ఎల్‌బినగర్ సర్కిల్‌లో ప్రారంభించిన మంత్రి కెటిఆర్
రూ. 9.42 కోట్లతో 5మిలియన్ లీటర్ల సామర్థంతో నిర్మాణం
15వేల నల్లాకనెక్షన్ల ద్వారా 88వేల మందికి తాగునీరు
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో తాగునీరు సరఫరాను మరింత విస్తరించే క్రమంలో రూ. 9.42 కోట్లతో ఎల్బీనగర్ సర్కిల్ నూతనంగా నిర్మించిన జంట రిజర్వాయర్లను శనివారం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. 5.0 మిలియన్ లీటర్లు సామర్థం కలిగిన ఈ రిజర్వాయర్ల ఎత్తు 22మీటర్లు, ఈ జంట రిజర్వాయర్ల నిర్మాణంతో వాసవినగర్ జోన్ నుండి శాశ్వతంగా విముక్తి లభించింది. ఈ జంట రిజర్వాయర్లతో వాసవినగర్ జోన్, ఎల్బీనగర్ సర్కిల్‌లో దాదాపు 15900 నల్లా కనెక్షన్ల ద్వారా 88 వేలకుపైగా ప్రజలు లబ్ధి పొందుతారు. ఈ ప్రాజెక్టు వల్ల నీటి నిల్వ సామర్థం పెరగడమే కాక దీర్ఘకాల, స్థ్దిరమైన మంచినీటి సరఫరా ఉంటుంది.
జలమండలి రిజర్వాయర్ల నిర్మాణంలో షీర్‌వాల్ షాప్ట్ అనే పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. భారీ రిజర్వాయర్ల నిర్మాణంలో ఈ పరిజ్ఞానం ఇదే మొదటిసారి వాడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ జంట రిజర్వాయర్లతో మారుతినగర్, ఫణిగిరికాలనీ, రామలింగేశ్వర కాలనీ, వినాయకనగర్, సత్యనగర్, రత్నానగర్, అల్కపురి, మెహన్‌నగర్, సౌభాగ్యపురం, విజయపురి కాలనీ, న్యూ నాగోల్, ఎస్బీబికాలనీ, లక్ష్మీనగర్, వాసవికాలనీ, స్నేహపురికాలనీ, మార్గదర్శి కాలనీ, హరిపురి కాలనీ, యాదవనగర్ వంటి ప్రాంతాల ప్రజలకు మంచినీటి సమస్యలు ఉండదన్నారు. అనంతరం కెటిఆర్ మొక్క నాటి నీళ్లుపోశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మో హన్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసీఉద్దీన్, జలమండి ఈడీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.