రాష్ట్రంలో ఏర్పాటుకు క్రాస్‌ఫీల్డ్ సంస్థ సుముఖత
యుకె పర్యటన రెండో రోజున
పలు కంపెనీల ప్రతినిధులతో
మంత్రి కెటిఆర్ భేటీ
తెలంగాణలో పెట్టుబడులకు గల
అవకాశాలను వివరించిన మంత్రి
హెచ్‌ఎస్‌బిసికి చెందిన పాల్‌మెక్
పియార్సన్, బ్రాడ్‌హిల్ బర్న్‌లతో
కెటిఆర్ సమావేశం థామస్
లాయిడ్ ఎండి నందితా తుల్లీ
బృందంతో చర్చలు
తెలంగాణకు రావాలని ఆహ్వానం
మన స్కిల్ అకాడమీతో కలిసి
పనిచేయడానికి సంసిద్ధత
గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్స్యూమర్
సంస్థతో భేటీ లండన్ కింగ్స్
కాలేజీతో అవగాహన ఒప్పందం
ఫార్మా వర్శిటీ పరిశోధన,
అకాడమిక్ రంగాల్లో కలిసి
పనిచేయడానికి కింగ్స్ కాలేజీ
అంగీకారం కింగ్స్ కాలేజీతో
ఒప్పందం భారత్-బ్రిటన్
సంబధాల్లో మరో మైలురాయి:
బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ స్థాయి ఎరోనాటికల్ యూనివర్సిటీని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు తమతో కలిసి రావాల్సిందిగా ప్రముఖ క్రాన్‌ఫీల్డ్ సంస్థ యూనివర్శిటీ బృందానికి రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆ యూనివర్సిటీ కూడా సానుకూలతను వ్యక్తం చేసింది. పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ రెండవ రోజు కూడా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ లో పెట్టుబడులకు గల అవకాశాలను కెటిఆర్ సమగ్రంగా వారికి వివరించారు.
హెచ్‌ఎస్‌బిసికి చెందిన పాల్ మెక్ పియార్సన్, బ్రాడ్ హిల్ బర్న్‌లు కెటిఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని వివరించారు. ఇప్పటికే తమక్కడ బలంగా వేళ్లూనుకున్నామని తెలిపారు. విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రతినిధులు కెటిఆర్‌కు వివరించారు. ఇం దుకు సంబంధించి త్వరలోనే స్పష్టమై న కార్యాచరణతో మరోసారి సమావే శం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడిగా పెట్టే ప్రతి రూపాయికి భద్రత కల్పిస్తామన్నారు. అలాగే పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టిఎస్.. ఐ పాస్ ద్వారా పదిహేను రోజుల్లో కంపెనీకు అవసరమైన అన్ని రకాల అనుమతులను జారీ చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. ఈ విధానం కారణంగానే రాష్ట్రానికి పలు కంపెనీలు వస్తున్నాయ ని వివరించారు.
ఈ నేపథ్యంలో రా ష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కెటిఆర్ తో భేటీలో పలు కంపెనీలకు చెం దిన ప్రతినిధిలు సుముఖతను వ్యక్తం చేశారు. అనంతరం థామస్ లాయిడ్ గ్రూప్ ఎండి నందిత సెహగల్ తుల్లీతో పాటు ప్రతినిధులతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొనసాగుతున్న తమ కంపెనీ కార్యకలాపాల విస్తరణపై కెటిఆర్‌తో సుధీర్ఘంగా చర్చించారు. అలా గే పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో సమావేశమైన కెటిఆర్, తెలంగాణలో నైపుణ్య శిక్షణ అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పలు కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్‌తో పని చేసేందుకు రియల్ సంస్థ ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తో భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన పియర్సన్ సంస్థకి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్ వారిని తెలంగాణకి ఆహ్వానించారు. క్రాన్ ఫీల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ హాల్ఫార్డ్, ప్రో వైస్ ఛాన్స్లర్ పోల్లార్డ్ లు మంత్రి కెటిఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏరోనాటికల్ యూనివర్సిటీ ప్రయత్నాల పట్ల తాము ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్స్యూమర్ సంస్థతో భేటీ
హైదరాబాద్ ఫార్మాలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గ్లాక్సో స్మిత్ క్లైన్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్ ఫ్రాంక్ రాయరీతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ విస్తరణ ప్రణాళికలు, ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న తమ విభాగాల పురోగతిని మంత్రికి ఫ్రాంక్ రాయట్ వివరించారు. జిఎస్‌కె నుంచి హాలియన్ పేరుతో కన్స్యూమర్ హెల్త్ కేర్ విభాగం విడిపోయి స్వతంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. తమ కంపెనీ వ్యూహాల్లో హైదరాబాద్‌కు ఎల్లప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రూ. 710 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని, 125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. గత రెండు సంవత్సరాల్లోనే దాదాపు రూ. 340 కోట్లను హైదరాబాద్ ఫార్మాలో పెట్టుబడిగా పెట్టామన్నారు. హైదరాబాద్‌లోని తమ సేఫ్టీ , రెగ్యులేటరీ విభాగం ద్వారా విస్తరణ అవకాశాలను మరింత పెంచుకుంటామని ఫ్రాంక్ రాయట్ తెలిపారు. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గ్లాక్సో స్మిత్ క్లైవ్‌ను ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అభినందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరవ ఫార్మాస్యూటికల్ సంస్థ
గ్లాక్సో స్మిత్‌క్లైన్ అనేది ఒక హెల్త్ కేర్ సంస్థ. ఫార్మాస్యూటికల్ మందులు, వ్యాక్సిన్‌లు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులపై పరిశోధనలు చేయడంతో పాటు వాటిని తయారు చేస్తుంది. 2019 నాటి ఫోరబ్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇది. 43,731.8 మిలియన్ల డాలర్ల ఆదాయం, ప్రపంచవ్యాప్తంగా 94,000 మంది ఉద్యోగులు జిఎఎస్‌కె సొంతం. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 ఉత్తమ కంపెనీల జాబితాలో జిఎస్కే 264వ స్థానంలో ఉంది. 40 కొత్త మందులు, 17 కొత్త వ్యాక్సిన్‌లను కంపెనీ అభివృద్ది చేస్తోంది.
కింగ్స్ కాలేజీతో అవగాహన ఒప్పందం
ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ ఫార్మా సిటీ లో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకాడమిక్ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కింగ్స్ కాలేజ్ పనిచేస్తుంది. మంత్రి కెటిఆర్ సమయంలో రాష్ట్ర ఐటి, పరిక్షమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్, లైఫ్ సైన్సెస్) కింగ్స్ హెల్త్ పార్ట్‌నర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రిచర్డ్ ట్రెంబాత్‌లు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. గత నెలలో బ్రిటిష్ కౌన్సిల్ నేతృత్వంలో కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్‌తో సహా కింగ్స్ ప్రతినిధులు భారతదేశంలో పర్యటించారు. దానికి కొనసాగింపుగా ఇవాళ లండన్‌లోని కింగ్స్ కాలేజ్ క్యాంపస్‌ను మంత్రి కెటిఆర్ సందర్శించారు. తాజా ఒప్పందంతో ఫార్మా రంగ ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతో పాటు పాఠ్యాంశాల తయారీలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజ్ తన సహకారాన్ని అందిస్తుంది. ఫార్మా సిటీ , లైఫ్ సైన్సెస్ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వ విజన్ కు కింగ్స్ కాలేజ్ తన తోడ్పాటును అందిస్తుంది. ఈ సందర్భంగా కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ షిట్జి కపూర్ మాట్లాడుతూ… టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తాజా ఒప్పందం దోహదపడుతుందన్నారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన తమ యూనివర్సిటీ ఇప్పటికే ఇండియాలోని ప్రతిష్టాత్మక సంస్థలతో అకాడమిక్ అంశాల్లో కలిసి పనిచేస్తోందన్నారు. ముంబైలోని టాటా మోమోరియల్ సెంటర్ తో కలిసి ఆంథ్రోపాలజికల్ రీసెర్చ్ స్టడీ నిర్వహిస్తున్నామన్నారు. కింగ్స్ కాలేజ్ తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం భారత్, యుకె సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా మారబోతుందన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఫార్మా సిటీ విజన్‌లో భాగమన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టమ్ విలువ 50 బిలియన్ డాలర్ల కు చేరుతుందన్నారు. ఫార్మా పరిశోధన, శిక్షణలో ప్రపంచంలోని అత్యంత్య నైపుణ్యం కల యూనివర్సిటీతో తమ ప్రభుత్వం కలిసి పనిచేయడంపై సంతోషంగా ఉందన్నారు. యుకె గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చాంపియన్ సర్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. కింగ్స్ కాలేజ్ , తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం యూకే, ఇండియా సంబంధాల్లో మైలురాయి లాంటిదన్నారు. ఈ ఒప్పందంతో ఫార్మా రంగంలో పరిశోధన, బోధన అంశాల్లో తెలంగాణ కు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, సహకారం అందుతుందన్నారు.