Sunday, November 24, 2024

అభివృద్ధి వేళ రాజకీయాలొద్దు

- Advertisement -
- Advertisement -

హుందాగ రాజకీయం చేద్దాం
కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నాయి
రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మేలు
రాష్ట్ర అభివృద్ధికి మేం చేస్తున్న కృషికి బిజెపి సంపూర్ణంగా సహకరించాలి
జిహెచ్‌ఎంసి పరిధిలో రూ.28.38కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ మంత్రి కెటిఆర్

KTR Inaugurates Double Bedrooms in Bhag Lingampally

మన తెలంగాణ/హైదరాబాద్/సిటీ బ్యూరో: ఎన్నికలప్పుడు కొట్టుకుందాం… తిట్టుకుందాం…విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకుందాం. విజయం కోసం చివరి వరకు పోరాడుదాం. ఎవరి వాదనాలు వారు గట్టిగా ప్రజలకు చెప్పుకుందాం. కానీ ఇదంతా ఎన్నికల ముగిసేంత వరకే. ఆ తరువాత బిజెపి, టిఆర్‌ఎస్ కలిసి పనిచేద్దాం. ప్రజల కోసం, అభివృద్ధి కోసం కలిసి పాటు పడదాం… హుందాగా రాజకీయాలు చేద్దామని బిజెపికి రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సూచించారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది… రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలో ఉంది… ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మంచిది. రాష్ట్ర ప్రగతికి దోహదపడుతుందన్నారు. ప్రతి విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించిడం తప్పు అన్నారు. అందుకే తాను బహిరంగ వేదికపై నుంచి విజ్ఞప్తి చేస్తున్నా…. రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి బిజెపికి సంపూర్ణంగా సహకరించాలని కోరారు. శనివారం జిహెచ్‌ఎంసి పరిధిలో సుమారు రూ.28.38 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్ ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ముందుగా రూ.10.90 కోట్ల వ్యయంతో బాగ్ లింగంపల్లి లంబాడి తండాలో నిర్మించిన 126 డబుల్ బెడ్ రూం ఇళ్లను, రూ.3.50 కోట్ల వ్యయంతో అడిక్ మెట్ లో నిర్మించిన మల్టీపర్పస్ స్పోరట్స్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంభించారు. వీటితో పాటు రూ. 9.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జోనల్, డిప్యూటి కమిషనర్కార్యాలయాలకు శంకుస్థాపన, నారాయణగూడ క్రాస్ రోడ్స్ లో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా లంబాడి తండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మాట్లాడుతూ, పండుగ వాతావరణంలో ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్ రూంలను ఆడబిడ్డలకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో రూ. 18 ,000 కోట్ల వ్యయంతో 2,72,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లోనూ రూ. 9,714 వ్యయంతో ప్రారంభించిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ళుదాదాపు పూర్తి కావొచ్చాయని తెలిపారు. ఒక్కొక్కటి సుమారు తొమ్మిది లక్షల రూపాయల వ్యయం తో నిర్మించిన ఈ ఇళ్ళు లబ్దిదారులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామన్నారు.
అత్యంత విలువైన ఇళ్ళు ఇవాళ ప్రజల చేతికి అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ ఇళ్లు 40నుంచి 50 లక్షల విలువ మార్కెట్ లో ఉంటుందన్నారు. అటువంటి డబుల్ బెడ్ రూమ్ లు లబ్దిదారులకు ఇస్తున్నామని తెలిపారు.
ఇళ్లు అమ్ముకుంటే పట్టాలు రద్దు
పేదలందరూ ఆత్మగౌరవంతో బతుకాలన్నదే టిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షమని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అందులో భాగంగానే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం నిర్మించి ఇస్తున్నామన్నారు. అలాంటి ఈ ఇళ్లను ఎవరూ అమ్మినా వారి పట్టాలను రద్దు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ హెచ్చరించారు. తమకు కేటాయించిన ఇళ్లను అమ్ముకోవడం గానీ, ఇతరులకు అద్దెకు ఇవ్వడం గాని లబ్ధిదారులు చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఇళ్లు అంటేనే ఆత్మాగౌరవానికి నిదర్శనమని, తమ ఇళ్లను ఎలానైతే శుభ్రంగా ఉంచుకుంటారో తమ పరిసరాలు, బస్తీలను కూడా అదేవిధంగా పశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌ను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా నగరంలో 40 ప్రాంతాల్లో ఇన్సిటూ ప్రాతిపదికన 8898 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటికే సింగం చెరువు తండా, చిత్తారమ్మ బస్తీ, కిడ్‌కీ బాత్ అలీషా, సయ్యద్ సాబ్‌కా బాడా, ఎరుకల నాంచారమ్మ బస్తీ, జియాగూడా, కట్టెల మండి, గోడే కి ఖబర్, వనస్థలిపురంలోని రైతు బజార్ వద్ద డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించుకోవడంతో పాటు లబ్దిదారులకు అందజేశామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నగారాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తుందని తెలిపారు. అనంతరం మంత్రి కెటిఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ముషీరాబాద్ శాసనసభ్యుడు ముఠాగోపాల్, మేయర్ బొంతు రామ్మోహన్ లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాలను అందజేశారు.
స్వల్ప ఉద్రికత్త
డబుల్ బెడ్ రూం ప్రారంభోత్సవం సందర్భంగా బిజెపి నేతలు నిరసనకు దిగడంతో కాసేపు స్వల్ప ఉద్రికత్త చోటు చేసుకుంది. దీంతో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎవరి వాదనాలు వారు వినిపించామని, ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అవసర రాజకీయాలు చేయడం తగదన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ది తప్ప మరో ఏజెండా ఉండాల్సిన అవసరం లేదన్న కెటిఆర్ అందరం కలిసి మెలిసి ప్రజాసంక్షేమం కోసం కృషి చేద్దామన్నారు. రాజకీయాల్లో పోటీ తత్వం ఉండాలి తప్ప అవసరంలేని రాజకీయాలు చేస్తే ప్రజలేవరూ కూడాహర్షించరని హితువు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేద్దామని ఆయన పేర్కొన్నారు.

KTR Inaugurates Double Bedrooms in Bhag Lingampally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News