Tuesday, January 21, 2025

ఆకాశవీధులకు కేంద్రం మోకాలడ్డు

- Advertisement -
- Advertisement -

KTR laid foundation stone for Bachupally ORR road widening flyover

స్కైవేల నిర్మాణానికి రక్షణశాఖ భూములు అప్పగించాలని 20సార్లు కోరినా స్పందించడం లేదు : మంత్రి కెటిఆర్ ఫైర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మన తెలంగాణ/సిటీ బ్యూరో : హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు కావాలని అడిగినా కేంద్రం స్పందించడం లేదని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోప్యాకేజి3లో భాగంగా రూ.248.44 కోట్ల వ్యయంతో చేపడుతోన్న ఐదు సినరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణానికి, బాచుపల్లి ఒఆర్‌ఆర్ రోడ్డు విస్తరణ ప్లైఓవర్‌కు మంత్రి కెటిఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.5వేల కోట్లతో నిర్మాణం చేపట్టే రెండు స్కైవేల కోసం ఏడున్నరేళ్లుగా కేంద్రాన్ని 20 సార్లు అడిగినా ఏమాత్రం స్పందించలేదన్నారు. భూములకు భూమి, లేదా డబ్బులిస్తామన్నా ఏ విషయం తేల్చడం లేదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధికి పైసా సాయం చేయలేదన్నారు.

నగరంలో రోజూ ఉత్పత్తి అవుతోన్న 2వేల మిలియన్ మురుగునీటిని శుద్ధి చేసాకే నాలాలు, చెరువులోకి వదలాలనే ఆలోచనలతో కొత్త ఎస్టిపిల నిర్మాణాలను చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా 66 ఎంఎల్‌డిల సామర్థ్యంతో ఫ్యాక్స్‌సాగర్, వెన్నెలగడ్డ, గాయత్రినగర్, పరికి చెరువు, శివాలయనగర్ ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పర్యావరణంపైన ఉండే ప్రేమ, హైదరాబాద్‌పైన ఉన్న శ్రద్ధతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. మురుగు నీటిని వంద శాతం శుద్ది చేసేందుకు కొత్తగా 31 ఎస్టిపిల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్‌లో ఐదు ఎస్టీపీలకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వెల్లడించారు.

నగరం చుట్టూ ఉన్న శివారు ప్రాంతాలు శరవేగంగా ఎదుగుతున్నామని, జనాభా పెరుగుతున్నందున మౌళిక వసతులను పెంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇందులో భాగంగా గత టర్మ్‌లో రూ.2 వేల కోట్లతో జిహెచ్‌ఎంసిలో విలీనమైన శివారు ప్రాంతాల్లో, సుమారు రూ.800 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పలు గ్రామాలు, మున్సిపాలిటీలకు తాగునీటి వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఔటర్‌రింగ్ రోడ్డు లోపల ఉన్న దాదాపు వెయ్యి గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు కూడా నీటిని అందించేందుకు రూ.1200 కోట్లతో తాగు నీటి వ్యవస్థ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఇందుకోసమే ఇప్పటి వరకు రూ.2800 కోట్లు ఖర్చు చేయగా, తాజాగా.. రూ.1200 కోట్లను ఖర్చు చేయడంతో పాటు కృష్ణా నది నుంచి నగరానికి నీటిని తరలించేందుకు సుంకిశాల వద్ద రూ.1400 కోట్లతో మరొక పైప్‌లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి కెటిఆర్ తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి కూడా గోదావరి నీళ్లను నగర తాగు నీటి అవసరాల కోసం తరలించి గండిపేటను నింపడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. రానున్న 30 ఏళ్ల హైదరాబాద్ జనం అవసరాల గురించి ఆలోచిస్తున్నామన్నారు. ప్రస్తుతం నగరానికి 600 ఎంజిడిల నీటిని అందించే స్థాయికి చేరుకున్నామని, 2051 నాటికి 1000 ఎంజిడిల నీటి అవసరం పడుతుందని అంచనా వేస్తున్నామని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, శంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద, డిప్యూటీ మేయర్ శ్రీలత, జలమండలి ఎండి దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.

31 కొత్త ఎస్టీపిల వివరాలు
నగరంతోపాటు శివారు మున్సిపాలిటీ ప్రాంతాల్లో సివరేజీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించాలని జలమండలి తలపెట్టింది. గ్రేటర్ పరిధిలో మొత్తం మూడు ప్యాకేజీల కింద నిత్యం 1257.50 ఎమ్మెల్డిల మురుగునీరు శుద్ది చేయాలనే లక్షంతో వీటిని నిర్మిస్తుంది.

మూడు ప్యాకేజిలో నిర్మాణం
ప్యాకేజి1లో అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీలు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 402.50 ఎమ్మెల్డిల మురుగు నీటిని శుద్ది చేస్తారు. ప్యాకేజి 2లో రాజేంద్రనగర్, ఎల్బీనగర్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1355.33 కోట్లతో ఏర్పాటు చేయనుండగా ఇక్కడ 480.50 ఎమ్మెల్డిల మురుగునీటిని శుద్ధి చేస్తారు. ప్యాకేజి౩లో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపిలను ఏర్పాటు చేసి, అక్కడ 376.5 ఎమ్మెల్డి మురుగునీటిని శుద్ధి చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News