Friday, November 22, 2024

సిరిసిల్ల, వేములవాడలకు వరద నిరోధక ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

నాలాలపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి చెడిపోయిన రోడ్ల కోసం రూ.కోటి 35 లక్షలు, బైపాస్‌రోడ్డులో రూ.38 కోట్లతో
డ్రైన్స్ ఏర్పాటు: సిరిసిల్ల వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి ప్రకటించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/సిరిసిల్ల: నాలాలపై అక్రమ ఇండ్ల నిర్మాణాలు వెంటనే తొలగించాలని, వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని మంత్రి కెటిఆర్ అధికారులకు సూచించారు. సిరిసిల్ల పట్టణంలో మంగళవారం నాటి వరదలకు గల కారణాలపై, వరదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. సిరిసిల్ల పట్టణంలో వరదలకు గురైన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. బురద నీటిలో నడుస్తూ బాధితులను పరామర్శించారు. వారి కష్టాలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సిరిసిల్లలో డ్రైన్స్ సరిగా లేకపోవడంవల్లనే మంగళవారం ప్రజలు వరద సమస్యను ఎదుర్కోవలసి వచ్చిందని, అందువల్ల ప్రజలు ఇబ్బంధులు పడ్డారని కలెక్టర్ అనురాగ్ జయంతితో పాటుగా అధికారులు మంత్రి కెటిఆర్‌కు వివరించారు.సిరిసిల్లలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో వర్షపునీరు నిలువకుండా నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించాలని మంత్రి కెటిఆర్ సూచించారు. వరద నీటి సమస్య పునరావృతం కాకుండా చూడాలన్నారు. వరద నష్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల కొత్త చెరువు, బోనాల చెరువుల నుండి వచ్చే నీటిని మళ్లించేందుకు డ్రైన్స్ నిర్మాణానికి పథకాలు రూపొందించాలని సూచించారు. కొత్త చెరువు నీరు మానేరు నదిలో కలిసేలా డ్రైన్ నిర్మించాలన్నారు. శాంతినగర్ వరద సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు.ప్రజలను శాశ్వతంగా వరద సమస్యనుండి తప్పించాలన్నారు. పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి, మున్సిపల్ అధికారులు తమ ఆలోచన విధానాలను మార్చుకుని భవిష్యత్తులో వరదలు రాకుండా తగిన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. వాగులు, చెరువుల నుండి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.వర్షాకాలంలో వచ్చే కష్టనష్టాల గురించి ఆయా శాఖల అధికారులతో మంత్రి కెటిఆర్ చర్చించారు. వర్షాల వల్ల వచ్చే నీటిని మూలవాగు, మానేరు వాగు, చెరువుల నుండి వృధాగా పోకుండా డ్రైన్స్ ద్వారా మానేరు వాగులో కలిసే విధంగా నీటి పారుదలశాఖ అధికారులు అధ్యయనం చేయాలన్నారు. వచ్చే సంవత్సరం వరదలు రావనే భరోసా పెట్టుకోకుండా ముందస్తు ప్రణాళికలతోతగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాలాలపై కొత్త ఇండ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదన్నారు. వరదనీరు వెళ్లడానికి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రధ్ధ చూపాలన్నారు. వారం రోజుల్లో పంట నష్టానికి సంబంధించిన నివేదికలు సమర్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. దొడ్డు బియ్యం పంటలు వేయకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.పంట నష్టం నివేదిక రాగానే వారం రోజుల్లో నష్ట పరిహరం అందించి రైతులకు కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలన్నారు. రైతులకు కందుల వంటి ఉద్యానవన పంటలపై అవగాహన పెంచాలన్నారు.జిల్లాలోని 666 చెరువుల సమస్యలన్నీ వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు.

మంగళవారం నాటి వరదల్లో ఇండ్లు కోల్పోయిన వారికి, చనిపోయిన వ్యక్తికి వెంటనే నష్ట పరిహరం అందించాలన్నారు. ప్రమాదకరమైన డ్రైన్స్ ఉంటే వాటి చుట్టూ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వరదల వల్ల పడిపోయిన విద్యుత్ స్థంభాలు కొత్తవి వేసి, వైర్లు పునరుద్దరించాలని, సిరిసిల్ల సహ 8 మండలాల్లో చెడిపోయిన రోడ్ల కోసం కోటి 35 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నానని వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.సిరిసిల్ల బైపాస్‌రోడ్డులో 38 కోట్ల రూపాయలతో డ్రైన్స్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. ఎంతో శ్రమతో నాటిన మల్టిలెవల్ ప్లాంటేషన్‌ను రక్షించుకోవాలన్నారు. గ్రామాలలో ప్రజలను సీజనల్ వ్యాధుల పట్ల చైతన్యపరుస్తూ నిలువ నీటిని తొలగించాలని, నీరు వేడి చేసి త్రాగాలని సూచించాలన్నారు. లేదంటే ప్రమాదకరమైన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. బ్లడ్ బ్యాంకులలో రక్తం నిలువలు ఉండేలా చూసుకోవాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో జిల్లాకు మొదటి స్థానం వచ్చేలా వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. మండెపల్లి పిహెచ్‌సి కంపౌండ్ వాల్ నాసీరకంగా నిర్మించడం వల్ల కూలిపోయిందని కంట్రాక్టర్‌కు నోటీసులిచ్చి మల్లీ కట్టించాలన్నారు. వేములవాడ మూలవాగుపై నిర్మిస్తున్న రెండో వంతెన సెంట్రింగ్ కూలిపోయిందని అయితే శివరాత్రి నాటికి వంతెన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. వరదలు, ప్రకృతి ప్రకోపాలవల్ల ప్రాణనష్టం సంభవించకుండా అధికారులు చూడాలన్నారు. కోవిడ్ సందర్భంగా పెట్టుకున్న సిబ్బంధికి కోటి రూపాయలు మంజూరు చేశామని వాటిని వెంటనే వారికి అందించాలన్నారు.ఈ సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి జడ్‌పి చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, ఎస్‌పి రాహుల్‌హెగ్డెతో పాటుగా వ్యవసాయ, మున్సిపల్, నీటిపారుదల శాఖల అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

KTR Inspection Floods Effected in Circilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News