హైదరాబాద్: నగరంలోని నాలాలకు ఆనుకొని ఉన్న బస్తీలకు వరద ముంపు సమస్య నుండి శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం స్ట్రాటెజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టింది. ఇందులో భాగంగా నల్లకుంటలో వరద ముంపు నుంచి రక్షణగా నాలా ప్రహరీ గోడ(సేఫ్టీ వాల్) నిర్మాణ పనులకు గురువారం ఉదయం మంత్రులు కల్వకుంట్ల తారకరామరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. గతేడాది భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా పొంగడంతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారన్నారు. 12 కిలోమీటర్లు ఉండే ఈ నాలాకు రక్షణ గోడ నిర్మించాలని ప్రజలు కోరారు. ఈ నాలా పొంగి ఇళ్లలోకి నీరు రాకుండా ఉండాలంటే రక్షణ గోడ ఒక్కటే పరిష్కారమన్నారు. నగరంలో నాలాల శాశ్వత పరిష్కారం కోసం సిఎం కెసిఆర్‌ను కలిసి చర్చించామని, ఇందులో భాగంగానే సిఎం కెసిఆర్ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం రూపొందించారని కెటిఆర్ తెలిపారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ కింద అన్ని జోన్లలో నాలాల విస్తరణ చేపడుతామని అన్నారు. ఇందుకు మొదటి దశ కింద రూ.858 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టామని తెలిపారు. జీహెచ్ఎంసితోపాటు మున్సిపాలిటీల్లో కూడా పనులు చేపడతామని మంత్రి చెప్పారు. వచ్చే జూన్ నాటికి రక్షణ గోడను పూర్తి చేస్తామన్నారు. నానాల విస్తరణకు అందరు సహకరించాలని, నానాలపై ఉంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పనులు చేపడుతామాన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
KTR laying foundation stone to SNDP
- Advertisement -