Monday, January 20, 2025

పెట్టుబడిదారులే బ్రాండ్ అంబాసిడర్లు

- Advertisement -
- Advertisement -

KTR Launches Safran Aircraft Engine MRO Facility

పెట్టుబడిదారులే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు
వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం
పరిశ్రమలకు కావాల్సిన సంపూర్ణ సహకారాలు అందిస్తాం
శంషాబాగ్ విమానాశ్రయంలో సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ఎంఆర్‌ఒ పెసిలిటీని ప్రారంభించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. వారి ప్రొత్సాహంతోనే తెలంగాణకు దేశ, విదేశాల్లో మంచి గుర్తింపు లభిస్తోందన్నారు. అనేక కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. అందువల్ల వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పరిశ్రమలకు కావాల్సిన సంపూర్ణ సహకారాలను అందిస్తామన్నారు. ఇందులో భాగంగానే టిఎస్…ఐపాస్ వంటి అనువైన పాలసీని అమలు చేస్తున్నామన్నారు.
గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్‌ఒ (మెయింటేనెన్స్, రిపేర్స్, ఒవర్‌హాల్) ఫెసిలిటీని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెసిలిటీ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సాఫ్రాన్ సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. దీనికి జాతీయంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమ వర్గాలతో కలిసి ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందన్నారు.
కాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్‌ఒ… 2025లోగా పూర్తయితే ప్రపంచలోనే అతిపెద్దదిగా నిలుస్తుందని కెటిఆర్ తెలిపారు. ఇది ప్రపంచస్థాయిలోనే దేశంలో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ కానుందన్నారు. దాదాపు రూ.1200 కోట్లు పెట్టుబడి అని అన్నారు. ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం ద్వారా 800 నుంచి 1000 వరకు ఉపాధి లభిస్తుందన్నారు. త్వరలోనే దేశంలోనే హైదరాబాద్ ఉత్తమ ఏరోస్పేస్ వ్యాలీగా మారనుందని కెటిఆర్ వెల్లడించారు. సాఫ్రాన్ సంస్థ పెట్టుబడులను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు నాలుగేళ్లు నిరంతరం శ్రమించిననట్లు తెలిపారు. దీని కోసం హైదరాబాద్, ఢిల్లీ, ప్యారిస్‌లో35 సమావేశాలు నిర్వహించామన్నారు. అలాగే, 400కు పైగా మెయిల్స్ పంపామన్నారు. దీని కారణంగానే సాఫ్రాన్ సంస్థ పెట్టుబడులు సాధ్యమయ్యాయని ఆయన వివరించారు.
హైదరాబాద్‌లో ఎంఆర్‌ఒ ఏర్పాటు చేసి పెట్టుబడిదారులకు సాఫ్రాన్ సంస్థ మరింత నమ్మకం కలిగించిందని కెటిఆర్ పేర్కొన్నారు.. దక్షిణాసియాలోని చాలా విమానరంగ సంస్థలు ఈ సౌకర్యాలను ఉపయోగించుకునే అవకాశముందన్నారు. ప్రదానంగా ఏరోస్పేస్ రంగంలో ఈ పెట్టుబడులు చాలా మార్పులు తెస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఇతర విమాన, రక్షణ రంగ సంస్థల పెట్టుబడులు రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడుతాయన్నారు.

పెట్టుబడిదారులు సంతోషంగా ఉంటనే..
పెట్టుబడిదారులు సంతోషంగా ఉంటనే వారు తమ వ్యాపారాలను మరింతగా విస్తరిస్తాని కెటిఆర్ తెలిపారు. వారు పెట్టుబడి రూపంలో పెట్టే ప్రతి రూపాయికి రాష్ట్ర ప్రభుత్వం రక్షణగా నిలుస్తోందన్నారు. అలాగే శాంతిభద్రలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఫలితంగా వారు ఎంతో ఇష్టంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే హైదరాబాద్ నగరం
ప్రపంచంలోని ప్రత్యేకమైన టెక్నాలజీ హబ్‌గా మారుతోందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని.. దీని కారణంగానే కేవలం ఎనిమిది సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయన్నారు. అనేక అంతర్జాస్థాయి సంస్థలో రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యాపార అవకాశాలను వేలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ప్రపంచం నలుమూలలా చాటుతున్నాయన్నారు. ఆవిష్కరణల కోసం టి.. హబ్ వంటి ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు..

కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
కేంద్ర పౌరవిమానయాన శాఖ నుంచి హైదరాబాద్ నిరంతరం అవార్డులు పొందుతున్నాయని కెటిఆర్ అన్నారు. ప్రదానంగా జిఎంఆర్ చేపట్టిన టెర్మినల్ విస్తరణ డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తవుతుందన్నారు. పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్‌కు అనుగుణంగా మరిన్ని టెర్మినల్స్ కూడా అవసరం అవుతాయన్నారు. కాగాహైదరాబాద్ నుంచి యూరప్, యూఎస్‌కు మరిన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ నడుపుతామన్న హమీ నెరవేర్చాలని కేంద్ర పౌరవిమానయాన శాఖను ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

KTR Launches Safran Aircraft Engine MRO Facility

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News