Tuesday, January 21, 2025

బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు మంగళవారం నందినగర్ నివాసంలో కెటిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డినీ అన్ని రకాలుగా గౌరవించిన పార్టీని వీడటం ఆయనకే నష్టమని చెప్పారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం కార్యకర్తలను బాధించిందని వాపోయారు. అయితే కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు ఎంత పెద్ద వాళ్లైనా సరే వదిలిపెట్టేది లేదని, వారికి కచ్చితంగా కార్యకర్తలు బుద్ధి చెబుతారని కెటిఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డిని కనీసం అడిగిన వాళ్లు కూడా లేని దయనీయ పరిస్థితి వచ్చిందని చెప్పారు. గులాబి జెండా మీద గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడినా… గ్రామాల్లో పార్టీ కార్యకర్తలంతా బిఆర్‌ఎస్ పార్టీతోనే ఉన్నారని పార్టీ శ్రేణులు కెటిఆర్‌కు తెలిపారు.

ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం సంతోషం- : కెటిఆర్
గురుకుల పాఠశాలల్లో సమస్యలపై ప్రభుత్వం మొత్తానికి స్పందించటంపై కెటిఆర్ స్పందించారు. గత 8 నెలల కాలంలో విషాహారం కారణంగా దాదాపు 500 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. విద్యార్థుల భోజనానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కెటిఆర్ సోమవారం ప్రభుత్వాన్ని కోరగా, మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ పాఠశాలలను సందర్శించారు. మంత్రులు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల భోజనం సహా ఇతర అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కెటిఆర్ కోరారు. మొన్నటి వరకు కూడా అంతా బాగానే ఉందన్నట్లు మొద్దు నిద్రలో ఉన్న సర్కార్‌ను మేల్కొనేలా చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

గురుకుల పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలి
గురుకుల పోస్టులలో భర్తీ కాకుండా మిగిలిపోతున్నటువంటి పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థుల్లో భర్తీ చేయాలని కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ గురుకుల అభ్యర్థులు మంగళవారం కెటిఆర్‌ను ఆయన నివాసంలో కలసి వారి సమస్యలను వివరించారు. గురుకుల పోస్టులలో భర్తీ కాకుండా మిగిలిపోతున్నటువంటి పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థుల్లో భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని దీని కోసం ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గురుకుల విద్యార్థులు కెటిఆర్‌ను కోరారు. అభ్యర్థుల విజ్ఞప్తిపై కెటిఆర్ సానుకూలంగా స్పందించారు. గురుకుల విద్యార్థులకు, డిఎస్‌సి విద్యార్థుల తరఫున బిఆర్‌ఎస్ పార్టీగా అభ్యర్థులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు సిఎస్ శాంతి కుమారికి ఫోన్ చేసి వారి సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News