Monday, December 23, 2024

కెసిఆర్ ఆత్మ అంబేద్కర్

- Advertisement -
- Advertisement -

KTR inaugurated the modernized ZP High School

ఆయనే నిజమైన అంబేద్కర్ వాది

ఆయన స్ఫూర్తితోనే 14ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు

105సార్లు రాజ్యాంగాన్ని సవరించిన
వారిని ఏమంటారు, ఆ పనిచేసిన
కాంగ్రెస్, అటల్ బిహారీ వాజ్‌పేయిలపై
మీ అభిప్రాయమేమిటి?
కొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించాలని
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్
బహిరంగంగా ప్రకటించలేదా?

కర్ణాటకలోని అప్పర్ భద్రకు జాతీయ
హోదా ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి
ఎందుకు ఇవ్వరు?
రాష్ట్రానికి ఏడేళ్లలో ఒక్క కేంద్రీయ
విద్యాసంస్థనూ ఇవ్వలేదు
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట జడ్‌పి ఉన్నత పాఠశాల సభలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి : అంబేద్కర్ స్ఫూర్తితో 14 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి కెసిఆర్ అని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఎగిరెగిరి పడుతున్నారన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.3కోట్లతో ఆధునీకరించిన జడ్పి ఉన్నత పాఠశాలను కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఇప్పటివరకు కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు 105 పర్యాయాలు రాజ్యాంగాన్ని సవరించారన్నారు.

2001లో ప్రధాని వాజ్‌పేయ్ రాజ్యాంగాన్ని మార్చడానికి కమిటి వేశారని దీనిపై బిజెపి వారు ఏమంటారని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రస్తుత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మొహన్ భగవత్ బహిరంగంగా ప్రకటించారని దీనిపై మీ వైఖరి ఏంటని నిలదీశారు. అంబేద్కర్‌ను కెసిఆర్ అవమానించారని కొందరు దుర్మార్గంగా, అరాచకంగా మాట్లాడడం తగదన్నారు. వీరి వ్యవహారంచూస్తే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. మోడి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వానికి దళితులపై అంత ప్రేమ ఉంటే తెలంగాణలో కెసిఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరిస్తున్న చందంగా తెలంగాణ పట్ల బిజెపి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయాల కేటాయింపులో ప్రధాని మోడీ తెలంగాణకు గుండు సున్నా చూపారని ఏడేళ్లలో ఒక కేంద్రీయ విద్యాసంస్థను కూడా తెలంగాణకు అందించలేదని కేంద్రం 8 ఐఐఎం కళాశాలలను మంజూరు చేస్తే.. తెలంగాణకు ఇచ్చింది సున్నా అన్నారు.

16 ఐఎస్‌ఇఆర్ రిసర్చ్ కేంద్రాలను మంజూరుచేస్తే అందులోనూ తెలంగాణకు గుండు సున్నా చూపారన్నారు. దేశం మొత్తంలో వందకుపైగా నవోదయ పాఠశాలలను మంజూరుచేస్తే ఒక్క నవోదయ పాఠశాలను కూడా తెలంగాణకు కేటాయించలేదని దుయ్యబట్టారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ పట్ల ఇంత వివక్ష ప్రదర్శించడం అన్యాయమన్నారు. అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత కేంద్రంలోని ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి విషయంలో కూడా మోడి సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలోనే అత్యంత వెనుకబడిన కరువు జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా అందించడంలో కూడా వివక్ష చూపుతున్నారన్నారు. కృష్ణ నీటి వనరులు ఉన్న ఈ జిల్లాకు పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ఇవ్వాలని మొరపెట్టుకున్న అది చేయలేదని ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చారన్నారు. కర్ణాటకకు ఇస్తారెట్ల… తెలంగాణ ఇవ్వరు ఎందుకని కెటిఆర్ మండిపడ్డారు.

తెలంగాణలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ మన ఊరు మన బడి పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 26వేల పాఠశాలలను సంస్కరించేందుకు రూ.7, 289 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ప్రపంచంతో పోటీపడేవిధంగా పౌరులను తయారు చేయడమే తెలంగాణ సర్కార్ లక్షమన్నారు. అత్యున్నత విద్యాప్రమాణాలు అందించేందుకు మన ఊరు మన బడి పథకం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు సబితారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News