ప్రముఖ తెలంగాణ జానపద కళాకారుడు పద్మశ్రీ కిన్నెర మొగులయ్యను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదివారం కలిశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసిన కళాకారుల పెన్షన్ నిలిపివేయడంతో ఆయన కూలీ పని చేసుకుంటున్నట్లు వచ్చిన వార్తల పట్ల స్పందించిన కెటిఆర్, మొగులయ్య ఆర్థిక ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ మేరకు కెటిఆర్ మొగులయ్యకు కొంత ఆర్థిక సహాయం చేశారు. ఆయనను అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మొగులయ్యకు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్‌తో పాటు అన్ని రకాల హామీలను నెరవేర్చాలని కెటిఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొగులయ్య లాంటి జానపద కళాకారులు తెలంగాణకి గర్వకారణమని వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. కెటిఆర్ తనకు చేసిన సహాయానికి మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు. రోజువారి జీవితం గడపడడమే కష్టం ఉన్న ప్రస్తుత సందర్భంలో కెటిఆర్ చేసిన సహాయం పట్ల మొగులయ్య సంతోషం వ్యక్తం చేశారు.
చార్ సౌ అనేది సీట్ల గురించి కాదు..పెట్రోల్ రేట్ల గురించి : ఎక్స్‌లో కెటిఆర్
పెట్రోల్ ధరలతో ఇప్పటికే సామాన్యుడి నడ్డి విరుస్తున్న కాషాయపార్టీ, అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని నమ్మి ఓటేస్తే ఇగ ఆగమే అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బిజెపి అంటున్న చార్ సౌ అనేది సీట్ల గురించి కాదని, పెట్రోల్ రేట్ల గురించి అని ఎద్దేవా చేశారు. 2014లో లీటర్ పెట్రోల్ 70 రూపాయలు ఉండగా, 2024లో 110కు చేరిందన్నారు. ఈ సారీ బిజెపి అధికారంలోకి వస్తే 2029 నాటికి లీటర్ పెట్రోల్ 400 అవుతుందని మండిపడ్డారు. పెట్రోల్ పెరుగుదలపై బిఆర్‌ఎస్ రూపొందించిన వీడియోను కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.