కంచ గచ్చిబౌలి భూముల వెనుక రూ.10వేల కోట్ల
భారీ కుంభకోణం బిజెపి ఎంపి మద్దతుతో సిఎం
రేవంత్‌రెడ్డి కుట్ర ఆ ఎంపికి అనుచిత లబ్ధి
చేకూర్చుతున్నారు ఆ బిజెపి నేత ఎవరో త్వరలో
చెబుతా ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ రేవంత్‌రెడ్డి
రూ.60వేల కోట్ల హెచ్‌ఎండిఎ భూములపై
కన్నేసిన సిఎం రేవంత్ : కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 3డీ మంత్రంతో (మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం) అమలు చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వి మర్శించారు. కంచ గచ్చిబౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయిందని అన్నారు.ఈ వ్యవహారంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ నేత లు శ్రీనివాస్ గౌడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఇతర నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, హెచ్‌సియు భూ ముల వెనుక రూ.10 వేల కోట్ల ఆర్థిక కుంభకో ణం ఉందని ఆరోపించారు. కుంభకోణానికి కర్త,
కర్మ, క్రియ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అ ని పేర్కొన్నారు. అటవీ భూమిని తాకట్టు పెట్ట డం, అమ్మే అధికారం ప్రభుత్వానికి కూడా లేద ని, సిఎం రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసే భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఒక బిజెపి ఎంపీ మద్దతుతో రేవంత్ రెడ్డి.. హెచ్‌సియు భూముల కుంభకోణానికి తెరతీశారని ఆరోపించారు. ట్రస్ట్ ఎడ్వజైర్స్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బ్రోకరిజం చేసిందని, అందుకు గాను.. సదరు కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చారని అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎంను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని..ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని ఆ కంపెనీ తెలిపిందని, దీనికోసం అన్ని చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్‌బీఐ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు.
తమది కాని భూమిని టిజిఐఐసి ఎలా తాకట్టు పెడ్తుంది..?
అటవీ భూమిని అమ్మాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు. నామమాత్రపు జీవోతో అమ్మకానికి పేపర్లు రాసిచ్చారని అన్నారు. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ప్రకారం ఆ భూమి విలువ రూ.5,239 కోట్లు అని, ఆ భూమి విలువ రూ.30 వేల కోట్లు అని ప్రభుత్వం చెబుతోందని.. లేని భూమి ఉన్నట్లు చూపి రుణం తీసుకోవాలని చూశారని వ్యాఖ్యానించారు. పారదర్శకత లేకుండా మొదట రూ. 30 వేల కోట్లు అని, ఆ తర్వాత రూ. 20 వేల కోట్లని చివరికి రూ. 16 వేల కోట్లకు ఆ భూమి విలువను కుదించి తన వాళ్లకు కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అది పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. అతిపెద్ద కుంభకోణం అని పేర్కొన్నారు. తమది కాని భూమిని టిజిఐఐసి ఎలా తాకట్టు పెడ్తుందని ప్రశ్నించారు. ఆర్‌బిఐ నిబంధనలు పాటించకుండా.. 10 వేల కోట్లు తెచ్చారన్నారు. లిటికేషన్ ల్యాండ్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించకుండా బ్రోకర్ ఆధారంగా బ్యాంక్ ప్రభుత్వానికి రుణం ఇచ్చిందని పేర్కొన్నారు.
ఈ దేశంలో సామాన్యుడు బ్యాంకు రుణం తీసుకోవాలంటే 100 డాక్యుమెంట్లను పరిశీలించి 100 కొర్రీలు పెట్టి రుణం ఇస్తారని, అదే ఒక సంపన్నుడు అధికారపక్షంతో అనుబంధం ఉన్నవారు రుణం అడిగితే నిమిషాల్లోనే మంజూరు చేస్తారని చెప్పారు. కనీసం భూమి ఉందో లేదో కూడా పరిశీంచకుండా రుణం ఇచ్చారని, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అదే జరిగిందని పేర్కొన్నారు. ఐసిఐసిఐ లాంటి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు, భూ యాజమాన్య హక్కును పరిశీలించకుండానే ఆ భూమి ఎవరిదో తెలుసుకోకుండానే రూ.10 వేల కోట్లు రుణం ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నారు. ఈ ఆర్థిక మోసంతో ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఆ బ్యాంకు కుప్పకూలే అవకాశం ఉందని అన్నారు.ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్‌బిఐ మార్గదర్శకాలను తుంగలో తొక్కారని చెప్పారు. అటవీ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, ఆ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని అన్నారు. వాల్టా, ఫారెస్టు చట్టాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని అన్నారు.
కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తునకు ఆదేశించాలి
బిజెపి ఎంపీ సారధ్యంలోనే బ్రోకరేజ్ కంపెనీ తీసుకొచ్చారని, ఆ ఎంపీకి రేవంత్ అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. త్వరలోనే ఆ బిజెపి ఎంపీ ఎవరో చెబుతానని వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఆర్‌బిఐ గవర్నర్‌కు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ ఎఫైర్స్, సెబీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. నిర్దిష్టమైన ఆధారాలతో కేంద్రానికి లేఖలు రాస్తున్నానని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తెరతీసింది కేవలం ఈ 400 ఎకరాలకు మాత్రమే కాదు అని, రూ.60 వేల కోట్ల విలువైన హెచ్‌ఎండిఎ భూముల ద్వారా దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు అడ్డుకోకపోతే మరో రూ.60 వేల కోట్ల భూ దోపిడీకి ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొన్నారు.
కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం ప్రధానమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండానే జరిగిందని భావిస్తున్నామని, ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించి కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ది నిరూపించుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంకు, బ్రోకర్ సంస్థ పాత్రపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్, బిజెపి మధ్య ఒప్పందం ఉన్నట్లే అంటూ వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సియు భూముల వెనుక క్విడ్ ప్రోకో ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ దోపిడీని ఉపేక్షించమని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించకపోతే న్యాయస్థానానికి వెళతామని చెప్పారు. అలాగే తమ పార్టీ తరఫున ప్రధానమంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని, మిత్రపక్షాల ద్వారా లోక్‌సభ, రాజ్యసభల్లోను ఈ అంశాన్ని లేవనెత్తుతాం అని వెల్లడించారు.
ఆ 400 ఎకరాలు ముమ్మాటికి అటవీ భూమే
సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం కంచ గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాలు ముమ్మాటికి అటవీ భూమే అని కెటిఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆర్‌ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారని, కానీ ఇప్పటిదాకా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోదని చెప్పారు. అమృత్ స్కాంలో రేవంత్ రెడ్డి బావమరిదికి రూ. 1137 కోట్ల రూపాయలు దారి మళ్లించారని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఇడి దాడులు జరిగితే ఇప్పటిదాకా అధికార ప్రకటన రాలేదని పేర్కొన్నారు. ఈ ఆర్థిక మోసాన్ని కూడా అదే కోవలో కలిపేసి కాంగ్రెస్ బిజెపి ఒకరినొకరు కాపాడుకుంటారో అని సందేహం వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ఈ డబ్బులతో రైతు బంధు వేస్తామని తమ అనుకూల మీడియాలో ప్రచారం చేశారని, కానీ రూ. 5000 కోట్లు కూడా అన్నదాతల ఖాతాలో వేయలేదని చెప్పారు. మిగతా రూ. 5000 కోట్లు ఏమయ్యాయని అడిగారు. మంత్రివర్గంలో ఉన్న కాంట్రాక్టర్లు, వాళ్ల మనుషులకు కమిషన్లు, బిల్లులు చెల్లించడానికి ఉపయోగించారని ఆరోపించారు. బీకన్ ట్రస్టీ షిప్ అనే కంపెనీ, ట్రస్ట్ అడ్వైజర్స్ సంస్థలకు హెచ్‌ఎండిఏ భూములను ప్రభుత్వం అప్పజెప్పిందని, ఈ రెండు సంస్థలపై వెంటనే నిషేధం విధించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వం తీసుకున్న రూ.10 వేల కోట్ల బాండ్లను ఆర్‌బిఐ వెంటనే రద్దు చేయాలని అననారు. గురువారం వచ్చిన అపెక్స్ కమిటీ పర్యావరణ విధ్వంసంపై విచారణ జరిపిందని, అందుకే ఈ ఆర్థిక మోసంపై ఫిర్యాదు చేయలేదని కెటిఆర్ తెలిపారు.