Thursday, January 23, 2025

తెలంగాణకు తొలి ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా గమ్యస్థానంగా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో చేపట్టనున్న వ్యాపార విస్తరణ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు వ్యాపార వేత్తలను ఆయన కోరారు.గురువారం ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు. ప్రధానంగా టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్‌లో సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాల పైన చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మాట్లాడిన మంత్రి కెటిఆర్, రాష్ట్రంలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా వివరించారు.
తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టాటా గ్రూపు వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భగా కెటిఆర్ కోరారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని పేర్కొన్న ఆయన…… టిసిఎస్ కార్యకలాపాలను వరంగల్ కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ప్రణాళికలతో టాటా గ్రూప్ ముందుకు పోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ వివరించారు. అందువల్ల ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా విమానయాన రంగంలో టాటా సంస్థ మంచి పురోగతి సాగిస్తున్న నేపథ్యంలో హైదరాబాదులో ఒక ఎమ్మార్వో ( మెయింటేనెన్స్, రిపేర్స్, ఓవరాల్, ఎంఆర్‌ఒ) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కెటిఆర్ కోరారు.
కాగా తెలంగాణలోని వివిధ రంగాల్లో తమ సంస్థ పెద్ద ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని తెలిపిన టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, రాష్ట్రంలో తమ కార్యకలాపాలు కొనసాగుతున్న తీరుపట్ల అత్యంత సంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువుగా ఉంటుందని తమ సంస్థ అనుభవం నిరూపించిందన్న చంద్రశేఖరన్, భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో కచ్చితంగా తెలంగాణకు కీలకమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశ ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య పరిస్థితులు, వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాల వంటి అనేక ఇతర అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి.

స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రండి!
మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ జెఎస్‌డబ్లూ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ తో ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సంస్థకు స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అపార విజయవంతమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జిందాల్‌ను ఆయన కోరారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సేయిల్ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భఁగా కెటిఆర్ గుర్తుచేశారు. బయ్యారంతో పాటు పక్కనే ఉన్న చత్తీస్‌ఘడ్‌లో ఉన్న ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచుకొని అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని కెటిఆర్ వివరించారు.

జెఎస్‌డబ్లూ వంటి ప్రతిష్టాత్మక సంస్థ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే, అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కెటిఆర్ హామీ ఇచ్చారు. జిందాల్ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విద్య, క్రీడారంగం వంటి ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిందాల్‌ని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం పాలసీల గురించి తమకు అవగాహన ఉన్నదన్న సజ్జన్ జిందాల్, కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి, పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఆర్ధిక సూచికలు వేగంగా అభివృద్ధి
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో సమావేశమైన కెటిఆర్…. తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్‌ఎంసిజి రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంతో పాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఆయా రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవకాశమని కెటిఆర్ తెలిపారు. ఈ రంగంలో ఇతర సంస్థలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.

పామ్ ఆయిల్ ఉత్పత్తి కోసం ఒక బృహత్తర లక్ష్యాన్ని ఎంచుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఆ దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహిస్తోందని తెలిపారు. వంట నూనెల ఉత్పత్తి కోసం హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత ఆర్ పి జి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయంకాతోనూ కెటిఆర్ సమావేశమై, పెట్టుబడులు, రాష్ట్ర ప్రగతిపై చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News