Thursday, December 26, 2024

ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు

- Advertisement -
- Advertisement -

అమెరికా పర్యటనకు మంత్రి కెటిఆర్
పలు దిగ్గజ కంపెనీలతో కూడా సమావేశం కానున్న మంత్రి
కెటిఆర్ పర్యటనలో పలు కంపెనీలు
తమ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం
ప్రపంచానికి తెలంగాణ నీటి విజయాల పాఠాలు
అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నవరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్
కాంగ్రెస్ సదస్సులో ప్రసంగించనున్న కెటిఆర్
తెలంగాణ సాగునీటి రంగ విజయాలను, మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి తెలియజేసేందుకు
తమ సదస్సుకు హాజరు కావాలన్న సంస్థ విజ్ఞప్తి మేరకు కెటిఆర్ పర్యటన
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం,
వాటి ఫలితాలపైన ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి
ఈనెల మూడవ వారం వరకు కొనసాగనున్న కెటిఆర్ అమెరికా పర్యటన
కెమనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వేదిక పైన తెలంగాణ సాధించిన జలవిజయాన్ని చాటేందుకు మంత్రి కె.తారక రామారావు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మార్గదర్శనంలో నిర్మాణమైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం, ఇంటింటికి సురక్షిత మంచినీరు అందిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ఫలితాలను అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని హెండర్సన్ నగరంలో జరుగుతున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసేందుకు సంస్థ ఆహ్వానం మేరకు మంత్రి కెటిఆర్ అమెరికా వెళ్లారు. సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రణాళికల గురించి 2017లో అమెరికా శాక్రమెంటో వేదికగా జరిగిన ఎఎస్‌సిఇ సదస్సులో మంత్రి కెటిఆర్ వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భారీ సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలు, అందరికీ సురక్షిత తాగునీరు అందించే మిషన్ భగీరథ లాంటి బృహత్ పథకాల గురించి ఆ రోజు కెటిఆర్ వివరించినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎఎస్‌సిఇ, ఆ తర్వాత 2022లో తెలంగాణలో పర్యటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రత్యేకంగా సందర్శించిన ఆ సంస్థ ప్రతినిధుల బృందం, తెలంగాణ సాగునీటి రంగం లో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ గేమ్ ఛేంజర్ అని ప్రశంసలు అందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును స్వల్ప కాలంలోనే పూర్తి చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన అమెరికన్ సివిల్ ఇంజనీర్స్ సొసైటీ సంస్థ, ఆ విజయగాథను, తెలంగాణ ప్రభుత్వ ఘనతను అమెరికాలో వివరించేందుకు రావాలని ప్రత్యేకంగా మంత్రి కెటిఆర్‌కు ఆహ్వానం పంపించింది.

సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించనున్న మంత్రి
అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి హాజరయ్యే సివిల్ ఇంజనీర్ల సమక్షంలో మంత్రి కెటిఆర్, సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, దాని ద్వారా అందుతున్న ఫలాలు, ఇతర ప్రణాళికలను ఒక ప్రజెంటేషన్ రూపంలో అందించనున్నారు. కాళేశ్వరంతో పాటు మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నీళ్ళు అందించిన విధానం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన సామాజిక ఆర్థిక ప్రగతిని మంత్రి కెటిఆర్ వివరించనున్నారు.

చివరి వారం వరకు కొనసాగనున్న అమెరికా పర్యటన
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రపంచానికి వివరించే అవకాశం దక్కడం పట్ల కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణ, ఇవాళ పచ్చని పంటలతో కళకళలాడడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు ఈ నేలపై ఉన్న మమకారం, అపార జ్ఞానం, ముందుచూపే కారణమని కెటిఆర్ చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పలు కంపెనీలతో మంత్రి కెటిఆర్ సమావేశం అవుతారు. ఈ నెల చివరి వారం వరకు కొనసాగే ఈ పర్యటనలో పలు అమెరికన్ కంపెనీలు తమ పెట్టుబడి ప్రకటనలను చేసే అవకాశం ఉన్నది.

పెట్టుబడులు ఆకర్షించడమే లక్షంగా..
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాలోని ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, సిఇఒలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను వివరించనున్నారు.

లండన్ పర్యటనతో రాష్ట్రానికి పలు పెట్టుబడులు
ఇటీవల యుకె పర్యటనకు వెళ్లివచ్చిన ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు రాష్ట్రానికి పలు పెట్టుబడులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ హైదరాబాద్‌లో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. నగరంలో ఏర్పాటు చేసే ఆ కేంద్రంతో 1,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కెటిఆర్ సమక్షంలో డాన్జ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరింది. బ్రిటన్ ఆధారిత ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ రూ.205 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో పరిశ్రమ పెట్టేందుకు ముందుకొచ్చింది.

రసాయన పరిశ్రమ క్రోడా ఇంటర్నేషనల్‌తోనూ అక్కడ మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. జీనోమ్ వ్యాలీలో గ్లోబల్ టెక్నికల్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. లండన్‌లో జరిగిన ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో పాల్గొన్న కెటిఆర్.. తెలంగాణ రాష్ట్ర విధానాలు, అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలతో రాష్ట్రం తొమ్మిదేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని సోదాహరణంగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News