హైదరాబాద్: 18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. బన్సీలాల్ పేట్ చాచా నెహ్రూనగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. చాచా నెహ్రూనగర్‌లో రూ.19.20 కోట్లతో 248 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లు కట్టిస్తా, పెళ్లి చేస్తానని చెప్పింది ఒక్క కెసిఆరేనని స్పష్టం చేశారు. మార్కెట్లో ఒక్కో ఇళ్లు రూ.40 లక్షలు పలుకుతుందని కెటిఆర్ తెలియజేశారు. తెలంగాణ రాక ముందు పెన్షన్ రూ.200 ఉంటే రూ.2 వేలు చేశామని కొనియాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యుత్, తాగునీటి సమస్యలను కెసిఆర్ ప్రభుత్వం పరిష్కరించిందని మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని ఇతర పేదలకు ఇళ్లు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, లంచాలు తీసుకొని ఇల్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్, మహమూద్ అలీ, మేయర్ విజయ లక్ష్మీ, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.