హైదరాబాద్: ఇందిరాపార్క్-విఎస్‌టి స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. శనివారం ఉదయం ఇందిరాపార్కు వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్ముద్ అలీ, ఎంపి కెకెలతో కలిసి మంత్రి కెటిఆర్ స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్‌ను ప్రారంభించారు. స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఇందరా పార్కు నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్డు వరకు వాహనాదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్‌కు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. దేశంలోనే మెట్రో బ్రిడ్జ్ పై నుంచి నిర్మించిన తొలి స్టీల్ బ్రిడ్జ్ గా ఇది నిలువనుంది.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేకత
మిగితా ఫ్లై ఓవర్‌ల కంటే భిన్నంగా మొత్తం స్టీల్ తో ఫ్లై ఓవర్‌ను పూర్తి చేశారు. మొట్ట మొదటి సారిగా మెట్రో బ్రిడ్జి పై నుండి ఫ్లై ఓవర్ చేపట్టడం జరిగింది. ఫ్లై ఓవర్ స్టీల్ బ్రిడ్జి సివిల్ వర్క్, యుటిలిటీ లిఫ్టింగ్, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ. 450 కోట్ల వెచ్చించారు. ఇందిరా పార్కు నుండి వి. ఎస్.టి స్టీల్ బ్రిడ్జి ప్లై ఓవర్ పొడవు 2.62 కిలోమీటర్లు కాగా, ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 2.436 కిలో మీటర్లు కాగా ఆఫ్ ర్యాంపు 0.106 కిమీ, 0.150 కిమీ, డౌన్ ర్యాంపు 0.078 కి.మీ. అదేవిధంగా రైట్ వే 22.20 మీటర్ల నుండి 36.60 మీటర్ల కాగా, ఎలివేటెడ్ కారిడార్ కుడి వైపు మార్గం 4 లైన్ల బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్(16.60 మీటర్లు).
ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) అందుబాటులో రావడంతో ఇందిరాపార్క్ జంక్షన్ మొ దలు అశోక్ నగర్, అర్‌టిసి క్రాస్ రోడ్ మీదగా సిగ్నల్ రహిత బాగ్ లింగంపల్లి విఎస్‌టి జంక్షన్ వరకు పూర్తిగా సిగ్నల్ రహిత ప్రయాణంఅందుబాటులోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం బాగా తగ్గనుంది.