Monday, December 23, 2024

నిజామాబాద్ లో ఐటి హబ్‌ను ప్రారంభించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం అభివృద్ధి పనుల జాతర కొనసాగింది. రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా రోజంతా ప్రారంభోత్సవాలు కొనసాగాయి. 50 కోట్లతో నిర్మాణం చేపట్టిన ఐటి హబ్‌ను కెటిఆర్ ప్రారంభించారు. అక్కడ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. సుమారు 1400 మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించామని, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని ఐటి హబ్‌లతో జిల్లా కేంద్రంలోనే ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు. 11 కోట్లతో నిర్మాణం చేపట్టిన నేషనల్ అకాడమి కన్‌స్ట్రక్షన్ (న్యాక్) భవనాన్ని ప్రారంభించారు. ఇందులో 120 మందికి వసతి సౌకర్యం ఉందని కెటిఆర్ అన్నారు.

7 కోట్లతో నిర్మాణం చేపట్టిన మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనాన్ని ప్రారంభించి కార్యాలయంలో కలియ తిరిగారు. అన్నీ వసతులను పరిశీలించారు.రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని కార్పొరేషన్ కార్యాలయ భవనం నిజామాబాద్ జిల్లాలో నిర్మించుకున్నారని ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్లను అభినందించారు. 22 కోట్ల రూపాయలతో రఘునాథ చెరువు వద్ద నిర్మించిన మినీ ట్యాంక్ బండ్‌ను ప్రారంభించి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ను మించేలా ఉందని కొనియాడారు. అర్సపల్లిలో 15 కోట్ల 50 లక్షలతో వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లో మహాప్రస్థానం కన్నా ఇక్కడి వైకుంఠధామం బాగుందని ఎమ్మెల్యేను అభినందించారు. దుబ్బలో వైకుంఠధామాన్ని కెటిఆర్ ప్రారంభించారు.

సఫాయి కార్మికులతో సహాపంక్తి భోజనం చేసిన కెటిఆర్ ః
జిల్లా కేంద్రానికి వచ్చిన కెటిఆర్ కార్పొరేషన్‌లోని సఫాయి కార్మికులతో సహాపంక్తి భోజనం చేశారు. సఫాయి కార్మికులు కరోనా కష్ట కాలంలో కష్టపడ్డ తీరును అభినందించారు. సిఎం కెసిఆర్ సఫాయి అన్నలకు సలాం అంటూ కొనియాడారని ఆయన ఆదర్శంతోనే సఫాయి కార్మికులతో కలిసి భోజనాలు చేస్తున్నామని అన్నారు. సఫాయి కార్మికులు యాదమ్మ, లావణ్యలతో కెటిఆర్ ముచ్చటించారు. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనా కష్ట కాలంలో 41 రోజుల పాటు ప్రతి రోజు 3100 మందికి భోజనాలు పెట్టడం అభినందనీయమన్నారు. కష్టపడే వారిని కడుపులో పెట్టుకొని గెలిపించుకోవాలని నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రతియేటా బడ్జెట్ నుంచి వంద కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు కెటిఆర్ చెప్పారు.
నగరంలో 60 డివిజన్‌లకు 60 కోట్ల నిధులు ః
నిజామాబాద్ నగరంలోని 60 డివిజన్‌లకు 60 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి కెటిఆర్ ప్రకటించారు. ఒక్కొ డివిజన్‌కు కోటి రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తున్నానని, అంతర్గత రహదారులు నిర్మించుకోవాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News