Monday, January 27, 2025

లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి
పార్టీ నేతలకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దిశానిర్ధేశం
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ నేతలతో కెటిఆర్ సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు పార్టీ నేతలు, శ్రేణులను సిద్ధం చేసేందుకు బిఆర్‌ఎస్ నాయకత్వం సిద్ధమవుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని విశ్లేషించుకుంటూనే, తదుపరి ఎన్నికల సన్నాహంపై అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు.

ఈ భేటీకి మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి, స్థానిక ఎంఎల్‌ఎలు ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీ, మాజీ ఎంఎల్‌ఎలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఈ సందర్భంగా కెటిఆర్ పార్టీ నేతలకు సూచించారు. లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, అందుకు సమాయత్తం కావాలని చెప్పారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నేతలను ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని తెలిపారు.

చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలి
చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆకాంక్షించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ గడ్డ మీద బిఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కెటిఆర్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో బిఆర్‌ఎస్ పార్టీ సుమారు 98,000 ఓట్ల లీడ్‌లో ఉందని కెటిఆర్ గుర్తు చేశారు. అదేస్థాయిలో… అంతే స్ఫూర్తితో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాలని చేవెళ్ల ప్రజాప్రతినిధులకు కీలక నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కోరారు.

నన్ను పోటీ చేయమని కెటిఆర్ చెప్పారు: ఎంపి రంజిత్‌రెడ్డి
శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి తెలిపారు. చేవెళ్ళ ఎంపీ అభ్యర్థిగా తనను పోటీ చేయమని కెటిఆర్ చెప్పారని పేర్కొన్నారు. రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయాలని కెటిఆర్ దిశానిర్దేశం చేశారని అన్నారు. తెలంగాణ అంటేనే బిఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, అయితే ఏమీ చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యమని ఆక్షేపించారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో బిఆర్‌ఎస్‌కు శాసనసభ ఎన్నికల్లో లక్షా తొమ్మిది వేల మెజారిటీ వచ్చిందని, ఎంపి ఎన్నికల్లో అంత కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బిజెపి పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News