Thursday, January 23, 2025

సంపద సృష్టిస్తున్నాం… ప్రజలకు పంచుతున్నాం: కెటిఆర్‌

- Advertisement -
- Advertisement -

KTR..CREDAI

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేలు అని, ఏడేండ్ల తర్వాత అది రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న ‘క్రెడాయ్‌ ప్రాపర్టీ షో’ను మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్నది నిర్మాణరంగమేనని చెప్పారు. దేశంలో 70 శాతం మంది గ్రామాల్లో నివసిస్తున్నారని, నిర్మాణ రంగం వల్ల సంపద సృష్టి జరుగుతున్నదని తెలిపారు.

హైదరాబాద్‌ లాంటి నగరాలే దేశానికి ఆర్థిక శక్తిగా ఉన్నాయని వెల్లడించారు. నగరాల విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. దేశంలో సంపద సృష్టించే నగరాల అభివృద్ధి కోసం ఏటా రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రధాని మోడీని సీఎం కెసిఆర్‌ కోరారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్‌ అన్ని నగరాల కంటే ముందున్నదని కెటిఆర్‌ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల వారు నగరంలో స్థిరపడ్డారన్నారు. కొవిడ్‌ సమయంలో ఇతర రాష్ట్రాల రోగులు ఇక్కడ వైద్యం చేయించుకున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌ హెల్త్‌, ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ట్రీ సిటీగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని తెలిపారు. నగర అభివృద్ధిపై బిజెపి ఎంపీలే ప్రశంసలు కురిపిస్తున్నారని తెలిపారు. గతంలో ఎండాకాలం వస్తే జలమండలి ముందు ధర్నాలు జరిగేవని, ఇప్పుడు హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని వెల్లడించారు. గతంలో ఏ పండుగ వచ్చినా అల్లర్లు జరిగేవి, తెలంగాణ వచ్చిన తర్వాత కుల, మత అల్లర్లు లేవన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News