Tuesday, November 5, 2024

ప్రజా రవాణా పటిష్టం

- Advertisement -
- Advertisement -

నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం
రానున్న రోజుల్లో ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ కీలకం
నగర ప్రజల జీవితాల్లో ఇది భాగం కానుంది…
మెట్రో రైల్ రెండో దశ విస్తరణ నేపథ్యంలో నగర మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి కెటిఆర్ సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ నేపథ్యంలో నగర మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో బుధవారం మంత్రి కెటిఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిజిపి, మెట్రో రైల్, పురపాలక, ఎయిర్ పోర్ట్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ దీనికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం గురించి వారితో ఆయన చర్చించారు.

ఒకటి, రెండు రోజుల్లో నగర ప్రజా ప్రతినిధుల సమావేశం
హైదరాబాద్‌కు ఇది అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని, ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదని, ఇది మొత్తం నగర ప్రజల జీవితాల్లో భాగం కానుందని మంత్రి మంత్రులతో పేర్కొన్నారు. ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు కావడం వలన నగర వ్యాప్తంగా ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు కావాలని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అవసరమైన నగర ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని ఒకటి, రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డిలకు కెటిఆర్ సూచించారు.

స్థల పరిశీలనకు మంత్రులు, ప్రజాప్రతినిధులు వెళ్లాలి…
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేం దుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కెటిఆర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొనే సమావేశ ప్రాంగణం ఏర్పాట్లను ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఈ సందర్భంగా కెటిఆర్ అధికారులకు సూచించారు. దీనికి సంబంధించిన స్థల పరిశీలనను మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి నగరంలోని ట్రాఫిక్, రక్షణ ఏర్పాట్లు, ప్రణాళికల గురించి ఇప్పటినుంచే కసరత్తు చేయాలని పోలీసులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు.

KTR Meeting Officers over Metro Phase II Carridor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News