Saturday, November 23, 2024

మూసీకి అమృతం

- Advertisement -
- Advertisement -

TS SSC Results 2022 will release on June 26th

ఎస్‌టిపిల నిర్మాణంతో నీటి వనరుల కాలుష్యాన్ని వంద శాతం తగ్గించవచ్చని వివరణ
అమృత్ 2 కింద రూ.2850 కోట్లు ఇవ్వాలని అభ్యర్థన
ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్ కారిడార్‌కు సహకరించాలని విజ్ఞప్తి రెండు అంశాలపై కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్
పూరీకి లేఖను అందించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీతో రాష్ట్ర ఐటి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కెటిఆర్ ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్లాన్‌కు ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రిని కెటిఆర్ కోరారు. ఎస్‌పిల నిర్మాణాలకు రూ.8,654.54 కోట్లు ఖర్చు అవుతుందని, ప్రాజెక్టు వ్యయంలో మూడోవంతు అమృత్-2 కింద రూ.2,850కోట్లు ఇవ్వాలని ఆయన కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు సహకరించాలని కేంద్రమంత్రిని కెటిఆర్ కోరారు. ఈ సందర్భంగా రెండు అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి కెటిఆర్ లేఖను అందించారు.
లేఖలోని వివరాలు ఇలా..
సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్‌ప్లాన్ ప్రకారం 62 ఎస్టీపి ప్లాంట్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, ఎస్టీపి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.8,684.54కోట్లు అంచనా వ్యయం అవుతందని మంత్రి కెటిఆర్ ఆ లేఖలో తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో మూడోవంతు అమృత్-2 పథకం కింద రూ.2,850కోట్లు మంజూరు చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. మిగతా మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుందని లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 100 శాతం మురుగునీటి శుద్ధిని చేయడమే కాకుండా మూసీనది, ఇతర నీటి వనరులకు మురుగు కాలుష్యాన్ని తగించే అవకాశం ఉందని మంత్రి కెటిఆర్ ఆ లేఖలో స్పష్టం చేశారు. వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు సహకరించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసిన మంత్రి కెటిఆర్ పెరుగుతున్న జనాభా, ఉపాధి అవకాశాలతో హైదరాబాద్ కూడా ఎదుగుతున్న మహానగరమని ఆయన గుర్తు చేశారు. ప్రయాణికుల కోసం రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి 69కి.మీ మెట్రో రైలు నెట్‌వర్క్, 46 కి.మీ సబ్-అర్బన్ సేవలు/మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) హైదరాబాద్‌లో ఉందని కెటిఆర్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మెట్రో రైల్, ఎంఎంటిఎస్‌లకు ఫీడర్ సేవలుగా పని చేసేందుకు వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్( PRTS), రోప్‌వే సిస్టమ్స్ వంటి స్మార్ట్ అర్భన్ మొబిలిటీ సొల్యూషన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోందని ఆయన లేఖలో వెల్లడించారు.
10 కిలోమీటర్ల పొడవున రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్
అసెంబ్లీ నుంచి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు 10 కిలోమీటర్ల పొడవున రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్ కారిడార్‌ను ప్రతిపాదించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రతిపాదిత కారిడార్ వివిధ రవాణా వ్యవస్థలతో అనుసంధానించబడిందని ఆ లేఖలో కెటిఆర్ పేర్కొన్నారు. ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్ (IPRRCL) కారిడార్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనంతో పాటు డిపిఆర్‌లకు కన్సల్టెంట్స్‌గా ఉన్నాయన్నారు. దేశంలో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ కోసం ప్రమాణాలు, స్పెసిఫికేషన్‌లను సిఫార్సు చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ హై పవర్ కమిటీని నియమించిందని కెటిఆర్ ఆ లేఖలో తెలిపారు. ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ప్రమాణాలు, నిర్ధేశాలు, ఇతర అంశాలను త్వరగా అందించడానికి శాఖా పరంగా సమన్వయం చేయాలని మంత్రి కెటిఆర్ కేంద్రమంత్రిని కోరారు. హైదరాబాద్‌లో ప్రతిపాదిత కారిడార్‌ను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని కేంద్ర మంత్రికి మంత్రి కెటిఆర్ ఆ లేఖలో విన్నవించారు.
కెటిఆర్‌తో ఫాక్స్‌కాన్ బృందం భేటీ
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫాక్స్‌కాన్‌ను పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు గురువారం ఆహ్వానించారు. న్యూ ఢిల్లీలో సందర్శించిన ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియును మంత్రి కలుసుకున్నారు. భారతదేశంలో ఫాక్స్‌కాన్‌ను విస్తరించే ప్రణాళికలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ హెల్త్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్‌పై కీలక చర్చ జరిగింది. తెలంగాణలో మౌలిక సౌకర్యాలను పరిశీలించడానికి ఫాక్స్‌కాన్ ప్రతినిధులకు కెటిఆర్ ఆహ్వానం పలికారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీని పెంపొందించడానికి అనువైన వాతావరణం మరియు మౌలిక సదుపాయాలను సృష్టించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కెటిఆర్ వివరించారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రం సాధించిన పురోగతిని గమనించడం పట్ల ఫాక్స్‌కాన్ చీఫ్ సంతోషించారు. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చిస్తూ, లియు ఇలా అన్నారు. తెలంగాణ రాష్ట్రం అందించే అవకాశాలను అన్వేషించడానికి తాము ఎదురుచూస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ తయారీ డొమైన్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంతరించుకున్న ఫాక్స్‌కాన్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో కూడా ప్రవేశించాలనే నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఫాక్స్‌కాన్ బృందాన్ని ఆహ్వానిస్తున్నానన్నారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి గమ్యస్థానంగా ఉద్భవించిందన్నారు. రాష్ట్రం పటిష్టమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కలిగి ఉందని, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చడానికి మంచి స్థానంలో ఉందని వెల్లడించారు. కాగా, తైవాన్-ఆధారిత హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల (ఇఎంఎస్) ప్రొవైడర్‌లలో ఒకటి. అనేక అగ్రశ్రేణి అంతర్జాతీయ కస్టమర్‌లకు అతిపెద్ద సరఫరాదారులలో ఒకటి. ఫాక్స్‌కాన్‌కు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో తయారీ యూనిట్లు ఉన్నాయి. 2021లో, హాన్ హై వార్షిక ఆదాయం ప్రపంచవ్యాప్తంగా $206 బిలియన్లకు చేరుకుంది. 2021లో ఫార్చ్యూన్ గ్లోబల్ 500లో కంపెనీ 22వ స్థానంలో ఉంది.

 

 

 

 

 

 

KTR Meets Union Minister Hardeep Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News