కేంద్రంపై నిప్పులు చెరిగిన కెటిఆర్
దేశంలో తెలంగాణ
రాష్ట్రం లేదా?
మనకు రావాల్సిన ప్రాజెక్టులను
అడ్డుకుంటున్న కేంద్రం
బిజెపియేతర వివక్ష
ఓట్లు, సీట్లున్న యుపిపైనే ప్రేమ
ఇదిఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
మోడీ తీరు మారాలి
మన తెలంగాణ/హైదరాబాద్/ఝరాసంఘం : మోడీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్షపై మండిపడ్డారు. హైదరాబాద్‌బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని తాము కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఢిఫెన్స్ కారిడార్‌ను బుందేల్ఖండ్‌కు తరలించింద ని బిజెపి ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. అన్ని రంగాల్లో దూసుకపోతున్న తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రానికి కేంద్రం చేయూతను అందించాల్సింది పోయి.. అడ్డంకులు సృ ష్టిస్తోందని ధ్వజమెత్తారు. ఇదేనా కేంద్రానికి ఉన్న ఫెడరల్ స్పూర్తి? అని విమర్శించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం లేదా? లేక బిజెపియేతర రాష్ట్రా లు అభివృద్ధికి నోచుకోవద్దా? అని కెటిఆర్ నిలదీశారు. ఒక ప్రధానిగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని కోరుకోవాల్సిన మోడీ రాష్ట్రాలకే సం పూర్ణ సహకారాలను అందించడం, రాష్ట్రాలను దూరం పెట్టడం ఎంత వరకు సమంజమన్నారు.
పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న ప్రాం తంలో కాకుండా ఉత్తరప్రదేశ్‌లో ఓట్లు, సీట్లున్నాయని అక్కడే అన్ని అభివృద్ధి పనులు చేస్తామంటే అది కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం తమ చేతిలో ఉంది కదా ఎలాంటి వసతులు, సదుపాయా లు లేని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలనుకుంటే అది సరైన నిర్ణయం కాదన్నారు. కేంద్రం ఇప్పటికైనా తన విధానాలపై పునరాలోచించుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిమ్జ్‌లో (విఇఎం) టెక్నాలజీస్ పరిశ్రమ నిర్మాణానికి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, కేంద్రం నుంచి ఎలాం టి సహకారం లేకపోయినప్పటికీ దేశ రక్షణ వ్యవస్థకు అవసరమైన పరిశ్రమలను హైదరాబాద్‌లో నెలకొల్పడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో దేశ రక్షణలో హైదరాబాద్‌లోని రక్షణ పరిశ్రమలది కీలకపాత్ర అని అన్నారు. జహీరాబాద్‌ను ఆటోమొబైల్ తయారీ రంగానికి కేంద్రంగా చేయనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇంకా పరిశ్రమలు రావాలి…. ఉపాధి అవకాశాలు పెరగాలన్నారు. పరిశ్రమలు కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండాలన్నారు. వెమ్ టెక్నాలజీస్ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వెమ్ టెక్నాలజీలో సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలన్నారు. సిఎస్‌ఆర్‌లో భాగంగా చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్‌పర్సన్ సునీతా లకా్ష్మరెడ్డి, ఎంపి బిబి పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, శాసనసభ్యులు మాణిక్‌రావు, చంటి క్రాంతి కిరణ్, భూపాల్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
భూములు కోల్పోయిన రైతులకు ఉపాధి కల్పించాలి
భూమి కోల్పోయిన రైతుల కుటుంబాలకు నిమ్జ్లో కంపెనీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దీని కారణంగా రాష్ట్రంలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయన్నారు. ఏ చిన్న గ్రామానికి వెళ్ళినా భూముల ధరలు బాగాపెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల కోసం భూములను ఇస్తున్న వారికి ఎక్కడా అన్యాయం జరగవద్దన్నారు. ధరలకు అనుగుణంగా నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా స్థానిక గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
ప్రతి పట్టణం….ఒక అద్భుతం
రాష్ట్రంలోని ప్రతి పట్టణం ఒక అద్భుతమని కెటిఆర్ అన్నారు. రాష్ట్రాలను పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల ముగిసిన పట్టణ ప్రగతి కోసం రూ. 18.79 కోట్ల విడుదల చేశామన్నారు. మరో రూ.50 కోట్లు మౌలిక వసతుల కోసం మంజూరు చేశామన్నారు. ఇక జహీరాబాద్ మున్సిపాలిటీ అయిన తర్వాత ఒకే సారి రూ. 50 కోట్లు ఇచ్చామన్నారు. ఈ ఘనత ఒక సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. ఒక్క మున్సిపాలిటీకి ఒకేసారిగా ఇంత పెద్దమొత్తంలో ఏ ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయదన్నారు. కానీ కెసిఆర్ అలాంటి వ్యక్తి కాదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే సిఎం లక్షమన్నారు. దీని కోసం కెసిఆర్ ఎంత దూరంమైన పోతారు…ఎవరితోనైనా కొట్లాడుతారన్నారు.
ఇప్పటికే జహీరాబాద్ మున్సిపాలిటికీ చాలా సౌకర్యాలు కల్పించామన్నారు. మహిళల కోసం కూరగాయల మార్కెట్‌ను రూ. 14.50 కోట్లతో కడుతున్నామన్నారు. ఇది ఆగస్ట్ 15 వరకు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం జహీరాబాద్ లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోందన్నారు. హరిత హారం కోసం రూ. 2.55 కోట్ల ఖర్చ చేశామన్నారు.
రైతంగానికి 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం
రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని కెటిఆర్ అన్నారు. అలాగే వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు.. ప్రజలకు కావాల్సిన తాగునీటిని కూడా రోజు అందిస్తున్నామన్నారు. దీని కోసం కెసిఆర్ భగీరథ ప్రయత్నం చేశారన్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్షం చేయగా….ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత ఆ ప్రాజెక్టుల నిర్మాణాలను పరుగులు తీయించామన్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయే రీతిలో కాళేశ్వరం వంటి అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించుకున్నామన్నారు. దీని కారణంగానే నేడు వ్యవసాయ రంగం బంగారు మయంగా మారిందన్నారు. మన రాష్ట్రంలో పండించిన పంటను చివరకు కేంద్రం కూడా కొనుగోలు చేయలేనంతగా ధాన్యాన్ని పండిస్తున్నామన్నారు.
ఇక గతంలో పెన్షన్లు కేవలం రూ. 200 ఉండగా…… దానిని రు. 2వేలకు పెంచామన్నారు. రాష్ట్రంలో 40 లక్షల ముందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు. మరో నెలల్లో అర్హులైన అందరికి పెన్షన్ ఇస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం ఉచితంగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. కెటిఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయన్నారు. ఈ ప్రాంతంలో సంగమేశ్వర దేవుడు చాలా పవర్ ఫుల్ దేవుడున్నారు. సింగూరు నీళ్లు తెచ్చి ఇక్కడ ఉన్న బీడు భూములన్నీ తడుపుతామన్నారు.. లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఆయన తెలిపారు.
మహింద్రా సంస్థ తయారుచేసిన 3,00,001వ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన కేటీఆర్
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తన 3,00,001వ ట్రాక్టర్‌ను తెలంగాణలోని ప్లాంట్‌లో తయారుచేసింది. ఈ సందర్భంగా జహీరాబాద్‌లోని మహీంద్రా ప్లాంట్‌లో ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మహీంద్రా 3,00,001వ ట్రాక్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం దాన్ని నడిపారు.
ఈ విషయాన్ని కెటిఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘హేయ్… ఆనంద్ మహీంద్రా జీ… నన్ను చూడండి… మీ ఉత్పత్తులకు ఎంత చక్కగా ప్రచారం కల్పిస్తున్నానో! అందుకని మీరు మా రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు స్థాపించాల్సి ఉంటుంది‘ అంటూ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి చమత్కరించారు.