నిజామాబాద్: రూ.50 కోట్లతో కళాభారతి నిర్మాణం చేపట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో ఎటు చూసిన నిందు కుండల్లాంటి చెరువులు, పచ్చటి పంటపొలాలు కనిపిస్తున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో మినీ ట్యాంక్‌బండ్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. బిజెపి, కాంగ్రెస్ బాసులు ఢిల్లీలో ఉంటారని, బిఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలే బాసులని, వచ్చే ఎన్నికలలో ఢిల్లీ బాసులైన బిజెపి, కాంగ్రెస్‌కు తెలంగాణ ఆత్మగౌరవం మధ్య పోటీ అని అన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో చూస్తున్నామని, మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోందని, డయాలసిస్ రోగులకు కూడా రూ.2016 పెన్షన్ ఇస్తున్నామని, పుట్టిన పసికందు నుంచి పండు ముసలి వరకు అందరికీ పథకాలు వస్తున్నాయని కెటిఆర్ ప్రశంసించారు.
Also Read: అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి: నామా
సిఎం కెసిఆర్ మీద నిజామాబాద్ ఎంపి అరవింద్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, మతాల మధ్య పంచాయతీలు పెట్టడం తప్ప ఒక్క మంచి మాట రాదని దుయ్యబట్టారు. తెలంగాణకు వచ్చేందుకు ప్రధాని మోడీకి ముఖం లేదన్నారు. జన్‌ధన్ ఖాతాలు ఓపెన్ చేస్తే రూ.15 లక్షల చొప్పున ఇస్తానని మోడీ అన్నారని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ మాట తప్పారని కెటిఆర్ దుయ్యబట్టారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1200 తీసుకపోయారని, లీటర్ పెట్రోల్ ధరను రూ. 70 నుంచి రూ.115 తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు.
బిజెపిని ప్రజలు గల్లా పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలను పట్టించుకోనిది కాంగ్రెస్ కాదా? అని చురకలంటించారు. తెలంగాణ పట్టిన వ్యాధి టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అని, ఒక్క దిక్కు సంచలన నాయకుడు కెసిఆర్ అని, మరో దిక్కు సంచులు మోసే నాయకుడు రేవంత్ అని కెటిఆర్ మండిపడ్డారు. మతం పేరుతో చిచ్చు పెట్టే బిజెపి ఒక వైపు, మూడు గంటల కరెంట్ ఇస్తానన్న కాంగ్రెస్ కావాలా? మూడు పంటల కెసిఆర్ కావాలా? అని ప్రజలను అడిగారు. తెలంగాణ రైతు ఇప్పుడిప్పుడే భవిష్యత్ వైపు చూస్తున్నారని, కళ్యాణ లక్ష్మి 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.