Tuesday, December 24, 2024

రేవంత్ మాటలను మరాఠాలు నమ్మలేదు

- Advertisement -
- Advertisement -

 తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని మహారాష్ట్ర
ప్రజలు గమనించారు మహారాష్ట్ర ఓటమితో మరింత
బలహీనపడిన కాంగ్రెస్ బిజెపి, కాంగ్రెస్‌లకు సొంతంగా
ప్రభుత్వాలను ఏర్పాటు చేసే శక్తి లేదు రానున్నది ప్రాంతీయ
పార్టీల శకం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చెప్పిన అబద్దాలకు అక్కడి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే అన్ని హామీలు అమలు చేసినట్లు చేసిన ప్రచారానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి మహారాష్ట్రలో తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్ ఆటలు సాగలేదని అన్నారు. మహారాష్ట్రలో కాం గ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డికి కెటిఆర్ చురకలు అంటించా రు. తెలంగాణలో ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకుండానే మహారాష్ట్రలో మహిళలకు రూ. 3000 ఇస్తామని నయవంచన చేసే కుట్రను ప్రజలు గుర్తుపట్టారని చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్న తీరును మహారాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు. తెలంగాణలో ఏదో పొడిచేశామని రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్లు అన్ని కూడా కాంగ్రెస్‌ను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని విమర్శించారు. మహారాష్ట్రలో అదానీని గజదొంగగా అభివర్ణించి తెలంగాణలో అదే అదానీతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని ప్రజలు గుర్తించారని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా తన ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే పని మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి కెటిఆర్ సలహా ఇచ్చారు.

రానున్నది ప్రాంతీయ పార్టీల శకమే
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు, ప్రాంతీయ ఆస్తిత్వాలను చులకనగా చూసిన రెండు జాతీయ పార్టీలను ప్రజలు తిరస్కరించారని కెటిఆర్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల నాటి నుంచే దేశంలో సంకీర్ణ శకం మొదలైందని గుర్తు చేశారు. భవిష్యత్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగటం ఖాయమని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు సొంతంగా ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవని చెప్పారు. జాతీయ పార్టీలకు అడ్డుగా నిలబడి రాష్ట్రాల అస్తిత్వం, అభివృద్ధి కోసం పోరాటం చేసే పార్టీలను వేధిస్తే ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతామని జార్ఖండ్ ప్రజలు నిరూపించారన్నారు. హేమంత్ సోరెన్‌ను వేధించిన కేంద్రానికి ఈ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని పేర్కొన్నారు.జార్ఖండ్‌లో ఘన విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు, ఆ పార్టీ అధ్యక్షులు హేమంత్ సోరెన్‌కు కెటిఆర్ అభినందనలు తెలిపారు.

ప్రాంతీయ పార్టీలతో అండతోనే మహారాష్ట్రలో బిజెపి గెలుపు
మహారాష్ట్రలోనూ బిజెపి గెలిచేందుకు ప్రాంతీయ పార్టీ నేతలు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లే కీలకమయ్యారని కెటిఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరగడం దేశ సమాఖ్య స్ఫూర్తికి, రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. భవిష్యత్తులోనూ కెసిఆర్ లాంటి బలమైన ప్రాంతీయ నాయకులను ప్రజలు ఆశీర్వదించి, అండగా నిలిస్తే దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధి ఆ తీర్పు దోహదం చేస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ చేతగాని తనంతోనే బిజెపి పురోగతి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరింత బలహీన పడుతుందని కెటిఆర్ చెప్పారు. గతంలో హర్యానాలో, ఇప్పుడు మహారాష్ట్రలో గెలుస్తుందని భావించినప్పటికీ రెండు రాష్ట్రాల్లో ప్రజల మనసులను ఆ పార్టీ గెలుచుకోలేకపోయిందన్నారు. తెలంగాణ, కర్ణాటకలో మోసాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఏమాత్రం మంచి అభిప్రాయం లేదని తేలిపోయిందని స్పష్టం చేశారు. బిజెపికి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దయనీయ పరిస్థితిలో ఆ పార్టీ ఉందని చెప్పారు. కేవలం కాంగ్రెస్ చేతగానీ, అసమర్థ విధానాల కారణంగానే బిజెపి మనుగడ కొనసాగుతుందని అన్నారు.

ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బిజెపి గెలుస్తుందని పేర్కొన్నారు. తమ చేతగాని తనాన్ని, అసమర్థతను గుర్తించాల్సింది పోయి ఇప్పటికీ సిగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీలను ఎలా అంతం చేయాలన్న కుట్రపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు…బిజెపి తక్కువ కాదని అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దన్నట్లుగా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఎన్ని కుట్రలు చేసిన ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేరని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News