Sunday, November 24, 2024

పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

KTR Letter to Minister Jitendra Singh on Competitive Exams

లక్షలాది మంది రాస్తున్న యుపిఎస్‌సి తదితర పోటీ పరీక్షలను ఇంగ్లీష్, హిందీల్లోనే నిర్వహిస్తున్నారు                     ఇతర భాషల అభ్యర్థులు  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
ఆంగ్ల మాద్యమంలో చదవని, హిందీ మాట్లాడని అభ్యర్థులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి                        ఇతర ప్రాంతీయ భాషల్లోనూ వీటిని నిర్వహించాలి
సిఎం కెసిఆర్ గతంలో ప్రధానికి లేఖ రాశారు : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలను తెలుగు లాంటి ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌కి ఆదివారం ఆయన ఒక లేఖ రాశారు. కేంద్ర సర్వీసులు, ఇతర శాఖలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నిర్వహించే పోటీ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడుతున్నారన్నారు. ఈ పరీక్షలను కేవలం ఇంగ్లీష్, హిందీలో నిర్వహించడం ద్వారా అభ్యర్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా ఆంగ్ల మాధ్యమం చదవని విద్యార్థులు, హిందీ మాట్లాడని ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ఈ విషయంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు గతంలో ఒకసారి ప్రధాన మంత్రికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ కూడా రాశారన్నారు. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కేంద్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని ఆ లేఖలో కెసిఆర్ చేసిన విజ్ఞప్తిని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు.
ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేసి జాతీయ పోటీ పరీక్షలను, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలను 12 భారతీయ భాషల్లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తనకు తెలుసన్నారు. కానీ దురదృష్టవశాత్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో తాత్సారం చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాజాగా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ద్వారా కానిస్టేబుల్ నియామకాలు, ఎన్‌ఐఎ, ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్ మెన్ ఎగ్జామినేషన్ వంటి ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ లలో కేవలం హిందీ, ఇంగ్లీష్ లో మాత్రమే పరీక్ష రాసేలా నిబంధనలు ఉన్నాయన్నారు. ఇలాంటి నిబంధన కారణంగా హిందియేతర రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని కెటిఆర్ పేర్కొన్నారు.
ప్రాంతీయ భాషల్లో జాతీయ స్థాయి పోటీ పరీక్షలను వ్రాయలేకపోవడం వల్ల పెద్దఎత్తున నిరుద్యోగులు తమ ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది భారతీయ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ స్థాయిలో ప్రభుత్వ అనుబంధ శాఖలు, ఇతర రిక్రూట్‌మెంట్ బోర్డులైన ఎస్‌ఎస్‌సి, ఆర్‌బిఐ, పిఎస్‌బి, యుపియస్‌సి, ప్రభుత్వ రంగ సంస్థల భర్తీ ప్రక్రియలో ఇతర ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న కేబినెట్ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించి ఇంతవరకు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లను నిలుపుదల చేయాలన్నారు. వాటిల్లో ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించి, ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. తద్వారా అన్ని రాష్ట్రాల యువతీయువకులకు సమాన అవకాశాలు కలుగుతాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

KTR Letter to Minister Jitendra Singh on Competitive Exams

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News