కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మళ్లీ ఎన్నికలు రాగానే ప్రజలు తగిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే, సిఎంగా కెసిఆర్ ఉంటారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్ అన్నారు. సిరిసిల్లలో శుక్రవారం పలు అభివృధ్ధి పనులను ప్రారంభించిన అనంతరం సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో స్థానిక తెలంగాణ భవన్‌లో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ..పదవీకాలం పూర్తయిన మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. బిఆర్‌ఎస్‌కు పోయింది అధికారమే కానీ ప్రజల అభిమానం కాదని, మనలోని పోరాట పటిమ దూరం కాలేదని అన్నారు. కాంగ్రెస్‌తో బిఆర్‌ఎస్‌ను ప్రజలు పోల్చుకుని చూస్తున్నారని, గత పాలనలో ప్రజలు ఒక్కరోజు కూడా కష్టాలు పడలేదన్నారు.
కాంగ్రెస్ అబద్ధసే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజలు కాంగ్రెస్‌పై తిరుగబడుతున్నారని అన్నారు. ప్రజాపాలనలో గత సంవత్సరం డిసెంబర్ నెలలో కోటి ఆరు లక్షల మంది దగ్గర దరఖాస్తులు తీసుకోగా, వాటిని బుట్టదాఖలు చేసి మళ్లీ దరఖాస్తులు కోరడంతో కేవలం జిరాక్స్ సెంటర్ల వారు మాత్రమే బాగుపడుతున్నారని వ్యాఖ్యానించారు. గ్రామసభల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీరు వల్ల ప్రజలు అధికారులపై తిరగపడుతున్నారని, దీనివల్ల అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదన్నారు. గ్రామ సభలకు కాంగ్రెస్ మంత్రులు, శాసనసభ్యులు ఎందుకు హాజరవడం లేదని నిలదీశారు. సోషల్ మీడియాపై కేసులు పెట్టడం, జైళ్లకు పంపడంపై దృష్టి తగ్గించి పాలనపై దృష్టి సారించాలని రేవంత్ సర్కార్‌కు హితవు పలికారు. ప్రభుత్వ ఏడాది పాలనలో రూ. లక్షా 40 వేల కోట్లు అప్పులు తెచ్చారన్నారు. గ్రామాల, పట్టణాల అభివృద్ధికి కొత్తగా నిధులివ్వకపోగా గతంలో బిఆర్‌ఎస్ ఇచ్చిన నిధులను నిలిపివేశారన్నారు.
కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడుప దాటడం లేదన్నారు. బిఆర్‌ఎస్ ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల గ్రామాలు పట్టణాలు వృద్ధి సాధించాయన్నారు. దేశంలో 3 శాతం కన్నా తక్కువ జనాభా ఉన్న తెలంగాణకు స్వచ్ఛతలో 30 శాతం అవార్డులు వచ్చాయన్నారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యపడిందన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో ఎప్పుడు ఆడ బిడ్డలు నీటికోసం బిందెలు, కుండలతో రోడ్డెక్కలేదన్నారు. తెలంగాణలో ప్రస్తుతం క్రైమ్ రేట్ పెరిగిందని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, గాలి మోటార్లలో తిరుగుతున్న మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. కోటి 67 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం క్రింద ఇచ్చే రూ.2500 కోసం ఎదురుచూస్తున్నారన్నారు. తులం బంగారం ఎటుపాయె అన్నారు.100 రోజుల్లో ఇచ్చిన హమీలు అమలు చేస్తామని 400 రోజులు గడిచినా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.
ఈ కార్యక్రమంలో పారర్టీ నాయకులు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, మాజీ ఎంఎల్‌ఏ సుంకె రవిశంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్లు జిందం కళచక్రపాణి, రామతీర్థపు మాధవిరాజు, కౌన్సిలర్లు ఇతరులు పాల్గొన్నారు.