Friday, November 22, 2024

రయ్.. రయ్.. రయ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్) కార్ రేసింగ్ పోటీలకు శనివారం తెరలేచింది. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహిస్తున్న రేసింగ్ పోటీలు అభిమానులను కనువిందు చేశాయి. శనివారం స్ట్రీట్ సర్కూట్‌పై స్పోర్ట్ కార్లు సందడి చేశాయి. సాగర తీరంలో కార్లు రయ్..రయ్ మంటూ పరుగులు తీశాయి. శనివారం తొలి రోజు ట్రయల్ రన్‌తో పాటు క్వాలిఫయింగ్1, క్వాలిఫయింగ్ 2 పోటీలు నిర్వహించారు.

అనంతరం రేస్ 1 పోటీలు జరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరుగనున్న ఫార్ములా ఈకార్ రేస్ పోటీలకు సన్నాహకంగా హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. శనివారం పెట్రోల్ కార్లతోనే రేస్‌ను నిర్వహించారు. ఈ పోటీల్లో 12 కార్లు, ఆరు బృందాలు, నలుగురు డ్రైవర్లతో పాటు మహిళా రేసర్లు కూడా పాల్గొన్నారు. లీగ్‌లో 50 శాతం స్వదేశీ రేసర్లు, మిగిలిన 50 శాతం విదేశీ రేసర్లు పోటీ పడతారు.

ఇక పెట్రోల్ కార్లు 240 కి.మీ వేగంతో దూసుకెళ్లాయి. ఎలక్ట్రిక్ కార్ల గరిష్ఠ వేగాన్ని 320 కి.మీ.గా నిర్దేశించారు. శనివారం జరిగిన పోటీలను తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చాయి. ప్రేక్షకుల కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 7500 టికెట్లు అమ్ముడు పోయాయి. అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇక రేస్‌లో పాల్గొంటున్న డ్రైవర్ల కోసం కూడా పలు జాగ్రత్తలు తీసుకున్నాయి. రేసింగ్‌లో మొత్తం 18 మూలమలుపులు ఉండగా ప్రతి మూలమలుపు వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రథమ చికిత్స అందించడానికి, ఆసుపత్రికి తరలించడానికి ప్రత్యేకంగా అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. కాగా ఈ లీగ్‌లో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, గోవా, చెన్నై, కొచ్చిలకు చెందిన టీమ్‌లు పోటీ పడుతున్నాయి. కాగా, ఇండియన్ రేసింగ్ పోటీలను పురస్కరించుకుని నెక్లెస్ రోడ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. సోమవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

KTR Launches Indian Racing League in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News