హైదరాబాద్: రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పూటకో మాట మారుస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అన్నింటినీ మరిచిపోయిందని, ఇవాళ తెలంగాణ ఆగమైందని, మనమే ప్రశ్నించాలన్నారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈరోజు భువనగిరిలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్స్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడారు. బిట్స్ పిలానీలో చదివిన విద్యావంతుడు రాకేష్ రెడ్డి అని కొనియాడారు. ప్రశ్నించే గొంతుకు రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అటు వైపు ఉన్న ప్రత్యర్థి బ్లాక్‌మెయిలర్ అని, సొల్లు కబుర్లు చెప్పే మోసగాడు అని మండిపడ్డారు. 30 వేల ఉద్యోగాలను కెసిఆర్ భర్తీ చేస్తే వాటికి నియామక పత్రాలు ఇచ్చి రేవంత్ రెడ్డి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని, ఇది సిగ్గు చేటు అని, రేవంత్ రెడ్డివి పచ్చి అబద్ధాలు అని ధ్వజమెత్తారు. పిఎం మోడీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని, విభజన హామీలను తుంగలో తొక్కారని, బిజెపి వాళ్లు గుడి కట్టి ఓట్లు అడుతున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు.
యాదాద్రి ఆలయాన్ని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అద్భుతంగా నిర్మించారని, కాళేశ్వరం లాంటి ఆధునిక ఆలయాన్ని కూడా కెసిఆర్ నిర్మించారన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉందని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించామని, బిఆర్‌ఎస్ పాలనలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. చేసిన పని సరిగా చెప్పుకోలేక అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయ్యామని, స్వల్ప తేడాతో ఓటమి చెందామని కెటిఆర్ వివరించారు.