Wednesday, January 22, 2025

చేతల ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

అడగకుండానే 100శాతం అభివృద్ధి పనులు చేస్తున్నాం
ఏడున్నరేళ్లలో సిఎం కెసిఆర్ చేసిన ప్రతి పని కళ్లముందున్నది
గూడులేని పేదలు ఉండరాదన్నదే ఆయన ఉద్దేశం
గతంలో అనేకమంది నాయకులు మాటలతో గడిపారు
పేదల ఇళ్ల స్థలాల్లో రూ.5లక్షలతో ఇళ్లు కట్టించేందుకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయిస్తాం
సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందజేసిన సందర్భంగా మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ఎల్లారెడ్డిపేట: తెలంగాణలో గూడులేని పేదలు ఉండరాదన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్దేశమని ఐటి, పురపాలక, పట్టణ శాఖల మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ దిశగా రాష్ట్రంలోని నిరుపేదలైన అన్నివర్గాలకు డబుల్ బెడ్‌రూంలను ఇచ్చేందుకు తగిన కార్యాచరణతో ముందు కు వెళుతున్నారన్నారు. సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో పేదలకు నిర్మించిన డబుల్ బెడ్‌రూంలను శనివారం ఆయన పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కల్లబొల్లి మాటలు కాదు.. మాది చేతల ప్రభుత్వం, అడగకుండనే వంద శాతం అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో అనేకమంది నాయకులు మాటలతో గడిపారు. ఏడున్నర ఏండ్లలో సిఎం కెసిఆర్ చేసిన ప్రతి పని మన కళ్లముందు కనబడుతుందన్నారు. విమర్శలు చేసిన వారి అడ్రస్ గల్లంతు అయ్యిందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా 40 మందికి పట్టాలను అందజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు పైసా ఖర్చులేకుండా పారదర్శకంగా డబుల్ బెడ్‌రూంలు నిర్మించి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు. వెంకటాపూర్ ఆత్మగౌరవ గృహ సముదాయానికి రూ.2కోట్ల 40లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. సొంత స్థలాలున్న పేదలకు రూ.5లక్షలతో ఇండ్లు కట్టించి ఇచ్చేందుకు వచ్చే బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించనున్నట్టు మంత్రి తెలిపారు. ఏడున్నర ఏండ్లలో వెంకటాపూర్‌కు ఎక్కడ లేనివిధంగా రూ.6కోట్లు కేటాయించి సిసి రోడ్లు, అయా కుల సంఘాల భవనాలు, ప్రగతి భవనం, జిపి కార్యాలయ నిర్మించినట్లు తెలిపారు. నామాపూర్‌వెంకటాపూర్‌కు రహదారి నిర్మాణానికి రూ.20కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో త్వరలో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన మేడి రాజు కుటుంబానికి బీమా సొమ్ము రూ. 13 లక్షల చెక్‌ను అందజేశారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న జంటలకు రెండు లక్షల చొప్పున చెక్‌లు పంపిణీ చేశారు. అంతకు ముందు పోతిరెడ్డిపల్లిలో రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన జిపి కార్యాలయం, పాఠశాల భవనం సర్పంచ్ కనకట్ల బాలయ్యతో కలసి ప్రారంభించారు. వెంకటాపూర్‌లో రైతు వేదిక ప్రగతి భవనాన్ని కెటిఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జాతీయ సహకార సంఘాల అధ్యక్షుడు కొండూరి రవీందర్ రావు, జడ్పి చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల పురపాలక సంస్థ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, సర్పంచ్ కోల అంజవ్వ నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకనూరి శంకరయ్య, రైతుబంధు అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, వివిధ శాఖల అధికారులు, జడ్పిటిసి చీటి లక్ష్మన్ రావు, ఎంపిపి పిల్లి రేణుక కిషన్, ఎఎంసి చైర్మన్ కొండ రమేశ్ గౌడ్, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండాడి క్రిష్ణా రెడ్డి, నాయకులు అందె సుబాస్, గుల్లపల్లి నర్సింహరెడ్డి, అయా గ్రామాల సర్పంచ్‌లు ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

KTR Inaugurates Double bedroom houses in Ellareddypeta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News