కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కెటిఆర్ సవాల్
హైదరాబాద్‌లో అద్భుత మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం
చేతనైతే సహకరించండి, అవాస్తవ ఆరోపణలు వద్దు
కంటోన్మెంట్ భూములను అప్పగిస్తే అద్భుతాలను సృష్టిస్తాం
మనతెలంగాణ/సిటీ బ్యూరో: కేసుల పేరుతో అభివృద్ధిని అడ్డుకోవడం కాదని దమ్ముంటే నా పై కేసు పెట్టాలని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కేంద్ర మంత్రి కిషన్‌డ్డికకి సవాల్ విసిరారు. నగరవాసులకు అంతర్జాతీయ ప్రమాణాలతోకూడిన మౌలిక సదుపాయాలు కల్పనే లక్షం గా ప్రభుత్వం కృషి చేస్తోందని ఇందుకు దశలవారీగా అభివృద్ధి పను లు చేపడుతున్నామని ఆయన అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కైత్లాపూర్ వద్ద రూ.86 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంగళవారం కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ నగరంలో మెరుగైన రవాణా వసతులను కల్పించేందుకు ఎస్‌ఆర్‌డిపి మొద టి దశ కింద రూ.8055 కోట్లతో ఎల్‌బినగర్, నుంచి కూకట్‌పల్లి, ఉప్పల్ నుంచి శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలలో అండర్‌పాసులు, ఆర్‌ఓబిలు, ఫ్ల్లైఓవర్లను చేస్తున్నామన్నారు.
నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతూ అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న నగరంగా తీర్చిదిద్దుతుంటే కేంద్రం ప్రభుత్వం మాత్రం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతూ అడ్డుకుటోందని కెటిఆర్ ధ్వజమెత్తారు. ఇందుకు ఈ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రే స్వయంగా వతాస్తు పలుకుతుండడం సిగ్గుచేటాన్నారు. కేంద్ర ప్రభుత్వ భూముల్లో ప్రాజెక్టులు చేపడితే కేసులు పెడతామని ఈ ప్రాంత కేంద్ర మంత్రి అంటున్నారు…మీకు చేతనైతే ఇంజనీర్లు, కార్మికుల మీద కాదు కేసులు పెట్టేది… దమ్ముంటే మున్సిపల్ మంత్రినైన నాపై కేసు పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వం మీద కేసులు పెట్టండి అంటూ మంత్రి కెసిఆర్ సవాల్ విసిరారు. అంతేకాదు నీకు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద పలుకుబడి ఉంటే కంటోన్మెంట్‌తోపాటు కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్ వెళ్లే మార్గంలోని రక్షణ రంగానికి చెందిన భూములను ఇప్పించాలని డిమాండ్ చేశారు. వాటిలో అద్భుతంగా స్కైవేలు, ఫ్లై ఓవర్‌లు కట్టే బాధ్యత మాది అన్నారు.
మంచి పనులు చేస్తుంటే చేతనైతే సహాయం చేయండి లేకపోతే మిన్నకుండి పోవాలి తప్ప ప్రతిదాంట్లో అడ్డం పడడం, అవాస్తవ మాటలు మాట్లాడడం మంచిది కాదని విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ మంత్రి కెటిఆర్ హితవు పలికారు. కుల పిచ్చి మత పిచ్చి పార్టీలు మనకు వద్దని, కేసీఆర్ నాయకత్వం మనకు శ్రీరామ రక్ష అన్నారు. గత ప్రభుత్వాలు పెన్షన్ల కోసం 800 వందల కోట్లు ఖర్చు పెడితే మేము రూ.10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. త్వరలోనే కొత్త రేషన్‌కార్డులను అందజేస్తామని ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. వెయ్యికోట్ల రూపాయలతో ఎస్‌ఎన్‌డిపి నీ చేపట్టామని, నాలాలాపై ఇండ్లు కట్టుకున్న వారికి ఇబ్బంది లేకుండా వారికి డబుల్ బెడ్ రూం కేటాయిస్తామని తెలిపారు. అదేవిధంగా సుచిత్ర సర్కిల్‌లో కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా అక్కడ అభివృద్ధి పనులను చేపట్టి తీరుతామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.
నిధులు గుజరాత్‌కేనా? : మంత్రి కెటిఆర్
గుజరాత్‌లో అభివృద్ధి కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వరని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి ఇవ్వలే అదే గుజరాత్‌లో వరదలు వస్తే వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. ప్రధాన మంత్రి హైదారాబాద్‌కు వచ్చారు.. వెళ్లారు… మళ్లీ వస్తున్నారు మాకు ఏమైనా నిధులు ఇస్తున్నారా లేదా స్పష్టం చేయాలని మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసి 50 రోజుల్లో మార్పు చూపిస్తానన్న ప్రధాన మంత్రి మరి 500 రోజులు గడిచాయి కదా ఏం మార్పు వచ్చిందో చెప్పాలన్నారు. అప్పుడు నోట్ల రద్దుతో సామాన్య ప్రజలతో ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో యువకుల జీవితాలతో ప్రధాని ఆటలు ఆడుకుంటు దేశాన్ని రావణకాష్ట్టంగా మార్చుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, శంభీపూర్‌రాజు, నవీన్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్‌లు పాల్గొన్నారు.