ఐఐటి విద్యార్థిని అంజలి చదువుకి ఆర్థిక సహాయం
మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రి కెటిఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. పేదరకంలో కొట్టుమిట్టాడుతున్న ఒక విద్యార్ధినిని ఆదుకున్నారు. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండు సంవత్సరాల క్రితం ఐఐటిలో సీటు దక్కించుకుంది. అయితే తన కుటుంబ పేదరికం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాలని మంత్రి కెటిఆర్‌ను కోరింది. మేకల అంజలి పేదరిక పరిస్థితులను తెలుసుకున్న ఆయన తన వ్యక్తిగత హోదాలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆమె ఫీజులకు అవసరమైన నిధులను అందిస్తూ వస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది ,రానున్న సంవత్సరానికి సంబంధించిన ఐఐటి ఫీజుల మొత్తాన్ని బుధవారం మంత్రి కెటిఆర్ అంజలి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా అంజలి చదువు మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె తన చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మంత్రి కెటిఆర్ తమ కూతురు ఐఐటి విద్యకు సంబంధించిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబం ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.