Saturday, November 16, 2024

పెట్టుబడుల అయస్కాంతం

- Advertisement -
- Advertisement -

దేశవిదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రస్థానంలో తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన పారిశ్రామిక విధానాల వల్లనే పెట్టుబడులు విశేషంగా తరలివస్తున్నాయి 
సౌరవిద్యుత్ ఉత్పాదనలో రెండవ స్థానం అలంకరించిన తెలంగాణ 
గత ఏడేళ్లలోనే 15వేలకు పైగా వివిధ పరిశ్రమలు వచ్చాయి
వీటిలో ప్రపంచశ్రేణి సంస్థలు కూడా అనేకం ఉన్నాయి 
ఈ కంపెనీల నుంచి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు రూ.2లక్షల20కోట్లు పైచిలుకే
వీటిలో 80%పైగా ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించాయి
హైదరాబాద్ నగర శివారులోని మహేశ్వరం ఇ సిటీలో సోలార్ పరికరాల కంపెనీ కొత్త ప్లాంటును ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్శించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాలే ప్రధాన కారణమన్నారు. సౌర విద్యుత్ ఉత్పాదనలో రెండవ స్థానంలో కొనసాగుతున్న తెలంగాణ గడిచిన ఏడేళ్లలోనే రాష్ట్రానికి 15వేలకు పైగా పలు రకాల పరిశ్రమలు వచ్చాయన్నారు. ఇందులో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న పలు సంస్థలు కూడా ఉండడం విశేషమన్నారు. ఈ కంపెనీల నుంచి మొత్తంగా రూ.2 లక్షల 20 వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులను రాష్ట్రం సాధించుకుందన్నారు. ఇందులో 80 శాతానికి పైగా పరిశ్రమలు ఇప్పటికే తమ కార్యకలాపాలను సైతం ప్రారంభించాయని వివరించారు.
గురువారం హైదరాబాద్‌లోని మహేశ్వరంలో ప్రముఖ సోలార్ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నూతనంగా ఏర్పాటు చేసిన నూతన ప్లాంట్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోలార్, విండ్ వంటి ఇంధనవనరుల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో రూ. 483 కోట్ల పెట్టుబడితో సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన కంపెనీ యజమాన్యానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్లాంట్‌లో 750 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ సెల్, మరో 750 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ మాడ్యూళ్ల తయారీని కంపెనీ చేపట్టనుండడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ 18 నెలల రికార్డు సమయంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్, మాడ్యుల్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయటం ప్రశంసనీయమన్నారు. ఈ ప్లాంట్ ద్వారా 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇందులో 80 శాతం ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించిందన్నారు. మరో రెండేళ్లలో పెట్టుబడులను రూ. 1200 కోట్లకు పెంచి 4 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్ తయారుచేసేలా తెలంగాణలో విస్తరిస్తామని కంపెనీ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. సోలార్ సెల్స్, మాడ్యుల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్న ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ యజమాన్యానికి మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా రాష్ట్రానికి భారీగా తరలివస్తున్న పరిశ్రమల వల్ల యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించనున్నామన్నారు. అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీల నియామకం త్వరలోనే చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా శరవేగంగా జరుగుతోందన్నారు.

2023 నాటికి రూ. 1200 కోట్ల పెట్టుబడి
2023 లోపు రూ. 1200 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ కెపాసిటీని 4 గిగా వాట్ల సామర్థ్యానికి పెంచేందుకు కంపెనీ రూపొందించిన ప్రణాళికల పట్ల మంత్రి కెటిఆర్ అభినందించారు. దీని వల్ల 2వేల అదనపు ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్న సదరు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం సంపూర్ణంగా అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. మహేశ్వరంలో నైపుణ్య శిక్షణ సంస్థను ప్రారంభించాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థన మేరకు ఆగస్టు 5న నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కెటిఆర్ తెలిపారు. రావిర్యాల, మహేశ్వరం, తుక్కుగూడ ప్రాంత ప్రజలకు నైపుణ్యంతో కూడిని వృత్తి విద్యా శిక్షణ ఇస్తామన్నారు. దీంతో స్థానికుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి మెరుగైన ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తామన్నారు.

KTR Inaugurates Solar company premier new plant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News