ఆర్మూర్: ఆర్మూర్‌కు వచ్చిన బిఆర్‌ఎస్ నేత, మంత్రి కె.తారాక రామారావుకు తృటిలో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఎంపి సురేష్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్మూర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గురువారం నామినేషన్ ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయినా కెటిఆర్ తొణకకుండా, బెణకకుండా నింపాదిగా ఆ తరువాత జరిగిన కొడంగల్ రోడ్‌షోను కూడా పూర్తి చేసి ప్రగతిభవన్‌కు చేరుకోవడం విశేషం.జీవన్‌రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొనడానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎంపి సురేష్‌రెడ్డితో కలిసి ఆర్మూర్‌కు వచ్చారు. అయితే నామినేషన్ ర్యాలీలో పాల్గొనడానికి ప్రచార రథం ఎక్కారు. రథం పైభాగంలో రేలింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రచార రథంపై ఎక్కిన ఈ రేలింగ్‌ను ఆసరా చేసుకొని నిలబడ్డారు. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ కదిలారు. నామినేషన్ ర్యాలీ ఆర్మూర్ పట్టణంలోని ఆయా వీధుల గుండా సాగింది. ప్రచార రథంపైకి బిఆర్‌ఎస్ నేతలు ఎక్కువ సంఖ్యలో ఎక్కడంతో ముందుభాగంలో ఉన్న కెటిఆర్, సురేష్‌రెడ్డి, జీవన్‌రెడ్డిలు ఒత్తిడికి గురయ్యారు.
ఈ క్రమంలోనే పాత ఆర్మూర్‌లోని కింది బజార్ వద్ద కరెంటుతీగలు అడ్డురావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో నేతలు ఒక్కసారిగా ముందుకు ఒరిగిపోయారు. దీంతో ప్రచార రథంలో పైభాగంలో ఉన్న రేలింగ్ విరిగిపోయింది. మధ్యలో ఉన్న కెటిఆర్ వేగంగా వంగిపోయి ప్రచార రథం ముందున్న అద్దంకు గుద్దుకున్నాడు. కానీ రేలింగ్ బ్యాలెన్స్ కాకపోవడంతో ఎంపి సురేష్‌రెడ్డి వాహనంపై నుంచి కింద పడిపోయాడు. దీంతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సైతం పక్కకు ఒదిగిపోయారు. రేలింగ్ విరిగి తల భాగం అద్దంకు కొట్టుకొవడంతో కెటిఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఎంపి సురేష్‌రెడ్డికి మాత్రం ఎక్కువ గాయాలు కావడంతో అతని హుటాహుటిన నిజామాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. కెటిఆర్ భద్రతా సిబ్బంది అప్రమత్తమై కెటిఆర్‌ను రథంపై నుంచి దింపి కారులో తీసుకెళ్లారు. కాగా కెటిఆర్ మాత్రం గాయాలను సైతం పట్టించుకోకుండా కొడంగల్‌లో జరిగే ప్రచార సభలకు వెళ్లారు.