యక్రమం ఎవరు చేపట్టాలి అనేది పార్టీలో నిర్ణయం జరగాలి. అలా కాకుండా ఇప్పుడు కేటీ రామారావు తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించడం వల్ల తానే వారసుడినని చెప్పుకున్నట్టు అయింది. అంటే కేసిఆర్ ఇక క్రియాశీల రాజకీయాల్లో పాలుపంచుకోరు అనుకుందామా? అయితే అదే సమయంలో 2025లో కేసిఆర్ మరో రూపంలో బయటికి వస్తారని ఇదే కేటీఆర్ చెప్తున్నారు. లెక్క ప్రకారం తెలంగాణలో శాసన సభకు ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉంది. సాధారణంగా రాజకీయ పార్టీలు ఇటువంటి కార్యక్రమాలను ఎన్నికలకు ఓ ఏడాది ముందు అటుఇటుగా చేపడతాయి.

మేధా సంపత్తికి వారసత్వం ఉంటుందో లేదో తెలియదు గాని రాజకీయాల్లో, వ్యాపార రంగంలో వారి వారి వారసులుగా సంతానమే రావడం సహజం. ఓ శాస్త్రజ్ఞుడి కొడుకో కూతురో శాస్త్రజ్ఞులే అవుతారని గ్యారంటీ లేదు, అలాగే ఓ మంచి ఉపాధ్యాయుడి కుమారుడు లేదా కుమార్తె ఉపాధ్యాయులే అవుతారని కూడా చెప్పడానికి వీల్లేదు. వ్యాపారాల్లో, రాజకీయాల్లో మాత్రం తప్పనిసరిగా వారసులు వస్తారు. కొన్ని మినహాయింపులు ఉంటే ఉండొచ్చు కానీ చాలా వరకు రాజకీయ వారసత్వం కొడుకులకు కూతుళ్లకు రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. దక్షిణాదిలో ఇవాళ స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్‌ను వారసులుగా తెచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. స్టాలిన్, చంద్రబాబునాయుడు ఇద్దరూ డబ్భయ్యవ పడిలో ఉన్నవాళ్లు. సహజంగానే కొడుకులకు అధికారాన్ని అప్పజెప్పాలనే ఆలోచనలో ఉంటారు.

స్టాలిన్ తమిళనాడులో తన కొడుకును ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిని చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు తన కుమారుణ్ని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రితో సమానంగా రెండో వైపు కుర్చీ వేసి కూర్చోబెడుతున్నారు. తండ్రి తిరిగి ముఖ్యమంత్రి కావడం కోసం లోకేష్ కూడా ఎన్నికల ముందు పాదయాత్ర చేశాడన్నది గమనించాలి. వయసులో చంద్రశేఖర రావు స్టాలిన్, బాబు ఇద్దరి కంటే కొంచెం చిన్నవారు. అయితే కేసీఆర్ గతంలోనే తన కుమారుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నాడనే ఒక ప్రయోగాన్ని అయితే తెరమీదకు తెచ్చి అది బెడిసికొట్టడంతో వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడేమయినా పార్టీలో ఆయన కుమారుడికి మద్దతు పెరిగిందని కేసీఆర్ భావిస్తున్నారా, అందుకే ఇప్పుడు కుమారుడికి నాయకత్వాన్ని అప్పగించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారా!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉన్నది ఎన్నికలకు. ఈ 11 మాసాల కాలంలో శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరిగినా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు ఒక్కసారి కూడా శాసనసభ సమావేశాలు హాజరు కాలేదు. ఇంటికి లేదా ఫామ్ హౌస్‌కి పరిమితమయ్యారు. ఆ పార్టీలో జనాకర్షణ కలిగిన మొదటి నాయకుడు చంద్రశేఖరరావు. విద్యాధికుడైనా, సమర్థత ఎంత ఉన్నా స్వభావరీత్యా కేటీ రామారావు కంటే కెసిఆర్ తర్వాత పార్టీ లోపలా వెలుపలా ఆదరణ పొందిన నాయకుడు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇది జగమెరిగిన సత్యం. రాజకీయాల్లో వారసత్వం కొడుక్కే దక్కాలని రూల్ ఏమీ లేదు కదా.

దళితుడిని ముఖ్యమంత్రిని చేసి తాను పరిపాలన గాడి తప్పకుండా కాపలా కాస్తానని ఉద్యమ సమయంలో చెప్పిన చంద్రశేఖరరావు తరువాత తానే ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు వారసత్వాన్ని తన కొడుకు కట్టబెట్టాలన్న ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం బలంగా ఉన్న విషయం తెలిసిందే. మద్యం కుంభకోణం ఆరోపణలతో కొద్ది మాసాలపాటు జైలు రిమాండ్‌లో ఉండి వచ్చిన ఆయన కుమార్తె కవిత దాదాపుగా రాజకీయాల నుంచి తెరమరుగైనట్టుగా కనిపిస్తున్నది. సంతానంలో ఒకరినుంచి పోటీ తగ్గిపోయినట్టే. పార్టీలో, భవిష్యత్తులో తిరిగి వస్తుందనుకుంటున్న అధికారంలో వారసత్వాన్ని పదిలపరచుకోవడం కోసం

కేటి రామారావు ఈ పాదయాత్ర చేస్తానని చెప్తున్నారా? సుదీర్ఘ పాదయాత్రలు చేయడం అంత సులభమైన పని కాదు. ఆషామాషీగా జరిగేది కాదు. దానికి ముందస్తు ప్రణాళికలు ఉండాలి. ఎక్కడికక్కడ పనిచేసే యంత్రాంగం కదలాలి. జన సమీకరణకు, ప్రజా సమస్యలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి బోలెడంత కసరత్తు అవసరం ఉంటుంది. ప్రతిపక్షంలోకొచ్చిన ఈ పదకొండు మాసాల్లో అటువంటివన్నీ ఏమైనా కేటీ రామారావు చేసుకున్నారా లేక ఇప్పటికి ఇప్పుడు ఈ ఆలోచన వచ్చిందా? ఆయనే చెప్తున్నట్టు కార్యకర్తల కోరిక మేరకు ఈ పాదయాత్ర చేపట్టాలనుకుంటున్నారా? వివరాలైతే తెలియాల్సి ఉన్నది. ఏదిఏమైనా పాదయాత్ర అనేది తప్పనిసరిగా ప్రతినాయకుడికి ప్రజలకు దగ్గరగా వెళ్లి సమస్యలు తెలుసుకోవడానికి ఎంతో ఉపకరిస్తుంది.

అంతకన్నా ముందు భారత రాష్ట్ర సమితి చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందుగా ఇల్లు చక్కదిద్దుకొవాల్సి ఉంది. ఇప్పటికే పది మంది శాసనసభ్యులు అధికారపక్షానికి వలసపోయారు. మరికొందరు పక్క చూపులు చూస్తున్న విషయం తెలియంది కాదు. ఇంకోపక్క దీపావళి నాటికే బాంబులు పేల్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దక్షిణ కొరియా దేశంలో చేసిన ప్రకటనకు కొనసాగింపా అన్నట్టు విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి జస్టిస్ మదన్ లోకూర్ ఇప్పటికే సమర్పించిన నివేదిక, కాళేశ్వరం వ్యవహారంలో జస్టిస్ పీసి ఘోష్ త్వరలో సమర్పించనున్న నివేదికల పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంది. మరో పక్క ఫార్ములా కార్ రేసుల వ్యవహారం కారు గుర్తు పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టేట్టే ఉంది. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఎట్లా ఉండబోతోందో తెలియకుండా ముందుగా అక్టోబర్ లోనే, తరువాత సంవత్సరంలో జరిగే రేసుల కోసం 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకు ఇచ్చిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. గంపెడు సమస్యలు ఎదురుగా ఉంచుకొని ఇప్పటినుండే పాదయాత్ర ప్రణాళికలు అవసరమా?.

మన తెలంగాణ ఎడిటర్, దేవులపల్లి అమర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News